సీనియర్ నటుడు కృష్ణంరాజుకు పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి కృష్ణంరాజు వెళ్లినట్టే, రోజా కూడా అదే మార్గంలో పయనించారు. ఇద్దరిదీ సినీ నేపథ్యమే. కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం రోజా రాష్ట్ర మంత్రి.
ఇదిలా వుండగా కృష్ణంరాజు అంత్యక్రియల్లో ఏపీ ప్రభుత్వం తరపు నుంచి వేణుగోపాలకృష్ణ, రోజా, కారుమూరి, చీఫ్ విప్ ప్రసాద రాజు పాల్గొననున్నారు. మంత్రులంతా కృష్ణంరాజుకు ఘనంగా నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు మృతి జీర్ణించు కోలేనిదని రోజా అభిప్రాయపడ్డారు.
సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు రారాజు అని కొనియాడారు. కృష్ణంరాజు మరణం సినీ, రాజకీయ రంగానికి తీరని లోటన్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కృష్ణంరాజు రాజకీయాలకు అతీతంగా అందరితో స్నేహంగా మెలిగే వారన్నారు. మంత్రి వేణుగోపాల్ మాట్లాడుతూ సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు సేవలు మరువలేనివన్నారు.
కృష్ణంరాజు అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది. ఇవాళ సాయంత్రం ఆయన అంత్యక్రియలను ఫామ్‌హౌస్‌లో నిర్వహించనున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణంరాజుకు కడసారి నివాళులర్పించేందుకు తరలి వచ్చారు. కృష్ణంరాజు మృతితో టాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగింది.