రాజకీయాల్లో తన పరాభవాన్ని కప్పి పుచ్చుకునేందుకు, భవిష్యత్ పై జనసైనికుల్లో ఆశలు రేకెత్తించేందుకు పవన్ కల్యాణ్ ఒక మాట చెప్పడం అలవాటు చేసుకుంటున్నారు. సినిమాలతో రాజకీయాలను లింకు చేస్తూ తాను ఎప్పటికైనా విజేతను అవుతానంటున్నారు. వర్జీనియాలో ప్రవాసాంధ్ర అభిమానులు ఏర్పాటు చేసిన సభలో కూడా పవన్ ఇదే మాట చెప్పుకొచ్చారు.
2024 వరకు నా ప్రస్థానం ఉంటుందా ఉండదా అని కొంతమందిలో అనుమానాలున్నాయి. అలాంటివారికి ఇదే తన సమాధానం అని చెబుతున్నారు పవన్. తొలి సినిమా ఫ్లాపైనప్పుడు తనకు ఇంతమంది అభిమానులు వస్తారని ఊహించలేదని, జనసేన కూడా ఇంతేనంటూ ముగించారు. అసలు సినిమాలకు, రాజకీయాలకు పవన్ ఎందుకు లింకు పెడుతున్నారో అర్థం కావడం లేదు.
అభిమానులే కొలమానం అయితే చిరంజీవి ప్రజారాజ్యం ఎందుకు ఫెయిలైనట్టు. రాజకీయాల్నే వదిలేసి మెగాస్టార్ తిరిగి సినిమాలతో ఎందుకు కాలక్షేపం చేస్తున్నట్టు. పోనీ సినిమా హిట్టయినట్టు రాజకీయాల్లో కూడా పవన్ హిట్ అవుతాడనుకుందాం. 5 నెలల్లో తీసే సినిమాకీ, ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికలకు పోలిక ఏంటి? దర్శకుడి ప్రతిభతో సినిమా గట్టెక్కిపోయి, హీరోకి మంచి పేరు రావొచ్చు. మెటీరియల్ లేకపోయినా వారసులను జనాలపై రుద్దీ రుద్దీ చివరకు హీరోలుగా నిలబెట్టనూవచ్చు.
కానీ రాజకీయాల్లో అలాంటి ప్రయోగాలకు చోటే లేదు. నాయకుడిపై ప్రజలకు విశ్వాసం ఉండాలి, తమ భవిష్యత్ కి భరోసా ఇస్తాడన్న నమ్మకం పెరగాలి. సినిమాల్లో ప్రత్యర్థులుండరు, సినిమా బాగుంటే ఆడుతుంది, హీరోకి అభిమానులు పెరుగుతారు. రాజకీయాలు అలా కాదు కదా, ప్రత్యర్థి పార్టీలను కూడా లెక్కలోకి తీసుకోవాల్సిందే. ఓవైపు జనాకర్షణగల జగన్ అంత బలంగా నిలబడి ఉంటే, ఇక 2024లో పవన్ కి చోటెక్కడ?
ఇప్పటికే చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అనే అపవాదు మూటగట్టుకున్నారు పవన్. దాని నుంచి బైటపడాల్సింది పోయి ఇంకా జగన్ పై అర్థంపర్థం లేని విమర్శలను చేస్తుంటే ఆయనను ప్రజలు ఎలా నమ్మాలి, ఎందుకు నమ్మాలి. పవన్ చెబుతున్న అద్భుతాలు సినిమాల్లో సాధ్యం కావొచ్చు కానీ, నిజజీవితంలో మాత్రం సాధ్యపడే అవకాశం లేదు. ఇకనైనా పవన్ తన సినిమా కెరీర్ ను రాజకీయాలతో ముడిపెట్టి మాట్లాడ్డం మానుకోవాలి.