లాక్ డౌన్-4తో సినీ ఇండస్ట్రీలో మరింత గుబులు

లాక్ డౌన్ కొనసాగుతుందని అందరూ ఊహించారు కానీ, వినోద రంగానికి ఏమైనా మినహాయింపులుంటాయేమోని ఆశించారు. అయితే కేంద్రం ఆ విషయంలో తొందరపడలేదు. ఇప్పటికే వలస కూలీలతో తలబొప్పి కట్టింది. ఇప్పుడు మాల్స్, సినిమాలు, షూటింగ్…

లాక్ డౌన్ కొనసాగుతుందని అందరూ ఊహించారు కానీ, వినోద రంగానికి ఏమైనా మినహాయింపులుంటాయేమోని ఆశించారు. అయితే కేంద్రం ఆ విషయంలో తొందరపడలేదు. ఇప్పటికే వలస కూలీలతో తలబొప్పి కట్టింది. ఇప్పుడు మాల్స్, సినిమాలు, షూటింగ్ ల అనుమతులను టచ్ చేస్తే విమర్శలపాలవడం మినహా ఇంకే ఉపయోగం లేదని మోడీ సర్కారు ఆలోచించింది. సామాజిక రవాణా, జోన్ల  నిర్ణయ భారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలపైనే పెట్టింది.

మరి రాష్ట్ర ప్రభుత్వాలేమైనా పర్మిషన్లిస్తాయా అంటే.. వీరింకా భయపడిపోతున్నారు. ఎల్జీ పాలిమర్స్ ఉదంతాన్నే తీసుకోండి, లాక్ డౌన్ లో పనులు ఆగిపోవడం వల్ల ఆ ప్రమాదం జరిగినట్టు అనుమానాలున్నాయి. ప్రతిపక్షాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలో పనులు జరగడానికి అనుమతివ్వడం వల్లే ప్రమాదం జరిగినట్టు తప్పుడు ప్రచారం చేశాయి. లాక్ డౌన్ నిబంధనలు సడలించకుండా, కంపెనీ తెరవడానికి అనుమతివ్వకుండా ఉండి ఉంటే.. ఆ అపనింద రాష్ట్ర ప్రభుత్వంపై పడేది కాదు. సినీ ఇండస్ట్రీకి అనుమతులిచ్చినా రేపు అదే పరిస్థితి.

ఇండస్ట్రీలో కార్మికులున్నారు నిజమే కానీ, వినోద రంగం అనే ముద్ర వారిపై పడింది. అందుకే.. విందులు, వినోదాలకి లీస్ట్ ప్రయారిటీ అంటున్నాయి ప్రభుత్వాలు. కేంద్రం తప్పించుకుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా షూటింగ్ లకు నో పర్మిషన్ అంటూ కరాఖండిగా చెప్పేశాయి.

ప్రస్తుతానికి మే 31 వరకు అనుమతుల్లేవు. అప్పటిలోగా కరోనా కేసుల సంఖ్య తగ్గితే ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. ఒకవేళ ఇలాగే పెరుగుతుంటే మాత్రం, షూటింగ్ లకు అనుమతులిచ్చే అవకాశాలు తక్కువ. అలాగే థియేటర్లపై కూడా నిర్ణయం మరింతకాలం వాయిదా పడుతుంది. లాక్ డౌన్ -4 అమలులోకి వస్తే తమ పనులు మొదలు పెట్టుకోవచ్చు అనుకున్న సినీ ఇండస్ట్రీ తాజా పరిస్థితుల నేపథ్యంలో మరింత డీలాపడింది. నిజానికి ఈ అంశంపై 2 రోజుల కిందటే తలసాని పరోక్షంగా ప్రకటన చేశారు. మరో 2-3 నెలల వరకు థియేటర్లు తెరుచుకునే అవకాశాల్లేవని చెప్పేశారు. ఇప్పుడు అదే జరగబోతోంది. 

ఇప్పుడప్పుడే థియేటర్లు తెరుచుకోవని అర్థమైపోయింది కాబట్టి.. రిలీజ్ కి రెడీగా ఉన్న కొన్ని పెద్ద సినిమాలు కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్ ల వైపు చూస్తున్నాయి. ఏదేమైనా వినోదరంగానికి మినహాయింపుల్లేకుండా లాక్ డౌన్ పొడిగించడం వల్ల సినీ ఇండస్ట్రీలో ఆందోళన మరింత పెరిగింది. ఓవైపు థియేటర్ల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నా ఓటీటీల వైపు మొగ్గక తప్పడంలేదు.

మత్తులో మత్తు డాక్టర్/నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ అసలు రూపం

ప్రయాణాలకు ఏపీఎస్‌ ఆర్టీసీ సిద్ధం