ఏపీలో ఇప్పుడే ఈ కాకి లెక్కలెందుకు?

ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడో ఎన్నికల ఫలితాల పై ఇప్పుడు వెలువడుతున్న సర్వే అంకెలన్నీ కాకి లెక్కలే. దేనికీ శాస్త్ర బద్ధత లేదు. ఇప్పుడే ఉండే అవకాశం కూడా లేదు. ఏదో ప్రచారం కోసమన్నట్టుగా ఏవో అంకెలను…

ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడో ఎన్నికల ఫలితాల పై ఇప్పుడు వెలువడుతున్న సర్వే అంకెలన్నీ కాకి లెక్కలే. దేనికీ శాస్త్ర బద్ధత లేదు. ఇప్పుడే ఉండే అవకాశం కూడా లేదు. ఏదో ప్రచారం కోసమన్నట్టుగా ఏవో అంకెలను విడుదల చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొన్ని రోజులు హడావుడి చేయడానికి, ఆత్మానందం పొందడానికి ఈ కాకి లెక్కలు పనికి వస్తాయి.

ఎన్నికలు ఇప్పట్లో లేకపోవడం, ఎప్పుడో తెలియక పోవడం, ఏ  పార్టీ దేనితో పొత్తో ఇంకా స్పష్టత లేకపోవడం, ఏ పార్టీ తరఫున ఏ నియోజక వర్గం నుంచి ఎవరు అభ్యర్దో తెలియక పోవడం, ఆ అభ్యర్థికి ఒక్కో ఓటును ఎంతకు కొనగల కెపాసిటీ ఉన్నదో తెలియక పోవడం, పోలింగ్ శాతం ఎంత ఉండే అవకాశం ఉంది, ఏ పార్టీ భుజ బలం ఎంత? మొదలైన అంశాలలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. ఇవేమీ తేలకుండానే ఆ పార్టీ కి అన్ని.. ఈ పార్టీ కి ఇన్ని అంటూ లెక్కలను రాష్ట్రం మీదికి వదులుతున్నారు.

2024లో అధికారాన్ని 'ఇప్పుడున్న స్థాయి' కి తక్కువ లేని రీతిలో నిలుపుకోడానికి వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది అధికారాన్ని చేజిక్కించుకోడానికి టీడీపీ కూడా రంగంలోకి దిగింది. అధికార పక్షమైన వైసీపీకి అధికార పక్షం కావడం వల్ల – – సహజంగానే కొన్ని అనుకూలతలు ఉంటాయి. ఎన్నికల సమయంలో వైసీపీ చేతిలోనే ప్రభుత్వ పగ్గాలు ఉంటాయి. అందువల్ల, చేతిలో అధికార యంత్రాంగం ఉంటుంది. డబ్బులకు కొరత ఉండదు. పోలీసు యంత్రాంగం  సైతం అధికార పార్టీ కనుసన్నల్లో ఉంటుంది.

ఇవి మాత్రమే గాక, జనం బ్యాంక్ ఖాతాల్లో విడతల వారీగా నగదు బదిలీ చేయడమే ఒక ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ పని చేస్తున్నారు. దీనితో పాటు, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ…. ఎప్పుడు, ఎలా, ఎక్కడ దొరుకుతుందా అని అధికార యంత్రాంగం ఒక కన్ను వేసి ఉంచుతున్నది. టీడీపీని  వీలైనంత డీ -మోరలైజ్ చేయడం ఈ నిఘా లక్ష్యం కావచ్చు. దీనితో పాటు, వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు సరిగ్గా పనిచేయడం లేదంటూ ముఖ్యమంత్రి అప్పుడప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు పత్రికల్లో కథ‌నాలు వస్తున్నాయి.

వైసీపీ ప్రయత్నాలను రెండు ముక్కల్లో చెప్పాలంటే నగదు బదిలీ, టీడీపీని తొక్కి నారదీయడం అనే ద్విముఖ వ్యూహం తో దూకుడుగా వెడుతున్నది. ఈ వ్యూహంతో వైసీపీ 175 సీట్లకు 175 సాధించగలదనే నమ్మకంతో ముఖ్యమంత్రి ఉన్నారు. అవసరమైతే, నలభై, యాభై స్థానాల్లో కొత్త అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించడానికి నిముషం కూడా ఆలోచించరు. మొహమాటం లేనేలేదు. గెలుపు ఒక్కటే జగన్ కు ముఖ్యం.

ఇక, వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి అయిన టీడీపీ…. మొత్తం శక్తిని కూడదీసుకుని పోరాడుతున్నది. అధికారం, డబ్బు, పోలీసు యంత్రాంగం చేతిలో లేవు. అయితే, పటిష్టమైన కార్యకర్తల నెట్ వర్క్ టీడీపీకి పెట్టని కోటగా ఉంది. వైసీపీకి ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదనే భావన జగన్‌కు ఉన్నట్టుగానే, టీడీపీ సీనియర్ నేతల్లో చాలామంది వళ్ళు వంచి చాకిరీకి మళ్లడం లేదనే భావన చంద్రబాబుకూ ఉంది.

ఆయన అక్కడ హెచ్చరికలు చేస్తున్నట్టుగానే… ఈయనా ఇక్కడ హెచ్చరికలు చేస్తున్నారు. అయితే, జగన్ లాగా టికెట్ల కేటాయింపులో చంద్రబాబు నిక్కచ్చిగా. నిర్మొహమాటంగా, సూటిగా నిర్ణయాలు తీసుకోలేరు అనే భావం టీడీపీలో ఉంది. మొహమాటం బాగా ఎక్కువ. దానివల్ల, ఆయన ఎంతో కొంత నష్టపోయే అవకాశం లేక పోలేదు.

ఇక, జగన్ ప్రభుత్వం పై ప్రజల్లో అనుకూలత ఎంత ఉన్నది. వ్యతిరేకత ఎంత ఉన్నది అనే అంశం ఎన్నికల్లో 'నిర్ణయాత్మక శక్తి' గా ఉంటుందా అంటే అనుమానమే.

ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తి  డబ్బు, అభ్యర్థి అర్ధబలం, అంగ బలం, పోలీసు బలగం, ఎలక్షన్ మాన్యుపులేషన్ స్కిల్స్.  నదురు, బెదురు లేకుండా ప్రత్యర్థులపై ఏది బడితే అది ప్రచారం చేయగల సామర్ధ్యం. వీటికి తోడు, ఓటర్లలో అనూహ్య స్థాయిలో పెరిగిన 'ఓటుకు నోటు ' యావ. పేదవాడే కాదు, డబ్బులను టాయిలెట్లు, అటకలు, డస్ట్ బిన్నులు, పరుపుల కింద దాచుకోడానికి నానా ఇబ్బందులు పడేవారిలో కూడా 'ఫ్రీగా' ఓటు వేయబుద్ధి కావడం లేదు.

గత ఎన్నికల్లో… ఓటు – 3,4 వేల రూపాయలు పలికింది అని చెప్పుకున్నారు. ఈసారి హైదరాబాద్‌లోని బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం ధర పెరిగిపోయినట్టు…. ఆంధ్రలో తన ఓటు రేటును ఓటర్ పెంచేయవచ్చు అనే భయం రాజకీయ వర్గాల్లో కనపడుతున్నది.

2019 ఎన్నికల తరువాత మరి అన్నింటి ధరలూ పెరిగాయి. కూరగాయల ధరలు పెరిగాయి, బియ్యం ధర పెరిగింది, ఇంటి సరుకుల ధరలు పెరిగాయి, వంట నూనెల ధరలు పెరిగాయి. బ్రాందీ, విస్కీ, జిన్ను, బీరు ధరలు పెరిగాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. ఇంటికి పన్ను పెరిగింది, కరెంటు బిల్లు పెరిగింది, బస్సుల్లో చార్జీలు పెరిగాయి, ఉద్యోగుల లంచాలు పెరిగాయి. హోటళ్ల ల్లో ఇడ్లీ, దోశ  దగ్గరి నుంచి సమస్తమూ పెరిగాయి. ఇవి గాక, చెత్త పన్ను ఒహటి.

మరి, ఓటు రేటు పెరగొద్దా అనేది ఓటర్ మనోగతం గా కనపడుతోంది. లాజిక్కే గదా!

అందువల్ల, ఎన్నికల నాటికి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఓటుకు కనీసం పదివేలకు తక్కువ లేకుండా ఓటర్ మహాశయుడు ఆశించే అవకాశం ఉంది.

రాష్ట్రంలో ఉన్న 175 నియోజక వర్గాలలోనూ మొత్తం మూడు కోట్ల డెబ్భై మంది ఓటర్లు ఉండే అవకాశం ఉంది. అంటే, సరాసరిని ఒక్కో నియోజకవర్గానికి కుడి ఎడంగా రెండు లక్షల మంది ఓటర్లు  ఉండే అవకాశం ఉంది. గెలవాలి అనుకున్న వారు నియోజక వర్గానికి కనీసం లక్ష ఓటర్ల అభిమానం అయినా చూరగొనాలి.

ఎన్నిక ఫలితం అనేది ఇన్ని అంశాల పై ఆధార పడి ఉంటుంది. 50 లోపు, 100 లోపు, 200 లోపు, చివరకు 1000 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయేవారు గెలిచేవారు పాతిక, ముప్ఫయ్ మంది వరకు ఉంటారు. కిందటి సారి విజయవాడలో టీడీపీ అభ్యర్థి బొండా ఉమా తొమ్మిది ఓట్ల తేడాలో ఓడిపోయారు.

అందువల్ల… ఇప్పటి నుంచే ఈ కాకి లెక్కలు ఎందుకు?

'సర్వే'శ్వర రావులు – అంకెల మీద కాక వివిధ అంశాల మీద పబ్లిక్ పెర్సెప్షన్ తెలియ చేసే సర్వే లు చేస్తే…. అందరికీ ఉపయోగం గా ఉంటుంది. మాట వరసకు…..

* ముఖ్యమంత్రిగా ఈసారి జగన్ అయితే బాగుంటుందా…. చంద్ర బాబు అయితే బాగుంటుందా?

* ఎగ్జిగ్యూటివ్ కాపిటల్ (?)గా విశాఖ పై మీ అభిప్రాయం ఏమిటి?

*జగన్ పాలన ఎలా ఉన్నదని అనుకుంటున్నారు?

* పోలీసు యంత్రాంగం చట్టబద్ధంగానే వ్యవహరిస్తున్నదని అనుకుంటున్నారా?

* వైసీపీ నవరత్నాల గురించి ఏమనుకుంటున్నారు? 

*అమరావతి పై ప్రభుత్వ తీరు ను సమర్థిస్తారా?

పోలవరం ప్రాజెక్ట్‌ను జగన్ ప్రభుత్వం పడుకోబెట్టిందనే టీడీపీ విమర్శలతో ఏకీభవిస్తారా?

చంద్రబాబు ఇక ముఖ్యమంత్రి కావడం అనేది భవిష్యత్ లో ఉండదని వైసీపీ నేతలు చేసే విమర్శలతో ఏకీభవిస్తారా?

ఇలా అనేక అంశాలను ఒక్కొక్కటిగా తీసుకుని, లేదా ఓ ఏడెఎనిమిది అంశాలను తీసుకుని ప్రజాభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం నిజాయతీగా చేస్తే సమాజానికి, వైసీపీ కి, టీడీపీ కి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

భోగాది వేంకట రాయుడు