ఆంధ్రా ప్యాక్ట్ చెక్ అని వైసీపీ ప్రభుత్వం ఒక విభాగాన్ని నిర్వహిస్తోంది.తాజాగా రుషికొండపై ఏపీలో రాజకీయ వివాదం రేగింది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం ఓ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ప్రభుత్వానికి నెగెటివ్ కావడంతో తొలగించారు. ఈ లోపు ఆ ట్వీట్ వైరల్ అయ్యింది.
ఆ ట్వీట్‌నే ఈనాడు పత్రిక వార్తగా క్యారీ చేసింది. ఆంధ్రా ప్యాక్ట్ చెక్ ట్విటర్ ఖాతాలో ఈనాడు వార్తను పోస్ట్ చేసి, ఫేక్ అని, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ పల్లవి అందుకున్నారు. పోనీ దీనిపై అయినా నిలబడ్డారా? అంటే… అబ్బే అదీ లేదు. కాసేపటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్విటర్ ఖాతాలో మళ్లీ తామే నిన్న ఆ ట్వీట్ చేశామని పేర్కొనడంతో అధికార పార్టీ పరువు కాస్తా సోషల్ మీడియాలో బజారున పడింది.
“విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించి రుషికొండపై సచివాలయం నిర్మిస్తున్నారు” అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్వీటర్‌లో పోస్ట్ చేసింది. ఇదేంటి ప్రభుత్వం కదా ప్రకటన చేయాల్సింది, అధికార పార్టీ అత్యుత్సాహం చూపిందనే విమర్శ వెల్లువెత్తింది. ఇంత కాలం రుషికొండలో ఏవో ప్రభుత్వ కార్యాలయాల భవనాలు నిర్మిస్తున్నారని చెబుతూ వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు అధికార పార్టీ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా సచివాలయ నిర్మాణమని పేర్కొనడం రాజకీయంగా వివాదానికి దారి తీసింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ డిజిటల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్రా ప్యాక్ట్ చెక్ తన క్రియేటివిటీని ప్రదర్శించింది.
“రుషికొండ నిర్మాణంపై మరో దుష్ప్రచారం రుషికొండపై నిర్మిస్తున్నది సచివాలయం అంటూ వైఎస్సార్‌సీపీ ట్వీట్ చేసినట్టు తప్పుడు ప్రచారాలు” అంటూ ట్వీట్ చేసింది. దీంతో వైఎస్సార్‌సీపీ రుషికొండపై ట్వీట్ చేయలేదేమో అని కనీసం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలైనా నమ్మారు. కానీ వైఎస్సార్‌సీపీ తనకు మెదడు తలలో కాదు, మోకాళ్లలో ఉందని నిరూపించుకునేందుకు తహతహలాడింది. తాజాగా ఆ పార్టీ మరో ట్వీట్ చేసింది. అదేంటంటే…
“మా అధికారిక ట్విటర్ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన ట్వీట్‌లో పొరపాటున పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణలోకి తీసుకొనగలరు” అని అధికార పార్టీ ట్వీట్ చేయడం గమనార్హం.
అధికార పార్టీకి జనాలేమైనా పిచ్చోళ్లగా కనిపిస్తున్నారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆంధ్రా ప్యాక్ట్ చెక్ ట్విటర్ ఖాతా నుంచి ఫేక్ అని ఎల్లో పత్రికపై కారాలు మిరియాలు నూరారు. మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారిక ట్విటర్ ఖాతా నుంచి అబ్బే….ఆ ట్వీట్ చేసింది తామే అని ప్రకటించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా పరిగణలోకి తీసుకోవాలని వివరణ ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒక రోజులోనే సచివాలయం నిర్మాణం కాస్త టూరిజం శాఖ ప్రభుత్వ కార్యాలయాలయ్యాలయ్యాయి.
వైసీపీ అజ్ఞానం టీడీపీకి ఆయుధం అయ్యింది. అప్పుడే వైసీపీ పిల్లిమొగ్గలపై టీడీపీ ఘాటైన కౌంటర్లు స్టార్ట్ చేసింది. ఈ విషయమై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీరెడ్డి ట్విటర్ వేదికగా వైసీపీని తూర్పారపట్టారు.
“మూడు రాజధానుల చట్టం వెనక్కి తీసుకున్న విధంగా, రుషికొండ మీద సచివాలయ నిర్మాణ నిర్ణయం కూడా వెనక్కి తీసుకున్నారా? ఇప్పుడు చెప్పండి ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎవరు అడ్డుపడుతున్నారు? ఏ నిర్ణయం మీద మీరు నిలబడతారు” అంటూ ఆయన వైసీపీని నిలదీస్తూ ట్వీట్ చేశారు. ఇప్పుడు వైసీపీ ఏం సమాధానం చెబుతుందో చూడాలి.