ఆంధ్ర ప్రభుత్వం మెలమెల్లగా జనాల దృష్టిలో కార్నర్ అవుతోంది. ఎక్కడో లోపం వుంది. అది నిర్ణయాల్లోనా? లేదా అమలులోనా? అన్నదే ప్రభుత్వం గమనించుకోవాల్సి వుంది. బిజినెస్ మన్ గా ఆలోచించడం వల్ల కావచ్చు. లేదా కొత్త విధానం అని అధికారులు ఎవరైనా సజెస్ట్ చేసి వుండొచ్చు. సిఎమ్ జగన్ ఈ 'హోల్ సేల్' విధానాలు అమలు చేయడం ప్రారంభించారు.
ముందుగా మద్యం విక్రయాలు మొత్తాన్ని ప్రభుత్వం చేతుల్లోకి హోల్ సేల్ గా తీసుకున్నారు. అది ప్రభుత్వమే చేస్తోంది కాబట్టి, కిందా మీదా పడుతున్నా, మొత్తానికి కొనసాగుతోంది.
ఆ తరువాత ఇసుక మీద రకరకాల ప్రయోగాలు చేసి, దాన్ని హోల్ సేల్ గా ఒకే కంపెనీకి గుత్తకు ఇచ్చారు. ఆ కంపెనీ కోసం ఎంపిక చేసిన రీచ్ లు మినహా మరే చోట ఇసుక తీయకుండా అధికారులు కట్టడి చేసారు. దీంతో ఇప్పుడు ఆంధ్రలో ఇసుక కొనాలంటే సామాన్యులు భయపడే పరిస్థితి వచ్చేసింది. నది ఆమడ దూరంలో వున్నా కూడా ఇసుక ముట్టుకోలేరు. ట్రాక్టర్ రెండు వేలు పెట్టి కొనుక్కోవాల్సిందే.లేదా నాణ్యత సంగతి ఎలా రోబో శాండ్ తొ సరిపెట్టుకోవాల్సిందే. సరే ఇసుక 'హోల్' సేల్ విధానం ఇలా వికటిస్తే…
రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు, నిర్వహణను కూడా ప్రభుత్వం హోల్ సేల్ ప్రాజెక్టుగా మార్చేసింది. సాధారణంగా తరతరాలుగా రోడ్ల నిర్వహణ, చిన్న నీటి పారుదల ప్రాజెక్టుల్లో జరిగే అవినీతి గురించి అందరికీ తెలిసిందే. ఇలా వేసిన రోడ్లు ఒక్క వర్షానికే మాయం కావడం, తప్పు వానదేవుడి మీదకు నెట్టేయడం అన్నది తరతరాలుగా జరుగుతూనే వుంది. ఇలాంటి నేపథ్యంలో జగన్ తీసుకున్న హోల్ సేల్ విధానం వల్ల అయినా రోడ్లు బాగుపడతాయని, లోకల్ ప్లేయర్లు కాకుండా హోల్ సేల్ కు తీసుకున్న బడా ప్లేయర్లు నాణ్యమైన రోడ్లు వేస్తారని అంతా భావించారు.
కొన్ని రోడ్లు కొత్త రూపు సంతరించుకున్నాయి. పూర్తి స్థాయిలో కొత్త రోడ్లు రాకపోయినా, గుంతలు అయితే పూడ్చి, కాస్త మసి పూసి మారేడుకాయ చేయగలిగారు. అయితే ఇప్పుడు వర్షాకాలం వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్రంలోని అనేక రహదారులు జలాశయాలను తలపిస్తున్నాయి. భారీ గుంతలు దర్శనమిస్తున్నాయి. దీంతో రోడ్ల హోల్ సేల్ విధానం కూడా లోపభూయిష్టమే అని క్లారిటీ వచ్చేసింది.
కేంద్రం రోడ్లు వేస్తుంటే కాస్త నాణ్యత కనిపిస్తోంది. రాష్ట్రం రోడ్లు వేస్తుంటే ఎందుకు నాణ్యత కనిపించడం లేదు అన్నది ప్రశ్న. ప్రధానమంత్రి సడక్ యోజన పేరుతో రోడ్లు వేస్తుంటే, అక్కడ పక్కాగా అన్ని వివరాలతో రెండు మూడు బోర్డులు పెడుతున్నారు. ఆ బోర్డులు చూస్తే చాలు సామాన్యుడికి సైతం ఆ రోడ్ వ్యవహారం మొత్తం కళ్ల ముందు వుంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి విధానం ఎందుకు తీసుకోవడం లేదు? అధికారులను, కాంట్రాక్టర్లను ఎందుకు జవాబుదారీ చేయడం లేదు?
పైగా పనులు చేసిన వాటికి బిల్లులు రావడం లేదు అన్నది గత రెండేళ్లలో లోకల్ ప్లేయర్ లకు క్లారిటీ వచ్చేసింది. అనేక పంచాయతీ కాలవలు, రోడ్లు, రైతు భరోసా కేంద్ర భవనాలు వీటి బిల్లులు అన్నీ పెండింగ్ లో వున్నాయి. అధికారం అందిన ఉత్సాహంలో వర్క్ లు నామినేషన్ పద్దతిలో చేపట్టిన వైకాపా లోకల్ లీడర్లు అంతా ఇప్పుడు బిల్లుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.
ఇలా జగన్ తీసుకుంటున్న నూతన విధానాలు అన్నీ ఒక్కొక్కటీ వికటిస్తున్నాయి. దీనికి కారణం నిర్ణయంలో వున్న లోపాలా? లేక వాటి అమలులో లోపాలా? అన్నది ఒక సారి జగన్ క్షేత్రస్థాయిలో పర్యటించి, కనిపెట్టాల్సి వుంటుంది. దానికి పెద్దగా తల బద్దలు కొట్టుకోవాల్సింది పని ఏమీ లేదు. ఒక్కసారి ఈ వర్షాకాలంలో సిఎమ్ జగన్ ఆంధ్ర అంతా సుడిగాలి పర్యటన చేస్తే చాలు. మొత్తం రోడ్ల సీన్ ఆయనకు అర్థం అయిపోతుంది.