యాక్షన్.. ఓవరాక్షన్

‘ఫర్ ఎవెరీ యాక్షన్.. దేరీజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్’ అనే మూడో చలన సూత్రాన్ని సిద్ధాంతీకరించిన సర్ ఐజాక్ న్యూటన్, ఏపీ రాజకీయాలను గమనిస్తే.. దానికి అనుబంధ సూత్రం ఒకటి కొత్తగా తయారు…

‘ఫర్ ఎవెరీ యాక్షన్.. దేరీజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్’ అనే మూడో చలన సూత్రాన్ని సిద్ధాంతీకరించిన సర్ ఐజాక్ న్యూటన్, ఏపీ రాజకీయాలను గమనిస్తే.. దానికి అనుబంధ సూత్రం ఒకటి కొత్తగా తయారు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే.. ఇక్కడ ప్రతి ‘యాక్షన్’కు ఆపోజిట్ గా.. ‘ఓవర్ యాక్షన్’ ఉంటుంది. నాయకులకు కావాల్సింది కేవలం మైలేజీ! చిన్న విషయానికి అతిగా స్పందించేయడం వారికి అలవాటుగాను, అవసరంగాను మారిపోయింది.

ప్రభుత్వం మీద విమర్శలు వస్తే వాటిని తిప్పికొట్టడం అవసరం.. అయితే ప్రజలు కూడా పట్టించుకోని చిన్న చిన్న విమర్శలకు అధికార పార్టీ మొత్తం ఏకమై వీర లెవెల్లో దాడులు చేయడం అతిశయంగాను, అతిగాను కనిపిస్తుంది.

ప్రతిపక్షాలేం తక్కువ తినలేదు. వారి దుడుకుతునం పట్ల ప్రభుత్వ సంస్థలు వీసమెత్తు బెత్తం ఝుళిపిస్తే చాలు.. అంతెత్తున ఎగిరెగిరి పడుతూ ఉన్నారు. ఇవన్నీ కలిపి ఆయా అంశాలమీదికి అవసరమైన దానికంటె ఎక్కువగా ప్రజల అటెన్షన్ ను ఆకర్షిస్తున్నాయి. దాదాపుగా అన్ని పార్టీల నాయకుల ఓవర్ యాక్షన్ వ్యవహారాల మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘యాక్షన్- ఓవర్ యాక్షన్’!

చిన్న గాయం తగిలినా పెద్ద కట్టు కట్టుకోవాలి. చిన్న విజయం సాధించినా పెద్ద సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇవన్నీ ఆధునికతరం మార్కెటింగ్ టెక్నిక్స్ అన్నమాట. కానీ మార్కెటింగ్ టెక్నిక్కులు రాజకీయాల్లో ఎందుకు ఉంటాయి? అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. ‘మార్కెటింగ్’ అనునది భగవంతుడిలాగా సర్వాంతర్యామి. ‘‘ఇందుగలదు.. అందులేదను సందేహము వలదు.. ఎచ్చోట వెదకి చూసినా.. ప్రతిచోటా ఉంటుంది. పైగా రాజకీయాలు కార్పొరేట్ రూపాన్ని సంతరించుకున్న ఆధునిక తరంలో ఇలాంటి మార్కెటింగ్ చాలా ప్రాధాన్యంతో కూడి ఉంటుంది. 

ఏ ఒక్క పార్టీ కూడా తమ సొంత తెలివితేటలను, ప్రజలకు సేవ చేయడం పట్ల తమ చిత్తశుద్ధిని, ప్రజలకు తమ మీద ఉన్న విశ్వాసాన్ని, ప్రజలకు తమ పట్ల ఉన్న ప్రేమను నమ్మడం లేదు. దళారీల మార్కెటింగ్ తెలివితేటలను నమ్ముతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఐప్యాక్ వారి తెలివితేటల మీద ఉన్న నమ్మకం.. దశాబ్దాలుగా ప్రజాజీవితంలోనే గడుపుతున్న పార్టీలోని సీనియర్ల మీద ఉండదు. 

చంద్రబాబునాయుడు తాను దేశంలోనే అత్యంత సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర, అనుభవం ఉన్న వ్యక్తిని అని చెప్పుకుంటారు గానీ.. తన అనుభవం కంటె రాబిన్ శర్మ తెలివితేటలనే ఎక్కువగా నమ్ముతారు. అలా ఒక్కొక్కరికీ ఒక్కొక్కరు! కార్పొరేట్ చదువులతో, కార్పొరేట్ మార్కెటింగ్ తెలివితేటలతో ఉండే ఈ వ్యూహకర్తలు రాజకీయాలను మార్కెటింగ్ వ్యూహాలకు వేదికలుగా తయారుచేసేశారు. అందుకే ఈ సకల మార్కెటింగ్ అవలక్షణాలు, అతి వేషాలు పార్టీల నాయకుల పోకడల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. 

మనం ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నాం గనుక.. ఈ పార్టీలను ప్రస్తావిస్తున్నాం గానీ.. కేంద్రంలో భాజపా- మోడీ కూడా ఇందుకు అతీతం కాదు. మన డప్పు మనమే కొట్టుకోవాలి అని స్వయంగా పార్టీ శ్రేణులకు హితోపదేశం చేసే నాయకుడు ఆయన. వందేభారత్ అనే అందమైన పేరు ఉండవచ్చు గాక.. ఒక రైలును ప్రారంభించడానికి ఊరూరా తిరిగిన వ్యక్తి.. కుదరకపోతే.. రిమోట్ ద్వారా అయినా స్వయంగా తానే ప్రారంభించి.. ప్రతి చిన్న పనిలోనూ అనల్పమైన మైలేజీ కోరుకునే నాయకుడు మోడీ!

మనకు వ్యతిరేకంగా ఏదైనా చిన్న సంఘటన జరిగితే చాలు.. దాని నుంచి గరిష్టంగా మైలేజీ పిండుకోవాలి. మనం చిన్న విజయాన్ని సాధిస్తే దాని గురించి భూగోళం బద్ధలైపోయేలా డప్పు కొట్టుకోవాలి. ఇది నవీన రాజకీయ మార్కెటింగ్ శైలి. అయితే ఇలాంటి అతిపోకడలు ప్రదర్శించడంలో ఏపీలోని రాజకీయ నాయకులు మరీ హెచ్చుస్థాయిలో రెచ్చిపోతున్నారు. ‘పబ్లిక్ వాంట్ దట్ అతి’ అంటూ నేనింతే చిత్రంలో బ్రహ్మానందంతో ఓ గొప్ప డైలాగు చెప్పించాడు పూరీ జగన్నాథ్. ఇప్పుడు తెలుగు రాజకీయాలు చూస్తోంటే.. ‘‘ఎవ్విరీ పొలిటీషియన్ వాంట్ దట్ అతి..’’ అన్నట్టుగా వాతావరణం ఉంది. 

చిరు వివాదం- పెనుదుమారం

మెగాస్టార్ చిరంజీవి వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించిన తీరు గమనిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. స్పష్టంగా పేరు బయటకు చెప్పకపోయినప్పటికీ.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావించిన వ్యవహారం బ్రో సినిమాకు సంబంధించినదే కావొచ్చు గాక.! బ్రో సినిమా పవన్ కల్యాణ్ ది కావడం మూలాన.. అందులోని వెకిలిప్రయోగాల మూలాన అప్పటికే వైసీపీలో ఒక శత్రుభావం ఏర్పడిపోయి ఉంది. 

ఆ మాటకొస్తే.. మెగాస్టార్ కూడా.. ‘పిచ్చుకలాంటి సినిమా పరిశ్రమపై బ్రహ్మాస్త్రం వేయడం ఎందుకు’ అనే ఒక్కమాటతో వ్యవహారాన్ని తేల్చేసి ఉంటే సరిపోయేది. అలా కాకుండా.. ప్రత్యేకహోదా గట్రా అని ఆచరణ సాధ్యం కాదని తనకు కూడా తెలిసిన విషయాల్ని వైఫల్యాలు కింద ప్రొజెక్టు చేయడానికి ప్రయత్నించారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మండింది. అయినా సరే.. ఒక్క ప్రకటనతో ఆయన మాటలను ఖండించి ఉంటే సరిపోయేది. 
కానీ ముందే చెప్పుకున్నట్టు ఇవాళ్టి రాజకీయం మొత్తం మార్కెటింగ్ మీద నడుస్తోంది. 

హ్యాష్ ట్యాగ్ లు, కీవర్డ్ లు ఆధారిత తెలివితేటలు ముఖ్యం. మెగాస్టార్ చిరంజీవి అంటే.. చాలా చాలా పాపులర్ గనుక.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయన మీద విరుచుకుపడితే తమకు కూడా చాలా చాలా పాపులారిటీ వస్తుందనేది.. ఎక్కువ మంది దృష్టికి వెళ్తాం అనేది నాయకుల వ్యూహంలాగా మారిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి వ్యాఖ్యలను ఖండించని, ఆయన మీద ప్రతివిమర్శలు చేయని నాయకులే లేరన్నట్టుగా దాదాపుగా ప్రతి ఒక్కరూ విరుచుకుపడ్డారు. కొందరైతే సినిమా ఇండస్ట్రీని, చిరంజీవిని కలిపి ఏకిపారేశారు. కొందరు పవన్ తో చిరంజీవికి ముడిపెట్టి విమర్శలు చేశారు. ఏ ఒక్కరూ కూడా తర్కబద్ధమైన చర్చల జోలికి వెళ్లనే లేదు.

నిజానికి చిరంజీవి రాజకీయాలనుంచి పూర్తిగా విరమించుకున్న తర్వాత.. ఎలాంటి రాజకీయ భావజాలాన్ని ప్రదర్శించడం లేదు. ఎవ్వరికీ అనుకూలంగాను, వ్యతిరేకంగానూ లేరు. ఆ మాటకొస్తే.. అంతో ఇంతో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలననే ఆయన సమర్థిస్తున్నారు. జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల విధానానికి కూడా ఆయన మద్దతిచ్చారు. 

సినిమా పరిశ్రమమీద ప్రభుత్వం కన్నెర్ర చేసిన సందర్భంలో ఇండస్ట్రీ తరఫున పెద్దరికం వహించి.. జగన్ తో రాయబారం నడిపి.. ఆయనను ఒప్పించి.. పరిశ్రమ ఊరడిల్లేలా చేసిన ఘనత కూడా చిరంజీవిదే. ఆ సందర్భంలో సీఎం జగన్ తో చర్చల్లో చిరంజీవి వ్యవహార సరళి, సంయమనం కూడా ప్రస్తావించదగినవి. అయితే చిరంజీవి విషయంలో అవన్నీ వైసీపీ నాయకులు మర్చిపోయారు. ఒక్కమాట- అదికూడా సూటి విమర్శ కాకుండా.. ప్రస్తావన మాత్రతంగా అన్నందుకే..  కేవలం దుమ్మెత్తిపోయడానికే పరిమితం అయ్యారు. ఈ అతి మరీ ఎక్కువ అనిపించింది. 

మూలకారణమైన గొడవలోనూ ఓవర్ యాక్షనే..

చిరంజీవి విషయం మాత్రమే కాదు.. ఆ గొడవకు మూలకారణం అయిన బ్రో సినిమాలోని స్పూఫ్ విషయంలో కూడా ఇదే జరిగింది. సినిమా టీమ్ ఎంతగా డొంకతిరుగుడు మాటలు మాట్లాడినప్పటికీ.. డ్రస్ కోడ్ సహా అచ్చంగా అదే మెయింటైన్ చేసిన తర్వాత.. సోంబాబు పాత్ర.. అంబటి రాంబాబు పై వెటకారం కాదంటే ఎవ్వరూ ఒప్పుకోరు. అయితే అందులో ఉన్న వెటకారం ఎంత? అందుకు ప్రభుత్వంలో విధాన నిర్ణేతలుగా ఉండే  మంత్రిస్థాయిలోని వ్యక్తులు స్పందించాల్సిన అవసరం ఎంత అనేది మాత్రం ఖచ్చితంగా ప్రస్తావనార్హం.

సినిమాల్లోని కొన్ని పాత్రల్ని, రాజకీయాల్లో మాత్రమే కాదు స్పోర్ట్స్ తదితర రంగాల్లోని కొన్ని పాత్రలని కూడా.. వారి విలక్షణ ప్రవర్తనకు దక్కిన పాపులారిటీని బట్టి స్పూఫ్ లుగా కొన్ని చిత్రాల్లో పెట్టడం అనేది కొత్త సంగతి కాదు. ఇలాంటి స్పూఫ్ లు మనకు చాలా సినిమాల్లో కనిపిస్తాయి. కానీ, గొడవకు కారణమైన చిత్రంలో పవన్ కల్యాణ్ ఒక హీరో కావడం వలన, స్పూఫ్ కు గురైన సదరు మంత్రి అంబటి రాంబాబు తో ఆయనకు యుద్ధ వాతావరణం ఉన్నట్టుగా వారి నడుమ విపరీతంగా విమర్శలు ప్రతివిమర్శలు నడుస్తున్న నేపథ్యం వలన ఇది వివాదంగా మారింది. 

అంబటి రాంబాబు కూడా.. ‘నా పాత్రను కూడా పెట్టుకుంటే తప్ప తన సినిమా ఆడదని పవన్ కల్యాణ్ కు భయం’ అని చిన్న వెటకారపు కామెంట్ దగ్గర ఆగిపోయి ఉంటే సరిపోయేది. అలా కాకుండా.. అంబటితోపాటు దాదాపుగా వైసీపీలోని మంత్రులందరూ కూడా దీని మీద స్పందించారు. అంబటి ఏకంగా.. పవన్ కల్యాణ్ భార్యల గురించి సినిమాలు, ఓటీటీ, వెబ్ సిరీస్ తీస్తనాంటూ రకరకాల వెకిలి టైటిల్స్ ను డిజైన్లతో సహా ప్రదర్శించి.. తన వెటాకారన్ని రక్తి కట్టించాలని చూశారు. ఇదంతా కూడా ఓవర్ యాక్షన్ అనుకోవాల్సిందే.

ప్రతిపక్షాలేం తక్కువ తినలేదు..

వివిధ విషయాల పట్ల స్పందించడంలో ప్రతిపక్షాలేమీ తక్కువ తినలేదు. ఎవరి అతి వారు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు భార్య గురించి వైసీపీ నాయకులు అనుచితమైన మాటలు మాట్లాడారే అనుకుందాం. దాని మీద ప్రెస్ మీట్ లో దుఃఖించడం వరకు తక్షణ స్పందన ఎంత తీవ్రంగా అయినా ఉండగలదని అనుకోవచ్చు. 

కానీ.. ఆయన ఆ ఎపిసోడ్ ను రాజకీయ మైలేజీకి వాడుకోవాలని చూడడం మాత్రం ఏహ్యం. అసహ్యకరం. ఆయన ఊరూరా తిరుగుతూ.. నా భార్య గురించి ఇలా అన్నారు అని ప్రతి సభలోనూ చెప్పుకుంటూ.. తన పరువు తానే తీసుకున్నారు. నాలుగుదశాబ్దాల పైబడిన ప్రజాజీవితపు అనుభవం ఉన్న అంత పెద్ద నాయకుడికి కనీస విచక్షణ లేకుండా పోయిందా? ఆయన బుద్ధి, ఆలోచన అంతేనా? అంటే.. సమాధానాలు దొరకవు.

పవన్ కల్యాణ్ వాలంటీరు వ్యవస్థ గురించి ఎంతటి చవకబారు ప్రకటనలతో రాద్ధాంతం చేశారో అందరూ గమనిస్తూనే ఉన్నారు. వాలంటీర్ల ద్వారా.. వృద్ధులకు పేదలకు ఎలాంటి  పితలాటకం లేకుండా వారి ఇళ్ల వద్దకే ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ల సాయం అందుతోంది. సంక్షేమాన్ని మరింత క్రమపద్ధతిలో గాడిలో పెట్టాలని అనుకుంటున్న అధికార పార్టీ.. వారి ద్వారా ప్రజల వివరాలు కూడా తెలుసుకుంటోంది. అయితే ఈ వివరాల ద్వారా మహిళల అక్రమ రవాణాకు నాయకులు పాల్పడుతున్నారని, వాలంటీర్లు దళారీ పాత్రలో ఉన్నారని పవన్ మాట్లాడడం చాలా నీచమైన సంగతి. 

తెలంగాణలో కూడా ఇంచుమించుగా ఏపీలో ఉన్నంతగానే మిస్సింగ్ కేసులు ఉన్నాయి. అయితే అక్కడ ఏ వాలంటీర్లు ఉన్నారని ఇలా జరిగిందో పవన్ వివరణ చెప్పాలి. అయితే ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్న వాలంటీరు వ్యవస్థ మీద ప్రజల్లో అపనమ్మకం కలిగించడానికి ఆయన ఈ ఓవరాక్షన్ చేశారనేది స్పష్టం. తాను మాట్లాడిన మాటలు తప్పు అని, అనైతికమైనవని తెలిసినప్పటికీ.. వాటిద్వారా రాగల రాజకీయ మైలేజీ కోసం ఆయన రెచ్చిపోయి ఇప్పటికీ ప్రతి సభలో అదే కంటిన్యూ చేస్తున్నారు. 

సొంత మీడియా సంస్థల పుణ్యం

ప్రతి నాయకుడికీ, ప్రతి పార్టీకి అపరిమితమైన మైలేజీ కావాలి. ఎవరికి వారికి సొంత మీడియా సంస్థలు ఉన్నాయి. లేదా, మీడియా సంస్థలను పెయిడ్ సర్వీసులతో పోషిస్తున్నారు. ఒక్కో సంస్థ ఒక్కోనాయకుడికి కొమ్ము కాస్తూ ఉంటుంది. వారు ఏం మాట్లాడినా సరే.. అపరిమితమైన ప్రయారిటీతో ప్రచురిస్తూ, ప్రసారం చేస్తూ ఉంటారు. అందుకే .. ఏది పడితే అది మాట్లాడడం అనేది నాయకులకు అలవాటుగా మారుతోంది. ప్రచారం, మార్కెటింగ్ ఒక్కటే వారికి కావాలి. నిజం అక్కర్లేదు. మీడియా సంస్థలు కూడా తమ పోషకులైన నాయకుల్ని ఇలాంటి ఓవరాక్షన్ వైపు ప్రేరేపిస్తున్నాయి.

పార్టీల వ్యూహకర్తలు అనే ముసుగులో మార్కెటింగ్ వ్యవహారాలు చూసే కార్పొరేట్ దళారీల వ్యవహారమే పెద్ద ఖర్మ అనుకుంటే… ఇలాంటి మీడియా పోకడలు కూడా ఇలాంటి ఓవరాక్షన్ లు శృతిమించుతుండడానికి మరో కారణంగా మారుతున్నాయి. 

నాయకులు తమకున్న చిత్తశుద్ధితో ప్రజల మనసులను గెలుచుకోవడానికి ప్రయత్నించాలి. తమ పనులతోనే ఆదరణ పెంచుకోవాలి. అంతే తప్ప.. మాటల గారడీలు, బూతుల విన్యాసాలు, మార్కెటింగ్ వారి తెలివితేటలతో బతికిపోవాలని ఆశిస్తూ ఉంటే.. ఇలాంటి దుర్మార్గపు పోకడలే మరింతగా విస్తరిస్తాయి.

..ఎల్. విజయలక్ష్మి