ఎద్దు ఈనిందంటే గాటన కట్టేయమన్నాడంట వెనకటికి ఓ ప్రబుద్ధుడు. మన తెలుగుమీడియాలో పెద్దల పరిస్థితి అంతకంటె భిన్నంగా ఎంతమాత్రమూ లేదు. ఓ ఇద్దరు ప్రముఖులు కలిస్తే చాలు.. అది పెళ్లో చావో తద్దినమో ఏదైనా కావొచ్చు గాక.. పొరబాటున కూడా కలిసి ఉండొచ్చు గాక.. ఆ ఇద్దరు కలిశారని తెలియగానే.. దానికి దట్టించగల మసాలా, పోపు అన్నీ దట్టించేసి ఓ కథనం వండి వార్చేస్తారు. అలాంటి మసాలా వంటకం లాగానే కనిపిస్తోంది రజనీకాంత్ కు గవర్నర్ పోస్టు ఆఫర్ వార్త కూడా!
రజనీకాంత్ రాజకీయ పార్టీ అనేది ఒక ముగిసిపోయిన ప్రహసనం అయిపోయింది. పార్టీని కూడా ప్రకటించి.. సుదీర్ఘకాలం సాగదీసి.. చివరికి ఆయన తుస్పుమనిపించారు. ఒకసారి రాజకీయాల్లోకి రాను అని చెప్పేసిన తర్వాత సైలెంట్ గానే ఉన్నారు. కాకపోతే ఇటీవల ఢిల్లీలో బిజెపి పెద్దల్ని కలిశారు. తిరిగి చెన్నై వచ్చిన తర్వాత.. గవర్నరును కూడా కలిశారు. బయటకు వచ్చాక గవర్నరుతో రాజకీయాలు కూడా మాట్లాడానని, అయితే ఆ విషయాలు బయటకు చెప్పనని మాత్రం అన్నారు. నిజానికి రజనీ చాలా పద్ధతిగా మాట్లాడినట్టు లెక్క.
ఎవ్వరికీ లేనంత అత్యుత్సాహం తెలుగుమీడియాకు వచ్చేసింది. పూనకం తెచ్చుకుని.. బిజెపి వాళ్లతో ఎప్పటినుంచో సత్సంబంధాలు ఉన్న రజనీకి ఆ పార్టీ గవర్నరు పోస్టు ఇవ్వబోతున్నదంటూ కథనాల్ని వండి వార్చారు. గొర్రెదాటుగా వార్తల్ని కాపీకొట్టే మీడియాలన్నీ అదే ప్రచారాన్ని కంటిన్యూ చేశాయి. రజనీని గవర్నరు చేయడం ద్వారా తమిళ ప్రజల అభిమానాన్ని చూరగొని.. ఆ రాష్ట్రంలో పాగా వేయాలని బిజెపి అనుకుంటున్నట్టుగా వంటలో మసాలాలు కూడా దట్టించారు.
అయినా రజనీ ముఖ్యమంత్రి అవుతాడంటే.. ఫ్యాన్స్ వెర్రెత్తిపోతారేమో గానీ.. గవర్నరు పోస్టుకు వెళ్తే వాళ్లేం సంతోషిస్తారు. బిజెపిని ఎందుకు నెత్తిన పెట్టుకుంటారు. ఈ లాజిక్ వాళ్లకు తట్టలేదు. పైగా.. తమ హీరోని సినిమాలకు కాకుండా చేసినందుకు.. బిజెపిని ఆ రాష్ట్రంలో సమాధి చేసినా చేసేయగలరు. కానీ వేలం వెర్రిగా ఆ ప్రచారం జరుగుతూనే ఉంది.
అయినా రజనీకాంత్ గవర్నరు గిరీ ఎందుకు స్వీకరిస్తారు? రెండేళ్లకు ఒక్క సినిమా చేసుకున్నా.. జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఆయనకు కోట్లకు కోట్లు డబ్బులొచ్చి పడతాయి. అలాంటిది వదులుకుని.. క్రేజ్ పరంగా కూడా పెద్ద పాపులారిటీ ఉండని గవర్నరు పోస్టును ఆయన ఎందుకు ఆశిస్తారు అని.. ఆ ప్రచారం చేసేవాళ్లకు స్ఫురించకపోవడమే తమాషా!