కొద్దిసేపటి కిందట వ్యూహం సినిమా నుంచి రెండో టీజర్ రిలీజ్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఎప్పట్లానే ఇందులో కూడా డైలాగ్ పార్ట్ తక్కువ ఉంది, యాక్షన్ పార్ట్ ఎక్కువుంది. అయితే టీజర్ కు వర్మ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ మాత్రం అదిరింది.
ఓ వ్యక్తి : ఎప్పుడో ఒకప్పుడు మీరు కల్యాణ్ ను కూడా వెన్నుపోటు పొడుస్తున్నారుగా?
చంద్రబాబు: వాడికి అంత సీన్, తనను తానే పొడుచుకుంటాడు.
వ్యూహం టీజర్-2 చివర్లో రామ్ గోపాల్ చూపించిన సన్నివేశం ఇది. టీజర్ మొత్తం ఒకెత్తయితే, ఈ ఒక్క డైలాగ్ మరో ఎత్తు. ఈ సన్నివేశంతో.. చంద్రబాబు దృష్టిలో పవన్ స్థాయి ఏంటనేది చెప్పకనే చెప్పాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
వ్యూహం సినిమాలో జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాత్రలే ప్రధానంగా ఉంటాయని స్పష్టం చేసిన వర్మ.. చెప్పినట్టుగానే టీజర్ లో ఈ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. టీజర్ లో వీళ్లతో పాటు, చిరంజీవి, సోనియాగాంధీ లాంటి పాత్రలకు కూడా స్థానం దక్కింది. అయితే టీజర్ లో జగన్ పాత్రధారి తర్వాత, ఎక్కువ స్పేస్ పవన్ కల్యాణ్ పాత్రకే ఇచ్చాడు దర్శకుడు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ఇది.
కుట్రలు, దుర్మార్గపు ఆలోచనలకు మధ్యలో ఓ వ్యక్తి ఎలా ఎదురులేని నాయకుడిగా ఎదిగాడనే విషయాన్ని వ్యూహంలో చూపించారు. రెండో టీజర్లో నాయకునిగా జగన్ ఎదిగిన క్రమాన్ని చూపించాడు. నిజం తన షూ లెస్ కట్టుకునే లోపు అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తుందంటూ జగన్ పాత్రధారి చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది.