టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ రెచ్చిపోతున్న పచ్చ పార్టీనేతలు ఒకటే వితండవాదం చేస్తున్నారు. పల్లెల్లో టీడీపీ కార్యకర్తలను పార్టీ మారాలని బలవంతం చేస్తున్నారని, లేకపోతే దాడులు చేస్తున్నారంటూ విమర్శలకు దిగుతున్నారు. పార్టీ మారనంత మాత్రాన, వైసీపీకి జై కొట్టనంత మాత్రాన దాడులు చేస్తారా అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన, జరుగుతున్న దాడులన్నిటికీ రాజకీయ రంగుపులిమి పబ్బం గడుపుకుంటున్నారు టీడీపీ నేతలు.
అయితే అసలు పార్టీ మారాలంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలపై ఒత్తిడి చేస్తున్నదెవరో తేలాల్సి ఉంది. ఎమ్మెల్యేలు గోడదూకుతామని సిద్ధంగా ఉన్నా.. రాజీనామా చేయాల్సిందేనంటూ కండిషన్ పెట్టిన సీఎం జగన్ కార్యకర్తలను చేర్చుకోవాలని కిందిస్థాయి నేతల్ని తొందరపెడతారా? అలా చేర్చుకోవాలని అనుకుంటే వేలాదిమంది మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు.
వైసీపీ కార్యకర్తలకు అన్యాయం చేయకూడదనే ఉద్దేశంతోటే ఇలాంటి వారందర్నీ పక్కనపెట్టారు ఎమ్మెల్యేలు, జిల్లానేతలు. అలాంటిది కొన్నిచోట్ల పార్టీ మారలేదని టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయంటే అది నమ్మశక్యమేనా? జగన్ కనుసైగ చేస్తే చాలు.. బాబు, బామ్మర్ది తప్ప టీడీపీ ఎమ్మెల్యేలంతా వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. అయినా కూడా రాజకీయ విలువల కోసం జగన్ ఆ పనిచేయడం లేదు, ఆదర్శవంతమైన రాజకీయాల గురించి చెప్పడమే కాదు, చేతల్లో చూపిస్తున్నారు జగన్.
అలాంటి జగన్ పై నిందలు వేయడానికి పూనుకుంది టీడీపీ. రాష్ట్రంలో జరుగుతున్నవి రాజకీయ దాడులు కాదని, వ్యక్తిగత కక్షలతో జరుగుతున్నవేనని అందరికీ తెలుసు. ఓటమిని జీర్ణించుకోలేక, వైసీపీపై బురదజల్లేందుకే టీడీపీ ఈ ఎత్తుగడలు వేస్తోంది. దాడుల నాటకాలాడుతోంది. నిజానికి గతంలో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబు తన అనుకూల మీడియా సహాయంతో ఇలాంటి నాటకాలకు తెరదీశారు.
ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా అదే డ్రామాని తిరిగి కొనసాగిస్తున్నారు. కానీ అప్పుడు సోషల్ మీడియా లేదు. ఇప్పుడు అది చాలా బలంగా ఉంది. ఎన్ని డ్రామాలాడినా నిజానిజాలేంటనే విషయం సోషల్ మీడియాలో బయటకు వస్తూనే ఉంది. ఈ విషయాన్ని టీడీపీ బ్యాచ్ తో పాటు బాబు అనుకూల మీడియా తెలుసుకుంటే మంచిది.