వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిలపై తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు ఒకే రకమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఇది కాసింత ఆశ్చర్యంగానూ, ఆసక్తికరంగానూ అనిపిస్తోంది. తెలంగాణలో 2023లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు టీఆర్ఎస్, ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీ గట్టి పట్టుదలతో ఉన్నాయి. దీంతో తమ రథసారథులను కూడా ఆయా పార్టీలు సిద్ధం చేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజన్న రాజ్యం నినాదంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల తన తండ్రి పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చాలా కాలం అధికారంలో ఉండడంతో పాటు తెలంగాణలో బలమైన కేడర్ కలిగిన టీడీపీ కూడా కాలక్రమం లో అక్కడ చేతులెత్తేసింది.
ఇటీవల ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ కూడా టీఆర్ఎస్‌లో చేరిపోయారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో వైసీపీ తెలంగాణలో 4 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంలో గెలుపొంది… కొద్దోగొప్పో ఉనికి చాటుకుంది. ఆ తర్వాత తెలంగాణలో పార్టీని అధినేత వైఎస్ జగన్ పట్టించుకోకపోవడంతో ఉన్న వాళ్లు కూడా తమదారి తాము చూసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే వైఎస్ జగన్ పరిమితం అయ్యారు.
అలాంటిది వైఎస్ షర్మిల తెలంగాణలో ఒక పార్టీ పెట్టడంతో పాటు 2023లో అద్భుతాలు సృష్టిస్తామని ధీమాగా చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది. ఆమె ఆత్మ విశ్వాసాన్ని ఎవరూ కాదనలేరు. ఇదే సందర్భంలో వైఎస్ షర్మిల విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.
తెలంగాణలో వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులతో పాటు ఆయన సామాజిక వర్గం కూడా షర్మిలకు ఎంతోకొంత అండగా నిలిచే అవకాశాలున్నాయి. అయితే ఎన్నికల సమయంలో అభ్యర్థుల జయాపజయాల అవకాశాలను బట్టే ఓటర్లు ఓ నిర్ణయానికి వస్తారనేది కూడా అంతే నిజం.
ఈ నేపథ్యంలో షర్మిల తమ పార్టీలపై ఎలాంటి విమర్శలు చేసినా… టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ స్పందించకపోవడమే ఆ పార్టీల వ్యూహమని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బాహాటంగానే ప్రకటించారు. అసలు షర్మిలది ఒక పార్టీగానే భావించడం లేదని రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పడం వెనుక ఆమె ఉనికినే గుర్తించ నిరాకరించడమే. ఇక కేటీఆర్, ఇతర టీఆర్ఎస్ నేతలు కూడా షర్మిల విషయంలో మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు.
లేదంటే పరోక్షంగా సెటైర్లు విసురుతున్నారు. నిరుద్యోగులకు బాసటగా నిలిచేందుకు వారానికి ఒకసారి షర్మిల దీక్ష చేయడంపై కేటీఆర్ పరోక్షంగా, వ్యంగ్యంగా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. మహిళలు వారానికి ఒకసారి వ్రతాలతో షర్మిల దీక్షను కేటీఆర్ పోల్చడం గమనార్హం. తెలంగాణ బీజేపీ అయితే షర్మిల మాటే ఎత్తడం లేదు. ఇలా అన్ని పార్టీలు కూడా షర్మిలను విస్మరించడం ద్వారా … తెలంగాణలో ఆమె రాజకీయ పురోభివృద్ధిని అడ్డుకోవాలనే ఆలోచనలు స్పష్టంగా కళ్లకు కడుతున్నాయి.
షర్మిల విమర్శలపై అనుకూల లేదా వ్యతిరేకంగా స్పందిస్తే… అనవసరంగా ఆమెకు లేని పాపులారిటీ, గుర్తింపు తామే ఇచ్చినట్టు అవుతుందనే ఆ మూడు పార్టీల వ్యూహాలను పక్కాగా అమలు చేస్తున్నాయి. ఆ మూడు పార్టీలు పన్నిన రాజకీయ వ్యూహాన్ని ఛేదించడం షర్మిలకు పెద్ద సవాలే అని చెప్పక తప్పదు. మున్ముందు ప్రత్యర్థుల ఎత్తుకు వేసే పైఎత్తుపైనే ఆమె రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని చెప్పక తప్పదు.