ఇటీవలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నెగ్గిన పలువురు ఎమ్మెల్యేలపై కోర్టుల్లో అనర్హత వేటు పిటిషన్ లు దాఖలు అయిన సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపు వివాదాలతో కొంతమందిపై అనర్హత పిటిషన్లు కోర్టుకు వెళ్లగా, కేసుల విషయంలో మరి కొందరిపై అనర్హత డిమాండ్లు కోర్టుకు చేరాయి.
తమపై నమోదు అయిన కేసుల వివరాలను, తమపై జారీ అయిన అరెస్టు వారెంట్ వివరాలను ఎన్నికల అఫిడవిట్లో కొందరు దాచి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ అంశంపై వారి ప్రత్యర్థులు కోర్టుకు ఎక్కారు.
ఇప్పటికే తెలుగుదేశం ఎమ్మెల్యే చిన్నరాజప్ప మీద ఆయన ప్రత్యర్థి తోటవాణి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఓఎంసీ సంస్థపై దాడి చేసి అక్కడ ఆస్తులు ధ్వంసం చేసిన తెలుగుదేశం నేతల్లో చిన్నరాజప్ప ఒకరని, అందుకు సంబంధించి కేసులు నమోదు అయ్యాయని.. ఆ కేసుల వివరాలను చిన్నరాజప్ప అఫిడవిట్ లో పేర్కొనలేదని తోటవాణి ఆరోపించారు. ఈ మేరకు కోర్టుకు ఎక్కారు.
ఇక అదే కేసులో నిందితుల్లో ఒకరైన అచ్చెన్నాయుడు మీద కూడా ఇప్పుడు అలాంటి పిటిషనే దాఖలు కావడం గమనార్హం. ఓఎంసీపై దాడి చేసిన తెలుగుదేశం ఘనుల్లో అచ్చెన్నాయుడు కూడా ఒకరట. ఈయనకూ నిందితుడిగా ఒక నంబర్ ఉంది.
అయితే అందుకు సంబంధించిన వివరాలను అచ్చెన్నాయుడు తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనలేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ప్రత్యర్థి పేరాడ తిలక్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అచ్చెన్నాయుడుపై అనర్హత వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటివరకూ దాదాపు నలుగురు తెలుగుదేశం ఎమ్మెల్యేలపై, ఇద్దరు ఎంపీలపై అనర్హత వేటు పిటిషన్లు కోర్టుకు చేరాయి.