టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ స్వంతంగా పంపిణీ రంగంలోకి దిగుతుందని చాలా కాలం క్రితం వార్తలు వినవచ్చాయి. ముఖ్యంగా నైజాంలో పంపిణీ రంగంలోకి రావాలని అనుకుంటున్నారని, తమ సినిమాలు తామే స్వంతగా పంపిణీ చేసుకోవాలని అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆ తరువాత ఆ వార్తలు అంతకన్నా ముందుకు వెళ్లలేదు. కానీ ఇటీవల గిల్డ్ సమావేశాల్లో ఆ ఆలోచన మరోసారి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. తమ సినిమాలు కొనమని ఎవరినీ అడగలేదని, తామే పంపిణీ చేసుకుంటామని నిర్మాత రవిశంకర్ ఆవేశంగా అన్నట్లు తెలుస్తోంది.
ఈ మొత్తం వ్యవహారం ఇలా వుంది. టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశాలు తరచు జరుగుతున్న సంగతి తెలిసిందే. గిల్డ్ వ్యవహారం అచ్చమైన మేడిపండుగా మారింది. పైకి అంతా ఒకటే..అభిప్రాయ బేధాలు లేవు అన్నట్లు కలరింగ్ వుంటోంది. లోలోపల మాత్రం ఎవరి లెవెల్ కు వారు కత్తులు నూరేసుకుంటున్నారు.
ఒకటి రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో ఎగ్జిబిటర్లు..ప్రొడ్యూసర్లు పాల్గొన్నారు. ఈ సమయంలో డెఫిసిట్ లు కూడా ఖర్చుల కింద రాయడం అనే పాయింట్ డిస్కషన్ కు వచ్చింది. తాము అలా రాయడం లేదని కొందరు ఎగ్జిబిటర్లు అన్నారు. దాంతో అక్కడ వున్న టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రీ అధినేతలు ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. తనమ సినిమాలకు డెఫిసిట్ లు కట్ చేస్తున్నారంటూ ప్రస్తావించారు.
తాము కట్ చేయడం లేదని సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన వారిని అడిగి తెలుసుకోండని ఎగ్జిబిటర్లు అన్నట్లు తెలుస్తోంది. దాంతో పాయింటర్ కాస్తా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు వైపు తిరిగినట్లు తెలుస్తోంది. దాంతో ప్రతి దానికి తమను టార్గెట్ చేస్తున్నారని, అన్నింటికీ తామే బలవుతున్నామని అనే అర్థం వచ్చేలా దిల్ రాజు మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. దానికి మైత్రీ రవిశంకర్ ఆవేశంగా బదులిస్తూ, మా సినిమాలు కొనకండి. మిమ్మల్ని ఎవరు కొనమన్నారు. మేమే పంపిణీ చేసుకుంటాం అని అన్నట్లు తెలుస్తోంది. దాంతో అక్కడున్న వారు సర్ది చెప్పి, ఇప్పుడు డిస్కషన్ అది కాదని, ఖర్చులు తగ్గించడం అని చెప్పి సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది.
మీడియాకు ప్రకటనలు ఆపేయండి
ఇదిలా వుంటే కొడుకును హీరోగా లాంచ్ చేస్తున్న ఓ దర్శకుడు కమ్ నిర్మాత మాట్లాడుతూ మీడియాకు ప్రకటనలు ఆపడం బెటర్ అని, మన ప్రకటనల వల్ల ఆదాయం పొందుతూ మన సినిమాల మీదే సమీక్షలు రాస్తున్నారని అన్నట్లు తెలుస్తోంది. సభ్యులు అలాంటి ప్రతిపాదన పెడితే, తాను అందుకు సిద్దం అని గిల్డ్ నేత దిల్ రాజు అన్నట్లు తెలుస్తోంది.