20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటిస్తున్నట్టుగా మోడీ హెడ్ లైన్స్ చదివితే భారతీయులు ఏదో ఊరట లభిస్తుందని ఆశించారు. రెండు నెలలుగా లాక్ డౌన్ నేపథ్యంలో ఎంతో మందికి ఉపాధి లేకుండా పోయింది. అలా ఉపాధి కోల్పోయిన వారు దినసరి కూలీలు, వలస కూలీలు. లాక్ డౌన్ నేపథ్యంలో పంటగిట్టుబాటు ధర లేకుండా పోయింది రైతులకు. ఆ తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్లు, పట్టణాలు-నగరాల్లో పది వేలకు ఇరవై వేలకు పని చేసే వాళ్లకు పూర్తిగా ఉపాధి లేకుండా పోయింది. 20 లక్షల కోట్ల ప్యాకేజీ నేపథ్యంలో.. ఈ వర్గాల వారికి ఏమైనా ప్రయోజనం కలుగుతుందేమో అని చాలా మంది ఆశించారు. అయితే మోడీ సర్కారు పేదలకు ప్రయోజనాలను కల్పిస్తుందని ఆశించడం కేవలం దురాశ మాత్రమే అని మరోసారి స్పష్టం అయ్యింది. ఇప్పటి వరకూ ప్యాకేజీ ప్రకటనకు అంటూ మూడు ప్రెస్ మీట్లు పెట్టారు.
10 లక్షల కోట్ల రూపాయల ప్యాకజీని అనౌన్స్ చేశారు! అయితే అంతా గ్యాసే! అన్నీ ఉత్తుత్తి కబుర్లే అని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటి వరకూ 10 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీకి సంబంధించిన ప్రకటనను చూస్తే.. అందులో రూపాయి కూడా ప్రజలకు డైరెక్టుగా అందే సమస్యే లేదు! ఆ రంగానికి రుణాలు, ఈ రంగానికి రుణాలు అంటూ.. లక్షల కోట్ల రూపాయల నంబర్లు చెప్పారు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి గారు! రుణాలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కాదు. ప్రభుత్వాలు చెప్పినంత మాత్రాన బ్యాంకర్లు రుణాలు ఇవ్వరు!
రుణాలు ఇవ్వడం అనేది ఇండియాలో రికవరీ మీద, లాబీయింగ్ మీదే ఆధారపడి ఉంటుందని తేలిపోయింది. అలాంటప్పుడు ఆ రంగానికి, ఈ రంగానికి అంటూ రుణాలు ఇస్తామంటూ కేంద్రం ఏ విధంగా ప్రకటన చేస్తుందో ఎవరికీ అంతుబట్టని అంశం. ప్రజలకు ప్రత్యక్షంగా రూపాయి కూడా సాయం చేయకుండా.. ఇలా లక్షల కోట్ల ప్రకటనలు చేసినా, కోట్ల కోట్ల ప్రకటనలు చేసినా.. పైసా ఉపయోగం అయితే ఉండదు! అన్నింటికన్నా కామెడీ ఏమిటంటే.. ఇప్పటి వరకూ ఆర్థిక శాఖామంత్రి 10 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటిస్తే.. అందులో ఖర్చు మాత్రం పూర్తిగా శూన్యమట! కేంద్ర ప్రభుత్వం తన జేబు నుంచి రూపాయి కూడా తీసి ఇవ్వకుండానే 10 లక్షల కోట్ల రూపాయల ప్రకటన చేసేసింది.
ఈ పది లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీకి గానూ కేంద్రం నుంచి అయ్యే ఖర్చు 20 వేల కోట్ల రూపాయల స్థాయిలో ఉంటుందని అంచనా. అయితే 20 వేల కోట్ల రూపాయలు కూడా యూనియన్ బడ్జెట్లో భాగమైన ఖర్చులే అని, ఇప్పుడు మళ్లీ వాటిని చెప్పారని నిపుణులు చెబుతున్నారు. 10 లక్షల కోట్ల రూపాయల ముచ్చట పూర్తయ్యే సరికి ఇదీ పరిస్థితి. ఇంకో పది లక్షల కోట్ల రూపాయల ప్రకటనలు ఈ తరహాలోనే ఉంటాయని పిచ్చ క్లారిటీ వచ్చింది జనాలకు. ఈ మాత్రం ప్రకటనలే అయితే.. 20 లక్షల కోట్ల రూపాయలకే కాదు, ఇంకో 40 లక్షల కోట్ల రూపాయలకు కూడా చేసుకోవచ్చు, ఇదంతా చిటికెల పందిరి వ్యవహారం అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా పైసా కూడా సాయం చేయకుండా, ఇలాంటి మాటలు చెప్పడం కేవలం వాళ్లను మోసపుచ్చడం తప్ప మరోటి కాదని నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు.