జాతిరత్నాలు సినిమాతో మాంచి పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు అనుదీప్. వెంటనే ప్రిన్స్ అనే సినిమా చేస్తున్నాడు. సితార సంస్థలో మరో సినిమా చేయాల్సి వుంది. మధ్యలో తొందరపడి తన కథతో వేరే వాళ్ల డైరక్షన్ అంటూ ఓ చిన్న సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కానిచ్చేస్తాడు.
ఇలాంటి కిట్టింపు పనులు చేసిన ప్రతి దర్శకుడికి జనాలు షాక్ ఇస్తూనే వున్నారు. ‘చిన్నది ఒకటి కానిచ్చేద్దాం’ అనుకున్న ప్రతి సారీ ఝలక్ ఇస్తూనే వున్నారు. క్రిష్ కు కొండపొలం అయినా, మారుతికి మంచి రోజులు వచ్చాయి అయినా ఇలాంటివే.
ఒక్క సినిమా అనుభవం వున్న అనుదీప్ తను కథ ఇవ్వడం, తన అసిస్టెంట్ ను డైరక్టర్ ను చేయడం, మళ్లీ అలా అని ఊరుకోకుండా అన్నీ తానై సినిమాను మోయడం. అవసరమా ఇది? ఇప్పుడు మినిమమ్ ఓపెనింగ్ లేకుండా మార్నింగ్ షో లకే థియేటర్లలోంచి లేచిపోతే ఎంత నామర్దా? సినిమా కన్నా, దాని ప్రమోషన్ కంటెంట్ నే ఎంటర్ టైనీగా వుందని కామెంట్లు వచ్చేసాయి.
అంతే కాదు, అసలు జాతి రత్నాలు విషయంలో నాగ్ అశ్విన్ బ్యాకింగ్ ఎంత? నవీన్ పోలిశెట్టి ఇన్ పుట్స్ ఎంత అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అంటే అనుదీప్ స్టామినానే సందేహంలో పడిపోయింది. ప్రస్తుతం చేస్తున్న ప్రిన్స్ సినిమాతో అనుదీప్ తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సి వుంది. లేదూ అంటే మూడే సినిమాతోనే ముప్పు ముంచుకు వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ డెే ఫస్ట్ షో సినిమాను అనుదీప్ సినిమాగానే చూసారు తప్ప వేరుగా కాదు.
ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా యావరేజ్ అయినా ఒకె అనుకునేవారు. మరీ ఇంత డిజాస్టర్ కావడం అనేది కచ్చితంగా అనుదీప్ కెరీర్ కు బ్లాక్ స్పాట్ నే. ఇప్పుడు ప్రిన్స్ సినిమాతో ఈ బ్లాక్ స్పాట్ ను చెరిపేసుకునే ప్రయత్నం గట్టిగా చేయాలి.