నో డౌట్.. మోడీ ఇక ఆ ధైర్యం చేయరు

జనతా కర్ఫ్యూ ముగిసిన వెంటనే మీడియా ముందుకొచ్చిన ప్రధాని మోడీ.. లాక్ డౌన్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఎలాంటి సన్నద్ధం లేకుండా యుద్ధానికి సిద్ధమై విమర్శలు మూటగట్టుకున్నా.. లాక్ డౌన్ తో కరోనాకి కట్టడి…

జనతా కర్ఫ్యూ ముగిసిన వెంటనే మీడియా ముందుకొచ్చిన ప్రధాని మోడీ.. లాక్ డౌన్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఎలాంటి సన్నద్ధం లేకుండా యుద్ధానికి సిద్ధమై విమర్శలు
మూటగట్టుకున్నా.. లాక్ డౌన్ తో కరోనాకి కట్టడి చేయగలిగారని, సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని కొన్ని వర్గాల నుంచి ప్రశంసలందుకున్నారు. ఇక ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ని పొడిగించడం, అది కూడా ఏకంగా మే-3 వరకు కొనసాగించాలని నిర్ణయించడంతో అందరూ షాకయ్యారు. అయితే ఈసారి మోదీ అంత ధైర్యం చేయరు.

మే-3 ముంచుకొస్తోంది. భారత్ లో కరోనా కేసుల్లో పెరుగుదలే కానీ, తగ్గుదల లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి బిగ్ బాస్ మోడీ టీవీల ముందుకొచ్చి ఎలాంటి బాంబు పేలుస్తారోనంటూ జోకులు మొదలయ్యాయి. మోడీ వస్తున్నారంటే జనంలో వణుకు మొదలవుతున్నట్టు మీమ్స్ తయారయ్యాయి. కానీ మే-3 తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంపై ఇప్పటికే జనాలకు ఓ క్లారిటీ వచ్చేసింది.

కేసులు భారీగా పెరిగిపోతున్న రెడ్ జోన్లను మినహాయించి.. మిగతా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. కేవలం నిత్యావసర సరకులు, కూరగాయల షాపుల వరకే వెసులుబాటు ఇచ్చిన కేంద్రం.. కొన్నిరోజులుగా ఇతర అన్ని షాపులు తెరుచుకోవచ్చని మార్గదర్శకాలు విడుదల చేసింది. తాజాగా.. వలస కూలీల తరలింపుపై కూడా ఉదారంగా వ్యవహరించింది. రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకుని కూలీల తరలింపు చేపట్టాలని ఆదేశించింది.

అంటే విందులు, విలాసాలు, వినోదాలు.. మినహా మిగతా అన్ని వ్యవహారాల్లో మునుపటి పరిస్థితి తెచ్చేందుకు కేంద్రం ఓ అడుగు ముందుకేసిందనే చెప్పాలి. కరోనా నివారణతో పాటు.. ఆర్థిక పరిస్థితిని అదుపులోకి తేవడంపై కూడా సర్కారు దృష్టిపెట్టింది. దీంతోపాటు.. వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయి, తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్న కూలీల గురించి కూడా కేంద్రం ఆలోచించింది. అందుకే వరుసగా ఒక్కో ముడి విప్పుకుంటూ వస్తోంది.

ఇవన్నీ చూస్తుంటే.. మే-3 తర్వాత లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఒకవేళ పొడిగించినా కఠిన ఆంక్షలన్నీ రెడ్ జోన్లకే పరిమితం అవుతాయి. మిగతా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. అయితే కొన్ని కండిషన్లు పెట్టే ఆస్కారం ఉంది. అవేంటనేది మాత్రమే ప్రస్తుతానికి సస్పెన్స్.

హెరిటేజ్ లో ఎంతమందికి కరోనా వచ్చింది?