ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా బీజేపీ వ్యూహానికి టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ గిలగిలా తన్నుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాను టాలీవుడ్ ప్రముఖ హీరో, దివంగత ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కలవనున్నారు. ఈ భేటీకి రాజకీయంగా విశేష ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా ఎవరినీ ఊరికే కలవరు.
ఎవరితోనైనా వారు భేటీ అయ్యారంటే మరెవరికో స్పాట్ పెట్టారని అర్థం చేసుకోవలసి వుంటుంది. అపాయింట్మెంట్ ఇవ్వండయ్యా అని రెండేళ్లుగా మోదీ, అమిత్‌షాలను జనసేనాని పవన్‌కల్యాణ్ వేడుకుంటున్నారు. పైగా బీజేపీకి ఆయన మిత్రపక్షం కూడా. ఎందుకనో పవన్‌ను కలవడానికి వారు అఇష్టంగా ఉన్నట్టు, నిరాదరణే చెబుతోంది.
ఈ నేపథ్యంలో అమిత్‌షాతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కావాలని నిర్ణయించడం ఏపీలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేచింది. చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్‌కు ఆత్మీయ సంబంధాలు లేవని అందరికీ తెలుసు. గత ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ మామ వైసీపీకి మద్దతు ఇచ్చారు. టీడీపీకి మళ్లీ పూర్వవైభవం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్లు సొంత పార్టీ శ్రేణుల నుంచే వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ ససేమిరా అంటున్నారు.
ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకొస్తే లోకేశ్‌ను ఎవరూ పట్టించుకోరనే భయం చంద్రబాబు, బాలకృష్ణలలో ఉంది. అంతేకాదు, భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు ఏవో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే దుమారం చెలరేగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందన సరిగా లేదని టీడీపీ నేతలు వర్ల రామయ్య, బోండా ఉమా, బుద్ధా వెంకన్న తదితరులు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు మెహర్బానీ కోసం నాయకులు ఎలా వ్యవహరిస్తున్నా, టీడీపీ శ్రేణుల్లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వంపై నమ్మకం ఉందనేది నిజం. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్‌షా భేటీ కావడం టీడీపీ నాయకత్వం జీర్ణించుకోలేని విషయం.
ఇక జనసేన విషయానికి వస్తే… మిత్రపక్షంగా ఉంటూనే చంద్రబాబు ప్రయోజనాల కోసం డ్రామాలాడుతున్నారనే ఆరోపణలను పవన్‌కల్యాణ్ ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా తమతో పొత్తులో ఉంటూ చంద్రబాబుతో అంటకాగడాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. నమ్మకస్తుడైన భాగస్వామి కాదనే పేరు పవన్‌కల్యాణ్ తెచ్చుకున్నారు. దీంతో పవన్‌కు క్రమంగా ప్రాధాన్యం తగ్గిస్తూ, ప్రత్యామ్నాయంగా విశేష ప్రజాదరణ కలిగిన సినీ హీరోని తెచ్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.
ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి పేరును ప్రముఖంగా పరిశీలిస్తున్న అంశాన్ని కొట్టి పారేయలేం. ఈ నేపథ్యంలో మునుగోడుకు వస్తున్న అమిత్‌షా… తిరుగు ప్రయాణంలో ఎన్టీఆర్‌ను కలవాలని నిర్ణయించుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్‌ను కలవడం మాత్రం ఇటు చంద్రబాబు, అటు పవన్‌కల్యాణ్ మాత్రం తట్టుకోలేకపోతున్నారనేది వాస్తవం. ఇదే బీజేపీ కోరుకుంటున్నది కూడా.