యూత్ లో బాగా పాపులరైంది బేబి సినిమా. ఇప్పుడా సినిమాను మించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ వైజాగ్ లో బయటపడింది. అయితే ఇది బేబి క్లయిమాక్స్ కాదు. దారుణాతి దారుణమైన విషాదాంతం. బేబి ఓ సినిమా మాత్రమే. కానీ ఇక్కడ 2 జీవితాలు బలయ్యాయి.
విశాఖపట్నం కొత్తపాలెంలోని నాగేంద్ర కాలనీకి చెందిన యువతి, అదే ప్రాంతంలో ఉంటున్న సాయి కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సాయి అటికా గోల్డ్ లో పనిచేసేవాడు. ఇద్దరూ ఒకర్ని విడిచి ఒకరు ఉండలేకపోయారు. దీంతో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారు.
ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. అసలు కథ ఆ తర్వాతే మొదలైంది. సాయిని పెళ్లి చేసుకున్న యువతి, సూర్యప్రకాష్ కు దగ్గరైంది. యువతికి పెళ్లయిందనే విషయం తెలియని సూర్యప్రకాష్ కూడా ఆమెను ప్రేమించాడు.
ఇలా ఒకవైపు సాయితో కాపురం చేస్తూనే, మరోవైపు సూర్యప్రకాష్ తో డేటింగ్ చేసింది సదరు యువతి. అయితే ఇలాంటివి ఎక్కువ రోజులు సీక్రెట్ గా సాగవు కదా. సూర్యతో తన భార్య క్లోజ్ గా ఉంటున్న విషయం సాయికి తెలిసింది. అదే టైమ్ లో తన గర్ల్ ఫ్రెండ్ కు ఆల్రెడీ పెళ్లయిందనే విషయం సూర్యకు తెలిసింది.
తనతో ఉండిపోవాలని సూర్యప్రకాష్, సాయి ఇద్దరూ బలవంతం చేశారు. దీంతో ఎటూ తేల్చుకోలేకపోయిన యువతి.. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. జరిగిన ఘటనపై యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీస్ కేసుకు భయపడిన సూర్యప్రకాష్, గోపాలపట్నంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇలా ఈ 'బేబి' లవ్ స్టోరీలో ఇద్దరు బలయ్యారు. మిగిలిన ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చనిపోతూ సూసైడ్ లెటర్ రాసింది యువతి. ఆ ఉత్తరం భర్తను ఉద్దేశించి రాసిందని పోలీసులు భావించారు. కానీ ప్రియుడిని ఉద్దేశించి ఉత్తరం రాసి ఆమె చనిపోయింది.
సదరు యువతి, సాయి రహస్యంగా పెళ్లి చేసుకున్న వీడియో.. అదే యువతి, సూర్యప్రకాష్ తో బీచ్ లో తీసుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.