సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించాలని టీబీజేపీ పట్టుబడుతోంది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో అధికారికంగా విమోచన దినాన్ని జరుపుతామని కేసీఆర్ నమ్మబలికి, ఇప్పుడెందుకు యూ టర్న్ తీసుకున్నారని టీబీజేపీ నిలదీస్తోంది. ఇవాళ టీబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై మండిపడ్డారు.
కేవలం ఎంఐఎంకు సీఎం కేసీఆర్ భయపడే తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించడం లేదని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణ అమరులను అవమానిస్తోన్న దుర్మార్గుడు కేసీఆర్ అని బండి చెలరేగారు. తెలంగాణలో అధికారికంగా విమోచన దినాన్ని నిర్వహించే వరకూ బీజేపీ అవిశ్రాంత పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు.
‘విమోచన దినం’ నిర్వహించకపోగా, తెలంగాణ విలీన వజ్రోత్సవాల పేరిట కేసీఆర్ జిమ్మిక్కులు చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ నిజంగా తెలంగాణ వాది అయితే వెంటనే విమోచనోత్సవాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే విమోచన దినోత్సవాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించకపోవడానికి కారణమేంటో రాష్ట్ర ప్రజానీకానికి కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంఐఎం పార్టీకి భయపడి విమోచనోత్సవాలు నిర్వహించకపోవడం సిగ్గు చేటన్నారు. తెలంగాణలో బలపడేందుకు బీజేపీ ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందనేందుకు ఇదే ఉదాహరణ.
తెలంగాణ సెంటిమెంట్‌ను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు విమోచనోత్సవాన్ని బీజేపీ సమయానుకూలంగా వాడుకుంటోంది. దీటైన వాదనతో బీజేపీ క్షేత్రస్థాయిలో వెళుతుండడం కేసీఆర్ సర్కార్‌ను ఇరకాటంలో పడేస్తోంది.