కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ పరిణామాలు ఏవీ సంకీర్ణ సర్కారు నిలబడటానికి ఆస్కారం ఇవ్వడంలేదు. ఒకవైపు రెబెల్ ఎమ్మెల్యేలు ముంబై లో తలదాచుకున్నారు. వారిని కలవడానికి వెళ్లిన కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెబెల్స్ బస చేసిన హోటల్లో తను రూమ్ బుక్ చేసుకున్నట్టుగా చెప్పినా ఆయనను లోపలకు వెళ్లనివ్వలేదు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ను కూడా పోలీసులు అదేరీతిన అదుపులోకి తీసుకున్నారు. ఆయన కూడా రెబెల్స్ బస చేసిన హోటల్ లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఇక సీఎల్పీ మీటింగుకు కూడా చాలామంది ఎమ్మెల్యేలు మొహం చాటేసినట్టుగా తెలుస్తోంది. కుమారస్వామి ప్రభుత్వం ఎలాగూ పడిపోతుందనే లెక్కలతో చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పటికే బీజేపీలోకి టచ్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది.
ఇలా సంకీర్ణ సర్కారు దాదాపుగా మైనారిటీలోకి పడిపోయినట్టే. ఈ నేపథ్యంలో కుమారస్వామి సర్కారుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే అని.. త్వరలోనే అసెంబ్లీ సమావేశాల వరకూ అయినా కుమార ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? లేక రాజీనామా చేసేస్తారా? అనేది ఆసక్తిదాయకమైన అంశంగా మారింది.