కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేలా భారీ ప్యాకేజీని ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. 20 లక్షల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని ఆయన ప్రకటించారు. దాదాపు రెండు నెలలుగా లాక్ డౌన్ తో సతమతం అవుతున్న అన్ని వర్గాల ప్రజల ఉద్ధరణకు ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని మోడీ తెలిపారు. ఈ ప్యాకేజీకి సంబంధించి పూర్తి ప్రకటనలను రేపటి నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి తెలుపుతారని మోడీ ప్రకటించారు.
లాక్ డౌన్ నేపథ్యంలో మూడో సారి ప్రధానమంత్రి జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు. జీవితాల్లో కరోనా భాగం కాబోతోందని పరిశోధకులు చెబుతున్నారని మోడీ ప్రస్తావించారు. ఈ ప్రసంగంలో మరోసారి లాక్ డౌన్ ప్రకటనను మోడీ చేస్తారనే ఊహాగానాలున్నాయి. అవి కొంత వరకూ నిజమే. నాలుగో దశ లాక్ డౌన్ ను ప్రకటించారు మోడీ. అయితే అది ఇప్పటిలా ఉండదని, భిన్నంగా ఉంటుందని మోడీ తెలిపారు. మే 18 వ తేదీ నుంచి కొత్త నియమాలతో నాలుగో దశ లాక్ డౌన్ అమల్లోకి వస్తుందని మోడీ వివరించారు. అందుకు సంబంధించి కూడా పూర్తి వివరాలను త్వరలోనే తెలుపుతామన్నారు.
లాక్ డౌన్ సంగతలా ఉంటే.. ఈ ప్యాకేజీ ప్రకటన ఆసక్తిదాయకంగా మారింది. ఇంతకీ ఈ ప్యాకేజీలో ఏయే రంగాలను ఎలా ఆదుకుంటారు, రాష్ట్రాలకు ఎలా చేయూతను ఇస్తారు? అనేది ఆసక్తిదాయకమైన అంశం. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్రం నుంచి సాయాన్ని ఆశిస్తున్నాయి రాష్ట్రాలు. ఇప్పటికే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి గుల్ల అయ్యింది. దానికి తోడు కరోనా వైరస్ సోకిన వారి చికిత్స ఖర్చులు, ఆపై క్వారెంటైన్ సెంటర్లు, అదనపు ఖర్చులతో రాష్ట్రాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. అన్నింటికీ మించి ఆదాయం లేకపోవడం అనేది రాష్ట్రాలకు శరాఘాతంగా మారింది. ఈ క్రమంలో కేంద్రం ప్యాకేజీ ప్రకటించాలని పలురాష్ట్రాల సీఎంలు కోరుతూ వచ్చారు. ఆ మేరకు పీఎం స్పందించారు.
దేశ జీడీపీలో పదో వంతు మొత్తాన్ని ప్యాకేజీగా అనౌన్స్ చేశారు మోడీ. ఇది వరకూ పలు దేశాలు తమ దేశాల ఆర్థిక వ్యవస్థకు ఈ స్థాయిలో ఊతం ఇచ్చాయి. ఇటలీ కూడా ఈ తరహా ప్రకటన చేసింది. ఇప్పుడు ఇండియా ఆ జాబితాలోకి చేరుతోంది. మరి ఇంతకీ దీని పూర్తి వివరాలు ఏమిటో.. ఇదెలా ఆర్థిక వ్యవస్థకు ఉపయుక్తం అవుతుందో రేపటి నుంచి తెలిసే అవకాశాలున్నాయి. కరోనా లాక్ డౌన్ నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే.. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు కొనుగోలు చేయగలిగినప్పుడే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని వారు చెబుతున్నారు. ఇంతకీ ప్రజలకు మోడీ ఆ మేరకు ఏ స్థాయిలో ఊతం ఇస్తారో!