సూపర్ స్టార్ రజినీకాంత్ ఏది చేసినా, ఏది చేయకపోయినా సంచలనమే. దేశ రాజకీయ చరిత్రలో పార్టీ పెట్టే వరకు పెద్ద సీన్ క్రియేట్ చేసి, చివరి నిమిషంలో రద్దు చేసుకున్న ఏకైక నాయకుడు రజినీకాంతే.
పెళ్లి కూతురు పీటలపై నుంచి లేచి వెళ్లిపోయినట్టు రజినీకాంత్, నాకీ రాజకీయాలు వద్దంటూ వెళ్లిపోయారు. దీంతో అప్పటివరకూ ఆయనకు స్వాగతాలు పలికిన అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. నాకీ నియోజకవర్గం, నీకీ నియోజకవర్గం అంటూ లెక్కలేసుకున్న నేతలంతా గొణుక్కుంటూ, రజనీని తిట్టుకుంటూ వెళ్లిపోయారు.
కట్ చేస్తే రజనీకాంత్ మరోసారి తన అభిమానులకు కబురు పంపారు. రేపు చెన్నైలో అభిమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. తన అభిమాన సంఘానికి చెందిన అన్ని జిల్లాల నాయకులకు ఆహ్వానం పంపారు. గత నెల 19న వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన రజినీకాంత్ ఈనెల 9న తిరిగి చెన్నైకి చేరుకున్నారు. వచ్చీరాగానే ఇలా అభిమానుల మీటింగ్ అంటూ హడావిడి స్టార్ట్ చేశారు.
గతంలో రజనీకాంత్ అభిమానుల మీటింగ్ అంటే ఓ రేంజ్ లో ఉండేది. అన్ని జిల్లాల నుంచి ఫ్యాన్స్ తరలి వచ్చేవారు. రజనీ పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూసేవారు. మీడియా కవరేజీ ఓ రేంజ్ లో ఉండేది. అలా కొన్నాళ్లపాటు సూపర్ స్టార్ అభిమానుల మీటింగ్ లనేవి తమిళనాట సంచలనంగా మారాయి. ఆయన రాజకీయాలు చేయలేను అని చెప్పిన తర్వాత మాత్రం అభిమానులు తీవ్ర నిరాశకు గురైన మాట వాస్తవం.
అయితే ఇప్పుడు మరోసారి అభిమానులారా రారండి అంటూ రజనీ ఇచ్చిన పిలుపుతో వారికి ఒళ్లు మండింది. మేం రాము పొమ్మంటూ వర్తమానం పంపారట. జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ ల నాయకులెవరూ రజనీ పిలుపుకి సరిగ్గా స్పందించలేదని సమాచారం. ఒకరిద్దరు కీలక వ్యక్తులే గుంపులు గుంపులుగా జనాన్ని పోగుచేసుకుని రజనీని కలవడానికి వెళ్లబోతున్నారట. మరోవైపు క్షేత్రస్థాయిలో కూడా రజనీ కాంత్ మీటింగ్ ను ఆయన ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు. ఎదురుచూపులు ఆపేశారు.
గతంలో కొండంత రాగం తీసి తుస్సుమనిపించిన రజినీకాంత్ పై ఇప్పుడు సామాన్యులకే కాదు, అభిమానులకూ పెద్ద ఆసక్తి లేదు. ఆయన నేరుగా వచ్చి రాజకీయ పార్టీ ప్రకటించినా కూడా పో పోవయ్యా అంటూ పక్కకెళ్లిపోతారు. తనకు తానే అలాంటి పరిస్థితి తెచ్చుకున్నారు రజనీ. మరిప్పుడు ప్రత్యేకంగా అభిమానుల్ని పిలవడానికి వెనక అసలు కారణం ఏంటో ఆయనకే తెలియాలి. అమెరికా వెళ్లొచ్చిన ఆయన కొత్త విషయం ఏదైనా చెబుతారా అనేది ఆసక్తిగా మారింది. ఈ సంగతి పక్కనపెడితే, రజనీ పిలుపునకు స్పందించి రేపు ఎంతమంది మీటింగ్ కు వెళ్తారనేది మరో పెద్ద ప్రశ్న.