అమ‌రావ‌తిలో శ్రీ‌దేవి చిచ్చు!

రాజ‌ధాని అమ‌రావ‌తిలో తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి ఎంట్రీ చిచ్చు రేపుతోంది. ముఖ్యంగా టీడీపీ శ్రేణులు ఆమెపై గుర్రుగా ఉన్నాయి. టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేశ్ ఆమెకి అధికార ప్రాధాన్యం ఇవ్వ‌డంపై బాబు…

రాజ‌ధాని అమ‌రావ‌తిలో తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి ఎంట్రీ చిచ్చు రేపుతోంది. ముఖ్యంగా టీడీపీ శ్రేణులు ఆమెపై గుర్రుగా ఉన్నాయి. టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేశ్ ఆమెకి అధికార ప్రాధాన్యం ఇవ్వ‌డంపై బాబు సామాజిక వ‌ర్గేతరులు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు.

యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో భాగంగా రావెల శివారులో అమ‌రావ‌తి ఆవేద‌న స‌భ‌కు ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌దేవి మాట్లాడుతూ వైసీపీ గుర్తుపై గెలిచిన కార‌ణంగా ఉద్య‌మంలోకి రాలేక‌పోయాన‌ని ఆమె అన్నారు. త‌న వెనుక చంద్ర‌బాబు, లోకేశ్ ఇప్పుడు ఉన్నార‌ని, కావున త‌న‌నెవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని ఆమె చెప్పారు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పంచ‌న వుంటూ, మూడు రాజ‌ధానులు ఉండాల్సిందే అని శ్రీ‌దేవి బ‌ల‌ప‌రిచిన వైనాన్ని అమ‌రావ‌తి రైతులు గుర్తు చేస్తున్నారు.

ముఖ్యంగా అమ‌రావ‌తి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టుల‌ని మొట్ట‌మొద‌ట విమ‌ర్శించిన నాయ‌కురాలు ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి అని వారు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి నాయ‌కురాలిని వేదిక ఎక్కించి, ఆమెను వ్యాఖ్యాత‌గా నియ‌మించ‌డం ఏంట‌ని లోకేశ్‌పై మండిప‌డుతున్నారు. అమ‌రావ‌తి రైతుల ఆగ్ర‌హం, ఉద్య‌మ‌కారుడైన కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు ఫేస్‌బుక్ పోస్టులో ప్ర‌తిబింబిస్తోంది.

“అమ‌రావ‌తి రైతుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అవ‌మానాల‌లో … ఈ రోజు జ‌రిగింది అత్యంత దారుణ‌మైన అవ‌మానం” ఇది కేవ‌లం కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు ఆవేద‌న మాత్ర‌మే కాదు. శ్రీ‌దేవికి అగ్ర‌స్థానం క‌ల్పించ‌డం అంటే రాజ‌ధాని వ్య‌తిరేకుల‌కు స్థానం క‌ల్పించ‌డ‌మే అనేది వారి అభిప్రాయం. 

ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి త‌న రాజ‌కీయ స్వార్థం కోసం టీడీపీ పంచ‌న చేరి, అమ‌రావ‌తికి మ‌ద్ద‌తు తెలుపుతోందే త‌ప్ప‌, ప్రేమ‌తో కాద‌ని వారు అంటున్నారు. టీడీపీ వైఖ‌రి చూస్తుంటే, రానున్న రోజుల్లో రాజ‌కీయ స్వార్థం కోసం మూడు రాజ‌ధానుల‌కు జై కొట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అసెంబ్లీ వేదిక‌గా మూడు రాజ‌ధానుల బిల్లుల‌కు మ‌ద్ద‌తుగా శ్రీ‌దేవి గ‌ట్టిగా మాట్లాడార‌ని, అలాంటామెను ద‌గ్గ‌రికి తీసుకోవ‌డం అంటే రాజ‌ధాని ఉద్య‌మ అమ‌రులను అవ‌మానించ‌డ‌మే అని శ్రీ‌నివాస్‌రావు లాంటి వారు మండిప‌డుతున్నారు. శ్రీ‌దేవికి టికెట్ ఇస్తే, ఆమెకు వ్య‌తిరేకంగా మ‌రో టీమ్ త‌యార‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.