కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా గద్దె దింపాలి. భాజపాయేతర ప్రభుత్వాన్ని కూర్చోబెట్టాలి. ఇది చాలా మంది నాయకులకు ఉన్న లక్ష్యం. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి ప్రధాన ప్రతిపక్షం కాగా, కాంగ్రెస్ కు కూడా సంబంధం లేకుండా మూడో కూటమిని తెరమీదకు తీసుకురావాలనే ప్రయత్నం చాలా కాలంగా జరుగుతోంది. చాలా మంది ఆపనిలో ఉన్నారు.. తెలంగాణ సీఎం కేసీఆర్ సహా! తాజాగా ఆ బాధ్యతను బీహార్ సీఎం నితీశ్ కుమార్ భుజానికెత్తుకున్నారు.
పాతకాలంలో సుదీర్ఘమైన పౌరాణిక నాటకాలు వేసేప్పుడు.. కృష్ణుడు వంటి ఎక్కువ నిడివి ఉన్న పాత్రను.. ఒక్కడే వ్యక్తి చివరిదాకా పోషించడం కష్టం కాబట్టి.. ఒకే పాత్రకు ఎక్కువమందిని తీసుకునేవారు. వారినే ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు అంటూ వ్యవహరిస్తారు. ఆ తరహాలో.. దేశంలో మూడో కూటమిని ఉద్ధరించడానికి ఇప్పుడు మూడోకృష్ణుడు రూపంలో నితీశ్ ఎంట్రీ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది.
మోడీ ప్రభుత్వాన్ని కూల్చడానికి విపక్షాలను, ప్రధానంగా దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలనే ప్రయత్నం చాలాకాలంగా జరుగుతూ ఉన్నదే. మమతా బెనర్జీ, కేసీఆర్ ఇందుకు అనేక దఫాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ ఇద్దరికీ కూడా మూడో కూటమికి తామే సారథ్యం వహించాలనే కోరిక చాలా ప్రబలంగా ఉంది. అందరూ సారధ్యాన్ని కోరుకునే వారే కావడం వల్ల సరైన రీతిలో ఆ ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. కేసీఆర్ బయటకు మాత్రం.. ముందు అందరమూ కలిసి మోడీకి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నాం. నాయకత్వం గురించిన చర్చ రాలేదు. ఎవరు నాయకత్వం వహించాలనేది తర్వాత నిర్ణయిస్తాం.. అని తన మనోగతాన్ని బయటపెట్టకుండా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
మమత, కేసీఆర్ తర్వాత.. మూడో కూటమి ప్రయత్నాలు గాడిలో పెట్టడానికి ఇప్పుడు మూడో కృష్ణుడుగా నితీశ్ రంగ ప్రవేశం చేశారు. మొన్నటిదాకా బిజెపి మద్దతుతోనే తన సీఎం కుర్చీని కాపాడుకుంటూ వచ్చి.. ఇటీవలే వారికి రాంరాం చెప్పి ఆర్జేడీ మద్దతుతో అదే సీఎంకుర్చీలో స్థిరపడిన నితీశ్ కుమార్.. మోడీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకోసం హస్తినయాత్ర చేస్తున్నారు. దేశంలోని అన్ని కీలక పార్టీలను ఏకతాటిమీదకు తీసుకురావాలనేది ఆయన సంకల్పం. ఇదే ప్రయత్నం, మమత- కేసీఆర్ లు చేయడానికి, నితీశ్ చేయడానికి కాస్త తేడా ఉంది.
ఈ ముగ్గురిలో నితీశ్ కు ఉన్న క్రెడిబిలిటీ ఎక్కువ. పైగా.. ‘‘ప్రధాని పదవికి తాను ఎప్పటికీ రేసులో ఉండను’’ అనే మాటను గట్టిగా ప్రకటించి మరీ.. ఆయన రంగంలోకి దిగుతున్నారు. మమత, కేసీఆర్ లనుంచి అలాంటి త్యాగపూరితమైన మాటలు ఆశించలేం. మహ అయితే, నాకు ప్రధాని పదవిపై కోరికలేదు అని చెప్పగలరే తప్ప.. ఆ రేసులో నేను లేను, నాకు వద్దు.. మోడీని దించడం మాత్రమే దేశశ్రేయస్సుకు దారితీస్తుంది.. అందుకోసమే నేను పనిచేస్తాను.. అని చెప్పి పనిచేసేవారు లేరు. ఆ నేపథ్యంలో ఆ ఇద్దరూ సమగ్రంగా చేయలేకపోయిన పనిని నితీశ్ ఎలా, ఏ మేరకు చేస్తారో వేచిచూడాలి.