జ‌య‌హో జ‌గ‌న్ అంటున్న ఆర్‌కే

‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చాలా తెలివైనవాడు’…ఈ మాట అంటున్న‌ది , రాస్తున్న‌ది వైఎస్సార్ ఆత్మీయుడు ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమారో, సాక్షి దిన‌ప‌త్రికో ఎంత‌ మాత్రం కాదు. జ‌గ‌న్ అనే పేరు విన‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌ని ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్…

‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చాలా తెలివైనవాడు’…ఈ మాట అంటున్న‌ది , రాస్తున్న‌ది వైఎస్సార్ ఆత్మీయుడు ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమారో, సాక్షి దిన‌ప‌త్రికో ఎంత‌ మాత్రం కాదు. జ‌గ‌న్ అనే పేరు విన‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌ని ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ అలియాస్ ఆర్‌కే. ఈ వారం  ‘జ‌గ‌న్ రూటే సెప‌రేటు!’ శీర్షిక పేరుతో రాసిన ‘కొత్త ప‌లుకు’లో ఆర్‌కే త‌న రూటు మార్చుకున్నాడు. అస‌లు వారం వారం ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను కేవ‌లం తిట్టేందుకే క‌లం ప‌ట్టే ఆర్‌కేకు ఈ వారం ఏమైందో తెలియ‌దు కానీ, ‘జ‌య‌హో జ‌గ‌న్’  అంటూ కీర్తన‌లు చేశాడు. అంతేకాదు, దివంగత వైఎస్సార్‌పై కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.

కొత్త ప‌లుకులో మొట్ట మొద‌టి వాక్య‌మే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి చాలా తెలివైన వాడు అని మొద‌లు పెట్ట‌డం ద్వారా ఆర్‌కే త‌న ఉద్దేశాన్ని చెప్ప‌క‌నే చెప్పాడు. జ‌గ‌న్ తెలివితేట‌ల సంగ‌తి అలా ఉంచితే…ఆర్‌కే ఎంత తెలివైన వాడో అర్థ‌మ‌వుతోంది. ఆర్‌కేకి స‌రికొత్త‌గా జ్ఞానోద‌యం అయిన‌ట్టుగా ఉంది. ప్ర‌తి వారం కొత్త ప‌లుకు రాసే ఆర్‌కే నుంచి ఇలాంటి రావ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌మే. ఇంత‌కూ ప్ర‌తి వారం కొత్త ప‌లుకు రాసే ఆర్‌కే…ఈ వారం రాసిన ఆర్‌కే ఒక్క‌రేనా?

నిజానికి ఈ వ్యాసం జ‌గ‌న్‌పై పొగ‌డ్త కూడా కాదు. ఎందుకంటే జ‌గ‌న్‌పై గ‌త కొన్నేళ్లుగా చంద్ర‌బాబు అండ్ కో…ఎల్లో మీడియాతో క‌లిసి సాగిస్తున్న విష ప్ర‌చారాన్ని ఏపీ ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు. ఇష్టం లేక‌పోయినా త‌మ వైఫ‌ల్యాన్ని ఒప్పుకుంటూ రాసిన  అంగీకార ప‌త్రంగా ఈ వారం ఆర్‌కే వ్యాసాన్ని చూడాలి. ఎందుకంటే 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బాబు ఓట‌మి కేవ‌లం రాజ‌కీయ‌ప‌ర‌మైంది మాత్ర‌మే కాదు…మీడియా కోణంలో కూడా త‌ప్ప‌క చూడాలి. ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ ప‌దేప‌దే వైసీపీ శ్రేణులు పోరాడాల్సింది కేవ‌లం చంద్ర‌బాబు ఒక్క‌డితోనే కాద‌ని, ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, టీవీ5 అంటూ పేర్లు చెప్పిన విష‌యం తెలిసిందే.

దివంగ‌త ముఖ్య‌మంత్రులు వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, చంద్ర‌బాబునాయుడు, కె.చంద్ర‌శేఖ‌ర్‌రావుల‌తో పోల్చితే జ‌గ‌న్‌ది ముమ్మాటికీ విభిన్న శైలే. ఆ ముగ్గురు రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన నేప‌థ్యం వేరు. దివంగ‌త రాజ‌శేఖ‌ర్‌రెడ్డిపై చంద్ర‌బాబు త‌న ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని సాగించిన దుష్ప్ర‌చారం అంతాఇంతా కాదు. చంద్ర‌బాబు, ఎల్లో మీడియా క‌లిసి వైఎస్సార్‌ను ఓ ఫ్యాక్ష‌నిస్టుగా, ముఠాకోరుగా, నిత్య అస‌మ్మ‌తి వాదిగా, అవినీతిప‌రుడిగా ముద్ర‌వేస్తూ దుర్మార్గ‌మైన ప్ర‌చారాన్ని చేశారు. అయితే రాజ‌శేఖ‌ర‌రెడ్డి చ‌రిష్మా ముందు వాళ్ల ఎత్తులు చిత్తు అయ్యాయి.

ఈ వారం ఆర్‌కే వైఎస్సార్‌పై వ‌ల్ల‌మాలిన ప్రేమ క‌న‌బ‌రిచారు.  క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఉక్కు ప‌రిశ్ర‌మ స్థాపించాల‌ని వైఎస్సార్ సంక‌ల్పించిన‌ప్పుడు ఎలాంటి రాత‌లు రాశారో ఆర్‌కే గుర్తు చేసుకుంటే మంచిది.

ప్ర‌స్తుతానికి వ‌స్తే…‘జగన్‌ మోడల్‌ మాత్రం ఇప్పటివరకు ఎవరూ అనుసరించలేదు. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అత్యధిక భాగం బలమైన ఓటు బ్యాంకును తయారుచేసుకునే విధంగానే ఉంటాయి. పేదలు, బడుగు, బలహీనవర్గాల పేరుతో ఇతరులు ఏమనుకుంటారో, రాష్ట్రానికి మంచిదో కాదో.. అని ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటూ, పథకాలకు రూపకల్పన చేసుకుపోతున్నారు. పేద ప్రజల సైకాలజీని ఔపోశన పట్టిన ఆయన.. సోషల్‌ ఇంజనీరింగ్‌ను కూడా మిళితం చేసి మరీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలను తరచుగా ఆత్మరక్షణలోకి నెడుతుంటారు’ అని ఆర్‌కే రాసుకెళ్లారు.

జ‌గ‌న్ చేస్తే మాత్రం రాజ‌కీయాలు, అధికారం కోసం మాత్ర‌మేన‌ని ఆర్‌కే అంటారు. రాజ‌కీయాల‌న్న త‌ర్వాత అధికార‌మే ప‌ర‌మావ‌ధి. ఎట్టి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్‌ను సీఎం కానివ‌ద్ద‌ని చంద్ర‌బాబు, ఎల్లో మీడియా చేయ‌ని ప్ర‌య‌త్నాలు లేవు క‌దా. త‌మ చాన‌ళ్లు, ప‌త్రిక‌ల ద్వారా జ‌గ‌న్‌పై ట‌న్నుల‌కు ట‌న్నులు విషాన్ని కుమ్మ‌రిస్తూ రాసిన రాత‌లు, కూసిన కూత‌లు ప్ర‌జాభిమానం ముందు నిల‌వ‌లేక‌పోయాయ‌నేది ఆర్‌కే బాధ‌.

చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గంపై జ‌గ‌న్ క‌త్తి దూస్తూనే ఉన్నాడ‌ని చెబుతూనే ఈ వారం అద‌నంగా కాపుల‌ను కూడా క‌లుపుకొచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. కాపుల‌ను జ‌గ‌న్ ప‌రోక్షంగా టార్గెట్ చేశాడ‌ని ఆర్‌కే కొత్త ప‌ల్ల‌వి ఎత్తుకున్నాడు. ఎందుకంటే కోస్తా జిల్లాల్లో కాపు సామాజిక వ‌ర్గానికి, మిగ‌తా వ‌ర్గాల‌కు మ‌ధ్య ఉన్న వైష‌మ్యాల‌ను ఆస‌రాగా చేసుకుని జ‌గ‌న్ మిగిలిన వ‌ర్గాల‌ను త‌న వైపు తిప్పుకుంటున్నాడ‌ని ఆర్‌కే ఆవేద‌న‌.  

‘ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు కాపులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి మిగతా వర్గాలకు.. ముఖ్యంగా బీసీలకు దూరం అయిన విషయాన్ని గమనించిన జగన్మోహన్‌రెడ్డి అండ్‌ కో ప్రస్తుతం ఈ ఎత్తుగడను అనుసరిస్తోంది’ అని ఆర్‌కే ప‌లికాడు. ఇక్క‌డ ఆర్‌కే ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాలి. కోస్తాలో కాపుల‌కు మాత్ర‌మే చంద్ర‌బాబు ఎందుకు ప్రాధాన్యం ఇచ్చాడు? అంటే ఆ సామాజిక వ‌ర్గానిది బ‌ల‌మైన ఓటు బ్యాంకు అనే క‌దా ప్ర‌త్యేకంగా రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తాన‌ని బాబు న‌మ్మ‌బ‌లికింది. ఇది సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌లోకి రాదా?  కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌లేన‌ని జ‌గ‌న్ ధైర్ంగా, నిజాయితీగా చెబితే..దాన్ని సాకుగా చూపుతూ ఆ సామాజిక వ‌ర్గంలో వ్య‌తిరేక‌త పెంచి ప‌బ్బం గ‌డుపుకోవాల‌నే ప్ర‌య‌త్నాల మాటేమిటి? అవున్లే బాబు చేస్తే ఒప్పు, జ‌గ‌న్ చేస్తే త‌ప్పా?

‘కాపులకు భయపడి చంద్రబాబు అండ్‌ కో.. పవన్‌కల్యాణ్‌ వంటివారిని ఎప్పుడూ వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసుకోలేదు. ఇప్పుడు జగన్‌ అండ్‌ కో అటువంటి శషభిషలకు తావు లేకుండా ముందుగా నాగబాబు, ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్‌ చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేసింది. అక్కడితో ఆగకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కూడా టార్గెట్‌ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయినా కాపు నాయకులెవ్వరూ నోరు విప్పలేకపోయారు’…ఇదీ ఆర్‌కే ప‌లుకు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో మంచిగా మెల‌గ‌డం ద్వారా కాపుల ఓట్ల‌న్నీ గంప గుత్త‌గా త‌న సొంతం చేసుకోవాల‌నే ఎత్తుగ‌డ ఆర్‌కేకు క‌నిపించ‌డం లేదా? ఇది సోష‌ల్ ఇంజ‌నీరింగ్ కాదా? త‌న ప్ర‌భుత్వాన్ని ఏడాది పాటు ప‌వ‌న్‌క‌ల్యాణ్ తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిడుతుంటే బాబు ఎందుకు నోరు మెద‌ప‌లేక‌పోయారు? జ‌గ‌న్ స‌ర్కార్‌పై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా లక్ష్మినారాయ‌ణ తీవ్ర అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తే…దాన్ని తిప్పికొట్ట‌డం కూడా త‌ప్పేనా? అయినా క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌పై విమ‌ర్శ‌లు చేస్తే కాపు నాయ‌కులు ఎందుకు నోరు విప్పాలి? ఆయ‌న కాపు నాయ‌కుడిగా విమ‌ర్శ‌లు చేశారా లేక బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగానా?  రాత‌ల్లో ఎక్క‌డో శ్రుతి త‌ప్పింది ఆర్‌కే!

ప్ర‌భుత్వ బ‌డుల్లో ఆంగ్ల మాధ్యమం , జ‌గ‌న‌న్న విద్యా దీవెన , అమ్మ ఒడి ప‌థ‌కాల అమ‌లు, మ‌ద్యం ధ‌ర‌ల పెంపు త‌దిత‌ర విష‌యాల‌తో పాటు తాజాగా విశాఖ బాధితుల‌కు భారీ ప‌రిహారం చెల్లించ‌డం వ‌ర‌కూ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాజ‌కీయంగా ల‌బ్ధి పొందారు, పొందుతున్నార‌ని ఆర్‌కే ఏక‌రువు పెట్టాడు.

ప‌నిలో ప‌నిగా అఇష్టంగానైనా త‌న బాస్ చంద్ర‌బాబుపై చిర్రుబుర్రులాడాడు. ఎన్నెన్నో మంచిప‌నులు చేసినా చివరకు తనకంటూ ఒక మోడల్‌ లేకుండా పాలన సాగించడంతో ఉభయభ్రష్టత్వం చెందాడని ఆవేద‌న చెందాడు.  

‘విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కులం అనేది ప్రధాన సమస్యగా ఉందని గుర్తించడంలో విఫలమవడంతో కొందరివాడేనన్న అపప్రథను మూటగట్టుకున్నారు. ఫలితంగా ఆయన నమ్ముకున్న అభివృద్ధి, సంక్షేమం కూడా ఓటమి నుంచి ఆయనను కాపాడలేదు.పార్టీని, రాజకీయాన్ని గాలికి వదిలేయడం వల్ల భారీ మూల్యం చెల్లించుకున్నారు’ అని బాబు ఓట‌మికి కార‌ణ‌మేమిటో తేల్చి చెప్పాడు.

ఇక్క‌డో ముఖ్య‌మైన విష‌యం చెప్పుకోవాలి. క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌పై వైసీపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తే…కాపు నాయ‌కులెవ‌రూ నోరు మెద‌ప‌లేద‌ని ఆర్‌కే రాసుకొచ్చాడు. కానీ చంద్ర‌బాబు విష‌యానికి వ‌చ్చే స‌రికి క‌మ్మ నాయ‌కుడిగా ఆర్‌కే అండ‌గా నిలిచాడు. త‌న క‌లంతో, గళంతో ‘నేనున్నా’నంటూ బాబుకు మ‌ద్ద‌తుగా నిలిచి స్వామి భ‌క్తిని ప్ర‌ద‌ర్శించాడు.  

చివ‌రిగా ఒక్క మాట‌. కేవ‌లం కుల‌, ప్రాంతాల స‌మీక‌ర‌ణ‌లు మాత్ర‌మే అధికారాన్ని క‌ట్ట‌బెట్ట‌వు. అంత‌కు మించి త‌మ జీవితాల‌కు  భ‌రోసా క‌ల్పించే నాయ‌క‌త్వాన్ని ప్ర‌జ‌లు కోరుకుంటారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌లో ఆ నాయ‌క‌త్వాన్ని చూసే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌నంత వ‌ర‌కు ఎవ‌రి అధికారానికైనా డోకా ఉండ‌దు. లేదంటే కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయిన ఎంద‌రో నాయ‌కుల‌ను చూశాం క‌దా!

అలా కాల‌గ‌ర్భంలో క‌లిసిపోతున్న నాయ‌కుడికి తాజా ఉదాహ‌ర‌ణ చంద్ర‌బాబు. జ‌గ‌న్ ఆలోచ‌న‌లు, ఎత్తుగ‌డ‌లు మున్ముందు ప్ర‌జామోదం ఎంత వ‌ర‌కు పొందుతాయో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి ఉంది. కానీ గ‌త కొన్నేళ్లుగా ఆర్‌కే రాత‌ల‌తో పోల్చితే ఈ వారం మాత్రం కొంత మార్పు వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. బ‌హుశా మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌కు ఆర్‌కేలో వ‌చ్చిన మార్పు ప్ర‌తిబింబిస్తోంద‌ని అర్థం చేసుకోవాలేమో!

-సొదుం

అప్పటి నిజాలు బయటపెట్టిన కొడాలి నాని