తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి వైసీపీ చెక్ పెట్టడం వెనుక పెద్ద కథే ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆమె నేతృత్వంలో ఇసుక దందా, జూదశాలల నిర్వహణ, యథేచ్ఛగా అవినీతి కార్యకలాపాలు సాగిస్తుండడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఉండి జూదశాలల నిర్వహించడంపై జగన్ సీరియస్ అయ్యారని సమాచారం. కొన్ని సందర్భాల్లో ఆమెను ప్రభుత్వ పెద్దలు హెచ్చరించారు. అయినప్పటికీ ఆమె వ్యవహార శైలిలో మార్పు రాలేదని అధికార పార్టీ నేతలు అంటున్నారు.
శ్రీదేవికి ఎలా చెక్ పెట్టాలని ఆలోచిస్తున్న ప్రభుత్వానికి చేజేతులా ఆమే అవకాశం ఇచ్చారు. ఇటీవల ఎల్లో మీడియాధిపతులను శ్రీదేవి కలిశారనే సమాచారం ప్రభుత్వానికి అందింది. దీంతో ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని అధికార పార్టీ గట్టి నిర్ణయం తీసుకుంది.
టీవీ5 అధిపతి బి.రాజగోపాల్‌నాయుడును నేరుగా శ్రీదేవి కలిసి చర్చించారని, అలాగే ఏబీఎన్ కార్యాలయానికి వెళ్లి కీలక పోస్టుల్లో ఉన్న ఉద్యోగులతో మాట్లాడారని సమాచారం. ఏబీఎన్ కార్యాలయం నుంచే ఫోన్లో ఆ మీడియా సంస్థ అధిపతి వేమూరి రాధాకృష్ణతో శ్రీదేవి చర్చించినట్టు వైసీపీ పెద్దలకు సమాచారం అందింది.
ఈ విషయమై శ్రీదేవిని అధికార పార్టీ పెద్దలు ప్రశ్నించగా… గతంలో తన భర్తతో కలిసి సదరు చానళ్లలో వైద్యపరమైన కార్యక్రమాలు ఇచ్చామని, ఆ పరిచయంతోనే మాట్లాడినట్టు వివరణ ఇచ్చారని తెలిసింది. అయితే ఆమె వివరణతో అధికార పార్టీ పెద్దలు సంతృప్తి చెందలేదు. ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే వారి పంచన చేరిందని అనుమానించారు.
తమకు శత్రువులుగా భావిస్తున్న సదరు మీడియా అధిపతులను తాడికొండ ఎమ్మెల్యే కలవడంపై అధికార పార్టీ నేతలు సీరియస్ అయ్యారు. దీంతో ఆమెకు పొగ పెట్టారు. తాడికొండ అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించి తమ ఉద్దేశాన్ని శ్రీదేవికి చెప్పకనే చెప్పారు. అయితే ఇవేవీ చర్చనీయాంశాలు కాలేదు. శ్రీదేవిని విస్మరించడానికి అసలు కారణాలపై తప్ప మిగిలిన సంగతుల గురించి చర్చించడమే అసలు ట్విస్ట్.