నమ్మొద్దు నమ్మొద్దు బీజేపీని…

నమ్మకు నమ్మకు ఈ రేయిని, కమ్ముకుపోయే ఈ మాయని అని ఒక సినీ కవి అంటాడు. ఇపుడు ఎర్రన్నలు కూడా అదే పల్లవిని పట్టుకున్నారు. దేశంలో బీజేపీని నమ్మవద్దంటూ మిగిలిన పార్టీలకు హిత బోధ చేస్తున్నారు.…

నమ్మకు నమ్మకు ఈ రేయిని, కమ్ముకుపోయే ఈ మాయని అని ఒక సినీ కవి అంటాడు. ఇపుడు ఎర్రన్నలు కూడా అదే పల్లవిని పట్టుకున్నారు. దేశంలో బీజేపీని నమ్మవద్దంటూ మిగిలిన పార్టీలకు హిత బోధ చేస్తున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరమంటున్నారు. దేశమంతా బీజేపీకి దూరమవుతున్నారని, కాషాయన్ని గద్దె నుంచి దించడానికి ఇదే సరైన సమయం అంటున్నారు.

ఏపీ ఇలా తయారు కావడానికి బీజేపీయే కారణమని సీపీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి పి మధు ఘాటైన విమర్శలు చేశారు. ఏపీకి రాజధాని లేకపోవడం కూడా బీజేపీ చలువే అన్నారు. రాష్ట్రాలకే రాజధానుల ఏర్పాటు మీద సర్వ హక్కులు ఉంటాయని ఒక వైపు కేంద్ర బీజేపీ చెబుతుందని, మరో వైపు  రాష్ట్ర బీజేపీ అమరావతి రైతులకు మద్దతు అంటుందని ఆయన ఎత్తి చూపారు. ఇలాంటి ద్వంద్వ వైఖరితో రాజకీయం చేస్తే బీజేపీని నమ్మొచ్చా అని ఆయన ప్రశ్నించారు.

పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకలో పెట్టుకుని వెళ్ళినట్లుగా అమరావతి రైతుల ఉద్యమంలో బీజేపీని కలుపుకోవడం వల్ల నష్టమే కలుగుతుందని మధు స్పష్టంగా చెప్పారు. అమరావతి రాజధాని సహా ఏపీలోని భారీ పరిశ్రమలను ప్రైవేట్ పరం చేయడం, అన్ని రకాలుగా రాష్ట్రాన్ని పట్టించుకోకపోవడం తప్ప బీజేపీ చేసినేంటి అని ఆయన నిలదీశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించాలని బీజేపీ నిర్ణయించడం కంటే దారుణం మరోటి లేదని ఆయన అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 14 నుంచి 27 వరకూ సీపీఎం ప్రజా ఉద్యమంలో భాగంగా భారీ ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తుందని మధు చెప్పారు. ఇప్పటిదాకా బీజేపీని నమ్మిన వారు ఎవరూ బాగుపడలేదు కాబట్టి ఏపీతో సహా దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు ఆ వైపు నుంచి దూరం జరగాలని  ఆయన హితవు పలికారు.