పవన్ కల్యాణ్.. గెలుస్తారా లేదా అనేది వేరే సంగతి. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాటినుంచి, తతిమ్మా రాజకీయ నాయకులకంటె భిన్నంగా క్లీన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంటారు. ఆ దిశగా తటస్థంగా ఉండే ప్రజల్లో ఆయన ఒక నమ్మకాన్ని కలిగిస్తూ వస్తున్నారు. అదంతా ఓటు బ్యాంకుగా మారేంత నమ్మకాన్ని ఆయన ఇవ్వగలుగుతున్నారా లేదా అనేది వేరే సంగతి. అయితే.. రాను రాను.. ఓటముల దెబ్బకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారా? లేదా, తాను ఆదర్శంగా భావిస్తున్న విధానంలో కోరుకుంటున్న అధికారం దక్కడానికి ఇంకా లేటవుతుందని భయపడుతున్నారా? తెలియదు గానీ.. రొటీన్ రొచ్చు లోకి ఆయన జారిపోతున్నట్టుగా అనిపిస్తోంది.
తాజా పరిణామాలను గమనించినప్పుడు.. విజయవాడలో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించదలచుకున్నారు. అదికూడా పబ్లిక్ ప్లేస్ లో! రోడ్ల మీద, రోడ్ల పక్కన బహిరంగ ప్రదేశాలలో రాజకీయ పార్టీల జెండా దిమ్మెలు ఉండడం అతిశయమైన విషయమేమీ కాదు. మనకి అలాంటివి కొల్లలుగా కనిపిస్తాయి. అయితే అలాంటివి ఏర్పాటు చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలి. ఎంత విస్తీర్ణంలో దిమ్మె నిర్మాస్తామో.. సదరు వివరాలు ముందుగానే ప్రభుత్వానికి చెప్పాలి. అలాంటివేమీ చేయకపోతే.. ప్రభుత్వాధికారులు, పోలీసులు అడ్డుకునే అవకాశం ఉంటుంది.
విజయవాడలో అదే జరిగింది. పార్టీ నాయకుడు పోతిన వెంకటమహేష్ ఆధ్వర్యంలో జనసేన జెండా దిమ్మె పెట్టాలనుకుంటే.. అడ్డుకోవడమూ.. వారు ఏర్పాటుచేసిన దిమ్మెను జేసీబీలతో కూల్చివేయడమూ జరిగింది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ రెచ్చిపోయారు. జనసేన ఉనికి లేకుండా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
ఒక జెండా దిమ్మెను తొలగిస్తేనే ఉనికిని కోల్పోయే పార్టీ అసలు ఎంతకాలం మనగలుగుతుంది? ఆ లాజిక్ ను ప్రజలు ఆలోచిస్తే ఎంతగా పరువు పోతుంది అని కూడా పవన్ పట్టించుకోలేదు. తమ జెండా దిమ్మను తొలగించడం అనేది.. వైసీపీలో ఉన్న ఓటమి భయానికి చిహ్నం అని ఆయన అభివర్ణించారు. పరిస్థితి ఇలాగే ఉంటే నేనే రోడ్డెక్కుతా.. అంటూ.. అక్కడికేదో.. ఆయన రోడ్డెక్కగానే బ్రహ్మాండం బద్ధలపోతుందన్నట్లుగా హెచ్చరించారు.
ఇంతకూ పవన్ ఏం చెప్పదలచుకున్నారు. క్లీన్ పాలిటిక్స్ చేస్తానంటున్న పవన్ కల్యాణ్, అనుమతి తీసుకోవాలనే కనీస మర్యాద, నియమం పాటించకుండా జెండా దిమ్మె పెట్టేస్తానంటే ఎలా? అనుమతి ఉండి, అప్పటికీ పోలీసులు అడ్డుకుంటే.. ఏకంగా కోర్టునే ఆశ్రయించవచ్చు కదా. అంతే తప్ప.. ఇలాంటి లేకి విమర్శలతో రొటీన్ రాజకీయ నాయకుల్లాగా ప్రవర్తించడం ఎందుకు? అని ఆయన అభిమానులే విస్తుపోతున్నారు.