కరెంటు కష్టాల్లో నిజమెంత..?

అనుకున్నట్టే అయింది, కరెంటు కష్టాలంటూ గగ్గోలు పెడుతున్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి. ఇప్పటివరకూ లేనిపోని సమస్యలు సృష్టించడంలో ఎవరికివారే బిజీగా ఉన్న పార్టీలు, కరెంటు చార్జీలు పెరిగేసరికి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసేందుకు కూడబలుక్కుని ముందుకొచ్చాయి.…

అనుకున్నట్టే అయింది, కరెంటు కష్టాలంటూ గగ్గోలు పెడుతున్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి. ఇప్పటివరకూ లేనిపోని సమస్యలు సృష్టించడంలో ఎవరికివారే బిజీగా ఉన్న పార్టీలు, కరెంటు చార్జీలు పెరిగేసరికి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసేందుకు కూడబలుక్కుని ముందుకొచ్చాయి. మూడు నెలల కరెంటు బిల్లులు ప్రజల తరపున ప్రభుత్వమే చెల్లించాలంటూ బీజేపీ నేతలు కొత్త పల్లవి అందుకున్నారు.

కరెంటు బిల్లులు ఒక్క ఏపీలోనే కాదు, లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా పెరిగాయి. గత నెల వాడుకున్న అదనపు కరెంటుకి ఈ నెలలో బిల్లు చెల్లించాల్సి వచ్చే సరికి సహజంగానే లెక్క మారింది. బిల్లులు చెల్లించాలంటూ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలు కేంద్రం ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీలో కరెంటు బిల్లుల అంశం కూడా చేర్పించి ఉండొచ్చు కదా.

టీడీపీ, జనసేన, వామపక్షాలు కూడా కరెంటు కష్టాలొచ్చాయంటూ గగ్గోలు పెడుతున్నాయి, కరెంటు ఆఫీస్ ల ముందు నిరసనలు చేస్తున్నాయి. కరెంటు బిల్లుల్లో ఎందుకు తేడాలొచ్చాయో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వివరించినా కూడా ప్రతిపక్షాలు పంతం వీడలేదు. రెండు నెలలు ప్రజలంతా ఇళ్లలోనే ఉన్నారు, ఏసీలు, ఫ్యాన్లు, టీవీలు.. ఇలా విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. వాస్తవానికి మార్చి నెలలోనే బిల్లు పెరగాల్సి ఉన్నా.. కరోనా భయంతో బిల్లులు తీసేవారు లేకపోవడంతో ఫిబ్రవరిలో కట్టిన బిల్లునే చెల్లించాలని ఏప్రిల్ లో బకాయి చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

లాక్ డౌన్ తో మార్చిలో ప్రతి ఇంటికీ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, ఏప్రిల్ లో కూడా అదే పరిస్థితి. ఈ రెండు నెలల సగటులో ఫిబ్రవరి బిల్లు తగ్గిస్తే.. తేడా స్పష్టంగా తెలుస్తోంది. ఒక వ్యక్తి ఫిబ్రవరిలో 50 రూపాయల బిల్లు కట్టాడనుకుందాం, లాక్ డౌన్ కారణంగా మార్చి, ఏప్రిల్ లో ఒక్కో నెలకు 100 రూపాయల బిల్లు వచ్చిందనుకుందాం. కానీ ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు ప్రకారం మార్చిలో ఫిబ్రవరి బిల్లులాగే కేవలం 50 రూపాయలు చెల్లించి సరిపెట్టారు. ఇప్పుడు మిగిలిన 50 రూపాయలు, ఏప్రిల్ లో వచ్చిన 100 రూపాయలు కలిపితే 150 అయింది. ఇక్కడే లెక్క తేడా కొట్టింది. గత నెల 50 కట్టాము కదా మహా అయితే 100 రావాలి, 150 ఏంటి అని ప్రశ్నిస్తున్నారు సగటు వినియోగదారులు. శ్లాబు మారిపోయిందని పొరపడుతున్నారు.

మార్చి బకాయి, ఏప్రిల్ అసలు బిల్లు కలిపితే 150 అవుతుంది అని అధికారులు, నేతలు చెబుతుంటే..  ప్రజలు అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నా, ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి. శ్లాబ్ రేట్లు పెంచేశారని ఆరోపణలు చేస్తున్నాయి. నిజానికి ప్రభుత్వం శ్లాబ్ రేట్లు పెంచలేదు.  పైగా ఇప్పుడిస్తున్న బిల్లలను 3 నెలల సగటు యూనిట్లు లెక్కించి మరీ ఇస్తున్నారు. దీనికితోడు జూన్ 30వరకు బిల్లుల చెల్లింపుకు అవకాశం కల్పించింది. వీటన్నింటినీ సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు మార్చేసి ప్రచారం చేస్తున్నారు టీడీపీ నేతలు.

అదే సమయంలో చిన్నా చితకా కంపెనీల కరెంటు బిల్లులన్నీ పూర్తిగా తగ్గిపోయాయి. ఎందుకంటే లాక్ డౌన్ కారణంగా అవి తెరుచుకోలేదు కాబట్టి. అంటే వాడకాన్ని బట్టే బిల్లు పెరిగిందనే విషయాన్ని అంతా గ్రహించాలి. ఈ వాస్తవాన్ని ఎవరూ ఒప్పుకోవడం లేదు. కరెంటు పేరుతో ప్రతిపక్షాలన్నీ మళ్లీ కలిసింది. టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాలు ఏకతాటిపైకి వచ్చి ప్రజల్ని రెచ్చగొడుతూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి.

రైతు భరోసాని అభినందించే తీరిక లేదు కానీ, తమ రాజకీయ లాభం చూసుకోడానికి మాత్రం ప్రతిపక్షాలకు తీరిక బాగా దొరికింది. 

విద్యుత్‌ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం