వరుసగా 18 పెళ్లిళ్లు.. అతడు కాదు, ఆమె

నిత్యపెళ్లికొడుకు గురించి విన్నాం. మహిళల్ని మోసం చేసి వరుసపెట్టి పెళ్లిళ్లు చేసుకొని ఉడాయించే మోసగాళ్ల గురించి చదువుకున్నాం. అయితే ఇదే పని ఓ అమ్మాయి చేస్తే ఎలా ఉంటుంది? అలాంటి మహిళను నిత్య పెళ్లికూతురు…

నిత్యపెళ్లికొడుకు గురించి విన్నాం. మహిళల్ని మోసం చేసి వరుసపెట్టి పెళ్లిళ్లు చేసుకొని ఉడాయించే మోసగాళ్ల గురించి చదువుకున్నాం. అయితే ఇదే పని ఓ అమ్మాయి చేస్తే ఎలా ఉంటుంది? అలాంటి మహిళను నిత్య పెళ్లికూతురు అనాలేమో! అబ్బాయిల్ని పెళ్లి చేసుకొని నగలు-డబ్బుతో ఉడాయించే అలాంటి నిత్య పెళ్లికూతుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆమె పేరు అంజలి. తెలుగమ్మాయే. కాకపోతే భాగవతిగా పేరు మార్చుకుంది. ఈమెకు ఒకటే పని. అబ్బాయిల్ని ముగ్గులోకి దించడం, పెళ్లి చేసుకోవడం, కొన్నాళ్లు కాపురం చేసిన తర్వాత డబ్బు, నగలతో ఉడాయించడం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ పనులకు అంజలి తల్లి పూర్తి సహాయసహకారాలు అందించడం.

ఇలా ఇప్పటివరకు 18 మందిని పెళ్లి చేసుకొని మోసం చేసింది అంజలి. ఈమె బాధితుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ కు చెందిన కుర్రాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఇంతకీ ఈ నిత్యపెళ్లికూతురు వ్యవహారం ఎలా బయటకొచ్చిందో తెలుసా?

అలవాటు ప్రకారం జునాఘడ్ కు చెందిన ఓ వ్యక్తిని ముగ్గులోకి దించింది అంజలి. అతడ్ని పెళ్లి చేసుకొని, 3 లక్షల నగదు, నగలతో ఉడాయించింది. మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదుచేశాడు. 

అలా తీగ లాగితే డొంక కదిలింది. నిత్యపెళ్లికూతురు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అంజలి దగ్గర్నుంచి లెక్కలేనన్ని నకిలీ పత్రాల్ని, మారుపేర్లతో ఉన్న ఆధార్ కార్డుల్ని కనుగొన్నారు పోలీసులు.