తిరుమ‌ల న‌డ‌క దారులు…ష‌ర‌తులు!

తిరుమ‌ల న‌డ‌క‌దారిలో క్రూర‌మృగాల దాడుల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని టీటీడీ కొన్ని ష‌ర‌తులు విధించింది. భ‌క్తుల డిమాండ్ మేర‌కు పిల్ల‌ల ప్రాణాల సంర‌క్ష‌ణ‌కు టీటీడీ క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇక మీద‌ట 15 ఏళ్ల‌లోపు పిల్ల‌ల‌తో…

తిరుమ‌ల న‌డ‌క‌దారిలో క్రూర‌మృగాల దాడుల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని టీటీడీ కొన్ని ష‌ర‌తులు విధించింది. భ‌క్తుల డిమాండ్ మేర‌కు పిల్ల‌ల ప్రాణాల సంర‌క్ష‌ణ‌కు టీటీడీ క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇక మీద‌ట 15 ఏళ్ల‌లోపు పిల్ల‌ల‌తో ఏడు కొండ‌లు ఎక్కాలంటే తల్లిదండ్రులు నిర్ణీత గ‌డువులోపే న‌డ‌క మార్గానికి చేరుకోవాల్సి వుంటుంది. తాజాగా 15 ఏళ్ల లోపు పిల్ల‌ల‌పై న‌డ‌క దారిలో టీటీడీ ఉన్న‌తాధికారులు ష‌ర‌తులు విధించారు.

మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల త‌ర్వాత 15 ఏళ్ల‌లోపు పిల్ల‌ల్ని న‌డ‌క దారిలో అనుమ‌తించ‌రు. అలిపిరి న‌డ‌క దారి, శ్రీ‌వారి మెట్టు మార్గాల్లో ఇంత కాలం భ‌క్తులు న‌డుచుకుంటూ వెళ్లి శ్రీ‌వారిని ద‌ర్శించుకునేవారు. కొండ‌కు న‌డుచుకుంటూ వ‌స్తామ‌ని భ‌క్తులు శ్రీ‌వారికి మొక్కు పెట్టుకోవ‌డం తెలిసిందే. అయితే క్రూర మృగాల దాడుల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని భ‌క్తుల ప్రాణాల‌కు అత్య‌ధిక ప్రాధాన్యం ఇచ్చే క్ర‌మంలో టీటీడీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల పాప ల‌క్షిత‌, అలాగే నెల క్రితం ఐదేళ్ల బాలుడు చిరుత బారిన ప‌డ్డారు. అదృష్ట‌వ‌శాత్తు బాలుడు గాయాల‌తో బ‌తికి బ‌య‌ట ప‌డ్డాడు. కానీ చిన్నారి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. దీంతో న‌డ‌క దారిలో ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని టీటీడీపై పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వ‌చ్చాయి.

అలాగే నెల క్రితం బాలుడికి ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడే సుర‌క్షిత చ‌ర్య‌లు చేప‌ట్టి వుంటే , ఇవాళ బాలిక బ‌లి అయ్యేది కాద‌నే విమ‌ర్శ లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలో టీటీడీ వెంట‌నే యాక్ష‌న్‌లోకి దిగ‌డం గ‌మ‌నార్హం. కావున తిరుమ‌ల కొండ‌కు న‌డిచి వెళ్లాల‌ని భావించే భ‌క్తులు, త‌మ పిల్ల‌ల వ‌య‌సును బ‌ట్టి నిర్ణీత స‌మ‌యంలోపు న‌డ‌క మార్గాల‌కు చేరుకోవాల‌ని టీటీడీ విన్న‌విస్తోంది.