“నీ పెళ్లి చూసి చనిపోవాలని ఉంది. నా ఆఖరి కోరిక నీ పెళ్లి చూడ్డమే. కళ్లారా నీ పెళ్లి చూసి కన్నుమూస్తా.” లాంటి డైలాగ్ లు సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా చూస్తుంటాం. చాలా కుటుంబాల్లో ఉండే వృద్ధులు.. మనవడు లేదా మనవరాలి పెళ్లి చూసి జీవితం చాలించాలని అనుకుంటారు. టెక్సాస్ లో కూడా అలాంటిదే ఓ ఘటన జరిగింది.
సౌత్ టెక్సాస్ కు చెందిన రసెల్, ఊపిరితిత్తుల కాన్సర్ తో బాధపడుతోంది. స్థానికంగా ఉన్న మెథడిస్ట్ హెల్త్ కేర్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటోంది. అయితే ఎక్కువ రోజులు బతకదని వైద్యులు తేల్చేశారు. ఆమె మనవరాలు సీన్, తన కాలేజ్ మేట్ ను ప్రేమించింది. మరికొన్ని నెలల్లో పెళ్లి పెట్టుకున్నారు.
అయితే బామ్మ పరిస్థితి చూసిన సీన్, తన పెళ్లి చూడాలనే ఆమె కోరికను తీర్చాలనుకుంది. అందుకే తన కాబోయే భర్తను వెంటబెట్టుకొని, పెళ్లి దుస్తుల్లో నేరుగా బామ్మ ఉన్న హాస్పిటల్ బెడ్ కు చేరుకుంది. అక్కడే బామ్మ ముందే చర్చి ఫాదర్ సమక్షంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అలా బామ్మ కోసం అనుకున్న టైమ్ కంటే కొన్ని నెలల ముందే పెళ్లి చేసుకొని, చివరి కోరికను తీర్చింది సీన్.
ప్రస్తుతం ఈ ''హాస్పిటల్ లో పెళ్లి''కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీన్ తీసుకున్న నిర్ణయాన్ని అంతా మెచ్చుకుంటున్నారు.