మెగాస్టార్ చిరంజీవి హుందాతనానికి మారుపేరు. తన పట్ల ఇతరులు ఏ విధంగా ఉండాలని కోరుకుంటారో, తాను కూడా ఎదుటి వాళ్ల విషయంలో అంతే గౌరవంగా మెలుగుతారు. తాను అందరివాడులా వుండాలని చిరంజీవి ఆశిస్తారు. అయితే రాజకీయ కారణాల వల్ల అప్పుడప్పుడు కొందరు ఆయన్ను వివాదాల్లోకి లాగుతుంటారు. ఇటీవల చిరంజీవి పుట్టిన రోజు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా తమ్ముడు పవన్‌కల్యాణ్ విడుదల చేసిన శుభాకాంక్షల ప్రకటన విమర్శలకు దారి తీసింది. ఈ ప్రకటన పవన్‌కల్యాణ్ అల్పత్వాన్ని బయట పెట్టిందనే వాళ్ల సంఖ్యే ఎక్కువ. ఎందుకంటే పుట్టిన రోజు శుభాకాంక్షల్లో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను పరోక్షంగా విమర్శించి తన నిజ స్వరూపాన్ని పవన్ బయట పెట్టుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇవాళ పవన్‌కల్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పవన్‌కు సినీ జీవితాన్ని ప్రసాదించిన సొంత అన్న చిరంజీవి శుభాకాంక్షలు చెప్పారు. ట్విటర్ వేదికగా చిరంజీవి విషెస్ చెప్పిన తీరు ప్రశంసలు అందుకుంటోంది.
‘తన ఆశ, ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కల్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కళ్యాణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నాను’ అంటూ రెడ్ హార్ట్ ఎమోజీని చిరంజీవి జత చేయడం విశేషం. తన హృదయంలో పవన్‌పై ఉన్న అభిమానాన్ని చిరంజీవి రెండే రెండు వాక్యాల్లో వ్యక్తం చేశారు. కానీ పవన్ మాత్రం… అన్నకు విషెస్ చెప్పే సాకుతో రాజకీయానికి తెరలేపారు. ఇదే చిరంజీవి పెద్దరికానికి, అందుకు పూర్తి విరుద్ధమైన పవన్ మనస్తత్వానికి నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.