రిషి కపూర్ ఇక లేరు

బాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరైన రిషి కపూర్ కొద్దిసేపటి కిందట కన్నుమూశారు. కొంత కాలంగా కాన్సర్ తో బాధపడుతున్న రిషి కపూర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను ముంబయిలోని హాస్పిటల్ కు తరలించారు.…

బాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరైన రిషి కపూర్ కొద్దిసేపటి కిందట కన్నుమూశారు. కొంత కాలంగా కాన్సర్ తో బాధపడుతున్న రిషి కపూర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను ముంబయిలోని హాస్పిటల్ కు తరలించారు. ఆ వెంటనే కొద్దిసేపటికి రిషి కపూర్ మరణించారు. ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూసిన కొన్ని గంటల వ్యవథిలోనే మరో దిగ్గజ నటుడు రిషికపూర్ కూడా మరణించడంతో బాలీవుడ్ ను షాక్ కు గురిచేసింది.

రాజ్ కపూర్ నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రిషికపూర్.. ఒక దశలో రొమాంటిక్ హీరోగా తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడే నేషనల్ ఆవార్డు అందుకున్న రిషికపూర్.. బాబి సినిమాతో హీరోగా మారారు. తొలి సినిమాతోనే బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డ్ అందుకున్నారు.

తన కెరీర్ లో సోలో హీరోగా 51 సినిమాలు చేశారు రిషి కపూర్. వీటిలో బాబి, నాగిన, చాందిని, కర్జ్, ప్రేమ్ రోగ్ లాంటి సూపర్ హిట్ సినిమాలున్నాయి. ఆయన నటించిన మల్టీస్టారర్ సినిమాల్లో హిట్స్ ఎక్కువ. 1999లో దర్శకుడిగా కూడా మారారు రిషికపూర్.

2000 సంవత్సరం నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు రిషికపూర్. హమ్ తుమ్, ఫనా, నమస్తే లండన్, లవ్ ఆజ్ కల్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. అలా గతేడాది వరకు ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా ఆయనో కొత్త సినిమా ఎనౌన్స్ చేశారు. అంతలోనే ఇలా అర్థాంతరంగా తనువు చాలించారు.

తన సహనటి నీతూసింగ్ ను పెళ్లాడారు రిషికపూర్. వీళ్లిద్దరూ కలిసి 15 సినిమాల్లో నటించారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు. కూతురు రిద్దిమా కపూర్ డిజైనర్ గా స్థిరపడగా, కొడుకు రణబీర్ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు.

2018లో రిషికపూర్ లో కాన్సర్ లక్షణాలు బయటపడ్డాయి. వెంటనే ఆయన అమెరికా వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకున్నారు. దాదాపు 10 నెలల పాటు అమెరికాలోనే ఉండిపోయారు. కాన్సర్ నుంచి కోలుకొని గతేడాది ఇండియా తిరిగొచ్చారు. అప్పట్నుంచి ఆరోగ్యంగానే ఉన్నారు.

అయితే గడిచిన కొన్ని రోజులుగా అస్వస్థతకు గురయ్యారు. రాత్రి ఆయన పరిస్థితి మరింత విషమించడంతో హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఈరోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.