టాలీవుడ్ లో ఎన్నో అవ్యవస్థలున్నాయి. కాస్టింగ్ కౌచ్, డ్రగ్స్ మాఫియా నుంచి ప్రారంభిస్తే చాలా చెడు కోణాలు ఇండస్ట్రీలో కనిపిస్తాయి. ఇప్పుడీ పరిశ్రమలో మరో చెడు సంస్కృతి ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. పైకి ఓ సమున్నత ఆశయంలా కనిపించే ఆ కల్చర్, లోలోపల అత్యంత పాశవికంగా మారుతోంది. అదే క్రౌడ్ ఫండింగ్.
మంచి కథ ఉంటుంది. దాన్ని తీసే డైరక్టర్, నటించే నటులు కూడా అందుబాటులో ఉంటారు. కానీ అలాంటి కథను తెరపైకి తీసుకొచ్చే సాహసం చేయలేరు నిర్మాతలు. సరిగ్గా ఇక్కడే క్రౌడ్ ఫండింగ్ అనే కాన్సెప్ట్ వెలిసింది. ముగ్గురు నలుగురు కలిసి తలా కొంత డబ్బు వేసుకొని సదరు సినిమాను పూర్తిచేస్తారు. లాభాల్లో వాటలు పంచుకుంటారు. నష్టం వచ్చినా ఒక్కరు భరించాల్సిన పరిస్థితి ఉండదు.
కానీ ఇప్పుడీ క్రౌడ్ ఫండింగ్ లోకి బ్లాక్ మనీ ప్రవాహం ఎక్కువైపోయింది. కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి ఎక్కువమంది బినామీ పేర్లతో క్రౌడ్ ఫండింగ్ వైపు మళ్లుతున్నారు. సినిమా కథ ఎలా ఉన్నా వీళ్లకు అనవసరం. అవుట్ పుట్ ఎలా ఉన్నా వీళ్లు పట్టించుకోరు. కేవలం తమ డబ్బు వైట్ గా మారిందా లేదా అనేదే వీళ్లు చూస్తున్నారు. దీనివల్ల నాణ్యమైన సినిమా రాక తగ్గిపోతోంది. క్రౌడ్ ఫండింగ్ స్ఫూర్తికి విఘాతం ఏర్పడుతోంది.
నిజానికి సినిమాల్లోకి బ్లాక్ మనీ ప్రవాహం అనేది కొత్తదేంకాదు. దశాబ్దాలుగా ఇది కొనసాగుతోంది. కానీ ఒకప్పుడు ఒక సినిమాతో ఒకరు మాత్రమే ఇలాంటి చట్టవ్యతిరేక పనులు చేసేవారు. కానీ క్రౌడ్ ఫండింగ్ వచ్చిన తర్వాత ఒకే సినిమాతో ముగ్గురు నలుగురు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వీళ్లలో వ్యాపారవేత్తలతో పాటు రాజకీయ నాయకులు ఎక్కువగా ఉంటున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే.. మంచి కథ దొరికితే క్రౌడ్ ఫండింగ్ చేద్దాం అనేవాళ్లు కనిపించడం లేదు. బ్లాక్ మనీ ఉంటే క్రౌడ్ ఫండింగ్ లో ఏదో ఒక సినిమా చేద్దాం అనే బాపతు ఎక్కువయ్యారు. రాబోయే రోజుల్లో ఇది ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ఇది టాలీవుడ్ కు మంచిదికాదు.