అమరావతిలోనే పరిపాలన రాజధాని కొనసాగించాలనే డిమాండ్‌తో అరసవల్లి దాకా మహా పాదయాత్ర ప్రారంభమైంది. అమరావతిలో అద్భుత రాజధాని నిర్మాణం జరుగుతోందని గతంలో ఎల్లో బ్యాచ్ గ్రాఫిక్స్‌లో వైకుంఠం చూపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పాదయాత్ర-2 కూడా అద్భుతహః అనే రీతిలో మొదలైందనే ప్రచారానికి తెరలేచింది. అది ఏ స్థాయిలో వుందంటే…
“రాజధాని అమరావతిలో తూర్పున వెలుగు రేఖలు ప్రసరించక ముందే ఉద్యమ శంఖారావాలు ప్రతిధ్వనించాయి. జై అమరావతి, జయహో అమరావతి నినాదాలతో పరిసరాలు ప్రతిధ్వనించాయి (రాష్ట్రం ప్రతిధ్వనించిందని అనలేదు)” ఇలా మొదలైంది ఎల్లో మీడియాలో ఉద్యమం.
ఇక ఈ రెండు నెలలు ఎల్లో మీడియా పోటీ పడి మరీ పాదయాత్రను కీర్తిస్తూ రాస్తుంటుంది, తమ చానళ్లలో చూపుతుంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యమైన సంగతి తెలుసుకోవాలి. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పేరుతో గతంలో హైకోర్టు నుంచి తిరుపతి దాకా పాదయాత్ర-1 పూర్తి చేశారు. అప్పట్లో భారీ మొత్తంలో విరాళాలు సేకరించారు.
కానీ లెక్కలు చెప్పలేదనే కారణంతో అమరావతి జేఏసీలో విభేదాలు చోటు చేసుకున్నాయి. అసలు పాదయాత్ర వెనుక అసలు ఎజెండానే కొంత మంది స్వార్థమనే విమర్శ లేకపోలేదు. కేవలం విరాళాలు సేకరించి చంద్రబాబుకు ముట్టజెప్పడానికే అని ఇటీవల మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అమరావతి నుంచి అరసవల్లి వరకూ చేపట్టిన పాదయాత్ర-2కు సంబంధించి కలెక్షన్ గురించి తప్పక తెలుసుకోవాలి. ఈనాడు మీడియా సంస్థ వెల్లడించిన లెక్కల ప్రకారం మొదటి రోజు కలెక్షన్ రూ.16 లక్షలు. భాష్యం ప్రవీణ్ ట్రస్ట్ తరపున రూ.5 లక్షల చెక్కు, ఎర్రబాలెం రైతులు రూ.4 లక్షలు, మంగళగిరి వైద్యుల సంఘం రూ.లక్ష, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తల్లి ఆలూరి జయప్రద రూ.లక్ష చెక్కును అమరావతి పరిరక్షణ సమతి, రాజధాని రైతు ఐక్య కార్యాచరణ సమితి నేతలకు అందజేశారు. మొదటి రోజు షోకే రూ.16 లక్షలు వసూలైతే, రెండు నెలల్లో ఏ రేంజ్లో ఉంటుందో అనే చర్చ జరుగుతోంది.