దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా నంబర్లు అత్యంత తక్కువ స్థాయికి చేరాయి. రెండో వేవ్ లో భారీ సంఖ్యలో కేసులను చూసిన వివిధ రాష్ట్రాల్లో ఈ తగ్గుదల నమోదు కావడం గమనార్హం. కోట్ల జనాభా ఉన్న రాష్ట్రాల్లో కరోనా నంబర్లు ఇప్పుడు డబుల్ డిజిట్ స్థాయిలో నమోదవుతూ ఉండటం ఆసక్తిదాయకంగా మారింది.
ఒకవైపు కొన్ని రాష్ట్రాల్లో కరోనా రోజువారీ కేసుల సంఖ్య వేల స్థాయిల్లోనే నమోదవుతున్నా ఇదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో రోజువారీ కేసుల సంఖ్య డబుల్ డిజిట్ స్థాయికి చేరింది. అలా కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టిన రాష్ట్రాల జాబితాను చూస్తే.. ఢిల్లీ మెరుగైన స్థితికి చేరింది.
ఒక దశలో వేల సంఖ్యలో కేసులు నమోదైన రాష్ట్రం ఢిల్లీ. ప్రస్తుతం అక్కడ రోజువారీగా 50 లోపు కేసులు నమోదవుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో ఢిల్లీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 44 మాత్రమే!
ఉత్తరప్రదేశ్ లో గత ఇరవై నాలుగు గంటల్లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 69. రాజస్థాన్ లో కేవలం 22 కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం! గుజరాత్ లో 29, మధ్యప్రదేశ్ లో 19, హర్యానాలో 36, బిహార్ లో 82 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
పంజాబ్ లో 68, జార్ఖండ్ లో 33, ఉత్తరాఖండ్ లో 50 కేసులు నమోదయ్యాయి. ఇలా చూస్తే దేశ జనాభాలో సగానికి పైగా జనాభాను కలిగి ఉన్న రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగా నమోదవుతున్నట్టే! అక్కడ సెకెండ్ వేవ్ దాదాపు ముగిసినట్టే.
అయితే కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి వీటికి విరుద్ధంగా ఉంది. కేరళలో 17 వేల స్థాయిలో కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 9 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి గత ఇరవై నాలుగు గంటల్లో. కర్ణాటక, తమిళనాడు, ఏపీ, ఒడిశా వంటి రాష్ట్రాల్లో రెండు వేలకు అటూ ఇటూ స్థాయిలో కొత్త కేసులు వచ్చాయి.