ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన పెను సంచలనం చాట్ జీపీటీ. ఇప్పటికే ఐటీ సర్కిల్స్ లో చాట్ జీపీటీ గురించిన చర్చ అనునిత్యం సాగుతున్నదే! చాలా కంపెనీలు చాట్ జీపీటీ వినియోగానికి సంబంధించి ఐటీ ఉద్యోగులకు మెయిల్స్ పెడుతున్నాయి. వాడండి కానీ.. అంటున్నాయి!
ఇక చాట్ జీపీటీ ఎంట్రీతో లక్షల కొద్దీ ఉద్యోగాలు పోతాయనే వాదన, కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిశగా సాగే క్రమంలో ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయనే ప్రతివాదనలూ సాగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకూ అయితే.. చాట్ జీపీటీ వల్ల డైరెక్ట్ గా ఉద్యోగాలు పోయిన సంఘటనలేవీ వార్తల్లోకి రాలేదు.
ఆ సంగతలా ఉంటే.. చాట్ జీపీటీ ఆపరేషన్ అంత తేలికగా లేదనే వాదన వినిపిస్తూ ఉంది. ఈ వెబ్ సైట్ నిర్వహణకు రోజువారీగా అవుతున్న ఖర్చు అక్షరాలా ఏడు లక్షల డాలర్లట! ప్రతి రోజూ ఈ మేరకు నిర్వహణకు ఖర్చు పెడుతున్నారట. ఇదే రీతిన కొనసాగితే..వచ్చే ఏడాది చివరికి చాట్ జీపీటీ దివాళా తీయవచ్చని కథనాలు వెలువడుతున్నాయి!
ఇప్పటికైతే భారీగా పెట్టుబడులు ఉన్నాయి. 2024 చివరి నాటికి దీనిపై మరో బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడులు రావొచ్చనే అంచనాలతో ఉంది ఓపెన్ఏఐ. మైక్రోసాఫ్ట్ వెచ్చించిన పది బిలియన్ డాలర్ల పెట్టుబడితో బండి నడుస్తూ ఉంది.
అయితే.. చాట్ జీపీటీకి పెయిడ్ వెర్షన్ రూపంలో చాట్ జీపీటీకి సొమ్ము చేసుకునే అవకాశం ఉండనే ఉంది. అడ్వాన్డ్స్ వెర్షన్స్ లో సబ్ స్క్రిప్షన్స్ ద్వారా.. చాట్ జీపీటీ డబ్బులు రాబట్టుకునే మార్గం ఉంది. అయితే ఓటీటీల మాదిరిగా ఎంటర్ టైన్ మెంట్ బాపతు కాదు కాబట్టి.. ప్రొఫెషనల్ గా ఉపయోగించుకునే వారు, కంపెనీలే సబ్ స్క్రిప్షన్స్ తీసుకుంటే.. చాట్ జీపీటీకి ఇబ్బందులు ఉండకపోవచ్చు!