ఆంధ్రలో అతి సామాన్యుడి దగ్గర నుంచి రాజకీయ పరిశీలకుల వరకు ఎవరినైనా అడగండి..ఈ ప్రశ్న. ‘జగన్ మరోసారి గెలుస్తాడా? గెలవడా?’ అని. దానికి ఎవ్వరూ నేరుగా సమాధానం చెప్పరు. చంద్రబాబు..పవన్ కలిస్తే ఓడిపోతాడు. లేదంటే గెలుస్తాడు అంటారు ఎక్కువ శాతం మంది. మరోపక్కన ఓట్లు చీలిపోనివ్వను..జగన్ ను ఓడిస్తాను అంటారు పవన్ కళ్యాణ్. భాజపా-దేశం కలిస్తే వైకాపాకు భయం అంటోంది తెలుగుదేశం అనుకూల మీడియా. కలపడానికి తెలుగుదేశాన్ని అభిమానించేవారు ఎవరి ప్రయత్నం వారు,వారి స్థాయిలో చేస్తున్నారు. కానీ ఇదంతా దేనికి దారి తీస్తోంది.
చంద్రబాబు లేదా తెలుగుదేశం పార్టీ ఒంటరిగా జగన్ ను ఓడించలేదు అనే అభిప్రాయం సామాన్యుడి దగ్గర నుంచి అసమాన్యుడి వరకు పాతుకుపోయింది ఇప్పుడు. 2019లో జనసేన విడిపోవడం వల్లనే చంద్రబాబు ఓడిపోయానే అభిప్రాయం జనాల్లోకి వెళ్లిపోయింది. ఆ మాటకు వస్తే అసలు పొత్తులు లేకుండా చంద్రబాబు గెలవలేరు అనే భావన బలంగా నాటుకుపోయింది ఆంధ్రలో. ముందు దాన్ని తుడిచివేయాల్సి వుంటుంది తెలుగుదేశం పార్టీ. కానీ ఆ పార్టీ అనుకూల మీడియా దాన్ని మరింత పెంచుతొంది.
అమిత్ షా ను దేశం నాయకులు కలిసారు అన్న గ్యాసిప్ వింటే చాలు తెలుగుదేశం అనుకూల మీడియా కళ్లు చెమర్చుతున్నాయి. చంద్రబాబును అపార్థం చేసుకున్నాం అని భాజపా నేతలు భావిస్తున్నారు అనే గాలి వార్త వింటే చాలు, తెలుగుదేశం అనుకూల మీడియా యాంకర్ల కళ్లు మతాబుల్లా వెలిగిపోతున్నాయి. ఇలా వాళ్లకు తెలియకుండానే వాళ్లే పార్టీకి అన్యాయం చేస్తున్నారు. జగన్ ను నేరుగా ఢీకొనలేని బలహీనుడు చంద్రబాబు అనే ముద్రను జనాల్లో వేసేసాయి.
ఇంత మంది కలిస్తే కానీ జగన్ ను కొట్టలేరు అనే భావన వుందీ అంటే జగన్ అంత బలవంతుడనే పరోక్షంగా చెబుతున్నట్లు కదా? ఇది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు ఎంత నామర్దా. జనాలు ఎప్పుడూ వీరుడిని, పోరాడే వాడిని, మెచ్చుకుంటారు తప్ప కూటమి కట్టేవాడిని కాదు. అభిమన్యుడిని ఇప్పటికీ ఎందుకు గుర్తుంచుకున్నారు. పాండవుల కన్నా అభిమన్యుడికి ఎందుకు క్రేజ్. ఎందుకంటే ఒంటరిపోరు సాగించాడు కనుక. దుష్టచతుష్టయం కూటమి కట్టి వచ్చినా భయపడకుండా యుద్దంలోకి దూకాడు కనుక.
రాజకీయాల్లో పొత్తులు కామన్ అనుకుందా. వ్యూహాలు అంతకన్నా కామన్ అనుకుందాం. కానీ అవన్నీ తెరవెనుక వుండాలి.నిత్యం జరిగే చానెళ్ల డిస్కషన్లలో కాదు. పదే పదే వాటి గురించి ప్రస్తావిస్తూ, ప్రయోజనాల కోసం కలుస్తాం..కలుస్తా అంటూ పలవరించడం కాదు. ఇలా రాను రాను ఇదే చేస్తూ పోతే జనాల్లో జగన్ మరింతగా పెరిగిపోతాడు. అప్పుడు నష్టపోయేది తెలుగుదేశం పార్టీనే.
ఇది గమరించాల్సింది తెలుగుదేశం మీడియానే ముందు గమనించాలి. చంద్రబాబు కన్నా కూడా.