రైతుల గురించి మాట్లాడ్డానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఏ మాత్రం సిగ్గు అనిపించడం లేదు. రైతాంగానికి జగన్ సర్కార్ అన్యాయం, మోసం చేస్తోందని చంద్రబాబు మాటలు వింటుంటే వినడానికి రైతులే సిగ్గు పడుతు న్నారు. టీడీపీ మండలాధ్యక్షులతో శుక్రవారం టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్‌పై బాబు రోజువారీ విమర్శలను కొనసాగించారు.
ఒక్కొక్కరికి రూ.5,500 చొప్పున దాదాపు 49.50 లక్షల మంది రైతులకు జగన్ సర్కార్ రైతు భరోసా సొమ్మును జమ చేసిన రోజే…తగదునమ్మా అంటూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు విమర్శలకు పని పెట్టారు. ఒక్కో రైతుకు ఏడాదికి రూ.6 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.30 వేలు ఎగ్గొట్టటం “రైతు భరోసా” ఎలా అవుతుందని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ పథకం కింద అదనంగా రూ.17 వేలు ఇస్తున్నట్టు జగన్ ప్రభుత్వం చేస్తున్నట్టు ప్రకటనలు అసత్యమని ఆయన ఆరోపించారు.
టీడీపీ అధికారంలో ఉంటే అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఒక్కో రైతుకు ఐదేళ్లలో రూ.75 వేలు, నాలుగైదు విడతల రుణమాఫీ కిస్తీలు రూ.40 వేలు కలిపి ఒక్కో రైతుకు రూ.1.15 లక్షలు వచ్చేవన్నారు. వైసీపీ ప్రభుత్వ మోసం వల్ల ఒక్కో రైతు రూ.78,500 నష్టపోయారన్నారు.
కనీసం ఇప్పటికైనా తన పాలనలో రైతు రుణమాఫీకి సంబంధించి నాలుగు, ఐదో విడతల కిస్తీల సొమ్ము రూ.40 వేలను చెల్లించలేదని బాబు అంగీకరించడం అభినందనీయం. రైతులకు చంద్రబాబు వంచన గురించి తప్పరిసరిగా మాట్లాడుకోవాలి. రాష్ట్ర విభజన తర్వాత 2014లో మొట్ట మొదటిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల సందర్భంగా రైతుల రుణాలు మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో కుదువ పెట్టిన బంగారాన్ని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత తనదేనని చంద్రబాబు నమ్మబలికారు.
కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం తాను రైతుల రుణాలు మాఫీ చేయలేనని, బాబు చెబుతున్నవన్నీ అబద్ధాలని పరోక్షంగా ప్రత్యర్థి పార్టీ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఏది ఏమైతేనేం బాబుకు ప్రజలు పట్టం కట్టారు. ఎన్నెన్నో తర్జనభర్జనల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 58.29 లక్షల మంది రైతులకు రూ.24,500 కోట్లు రుణ మాఫీ చేయాలని బాబు నిర్ణయించారు.
ఒక్కో రైతుకు రూ.1.50 లక్షలు చొప్పున రుణాన్ని మాఫీ చేయాలని నిర్ణయించారు. బంగారం ఊసేలేదు. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత రూ.50 వేలు లోపు మొత్తాన్ని ఒకేసారి మాఫీ చేశారు. ఆ తర్వాత 2016లో 2వ విడత, 2017లో 3 విడత రుణమాఫీ చేశారు. ఇక మిగిలింది నాలుగు, ఐదో విడతల రుణమాఫీ. బాబు ఎప్పుడెప్పుడు రుణమాఫీ సొమ్ము వేస్తాడా అని రైతులు ఎదురు చూడసాగారు. రైతుల ఎదురు చూపుతోనే 2018 కూడా గడిచిపోయింది.
ఇక ఎన్నికల ఏడాది 2019 మిగిలింది. రైతుల రుణమాఫీకి గడువు ముంచుకొస్తోంది. సరిగ్గా ఎన్నికలు ఇక రెండు నెలలు ఉన్నాయనగా బాబు మాస్టర్ ప్లాన్ వేశారు. నాలుగు, ఐదో విడతల సొమ్ము ఒకేసారి రైతుల ఖాతాలో వేస్తానంటూ ప్రకటించారు. 2019, మార్చి 10న రుణ ఉపశమన పథకం కింద 4, 5 విడతల సొమ్మును 10 శాతం వడ్డీతో కలిపి రూ.8,300 కోట్లను చంద్రబాబు సర్కార్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.
ఇందుకు సంబంధించి జీవో 38ని కూడా జారీ చేసింది. రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేసినట్టు ఎల్లో మీడియా ఊదరగొట్టింది. సార్వత్రిక ఎన్నికల మే 11న జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని 31.44 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఏప్రిల్ మొదటి వారంలోపే రుణమాఫీ సొమ్ము జమ చేయనున్నట్టు బాబు సర్కార్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.
నాలుగు, ఐదో విడతల రైతుల రుణమాఫీ సొమ్ము, డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కింద ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున పంపిణీతో రెండోసారి తానే అధికారంలోకి వస్తున్నట్టు బాబు ధీమాగా చెప్పుకున్నారు. అయితే రైతులకు రుణమాఫీ సొమ్ము మాత్రం దక్కలేదు. రూ.8,300 కోట్లను విడుదల చేయడం, జీఓ 38 జారీ అంతా ప్రజల్ని మభ్యపెట్టేందుకే అని తేలిపో యింది. ఏప్రిల్ మొదటి వారంలో తమ ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమ కాకపోవడంతో రైతులు తగిన బుద్ధి చెప్పారు.
ప్రజల్ని పట్టపగలే వంచించిన చంద్రబాబు ఇప్పుడు నీతులు చెబుతున్నారు. తాను అధికారంలోకి వచ్చి ఉంటే ఒక్కో రైతుకు రూ.1.15 లక్షలు వచ్చేవని గొప్పలు చెబుతున్నారు. అసలు తనను అధికారం నుంచి దించిందే రైతులనే విషయాన్ని బాబు విస్మరించారు. మోసానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోడానికి బదులు…ఇంకా ఇంకా అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. నమ్మించి మోసగించడమే కాకుండా…ఇంకా తాను అధికారంలోకి వచ్చి ఉంటే అది చేసేవాడ్ని, ఇది చేసేవాడ్ని అని చెప్పడానికి బాబుకు సిగ్గనిపించడం లేదా?
-సొదుం