హృతిక్ రోషన్ ఫిజిక్ కు, అతడి యాక్షన్ ఇమేజ్ కు తగ్గ సినిమా ఇప్పటివరకు పడలేదంటారు అతడి ఫ్యాన్స్. వార్ లాంటి యాక్షన్ మూవీస్ లో హృతిక్ నటించినప్పటికీ అది చాలదనేది వీళ్ల అభిప్రాయం. ఇప్పుడు వీళ్లంతా ఒకేసారి పండగ షురూ చేశారు. హృతిక్ కు ఇన్నాళ్లకు సరైన సినిమా పడిందని వీళ్లు అభిప్రాయపడుతున్నారు. అదే ఫైటర్.
ఈ సినిమాను ఈ ఏడాది జనవరిలోనే ప్రకటించాడు హృతిక్ రోషన్. కానీ ఆ తర్వాత సినిమాపై చాలా పుకార్లు చెలరేగాయి. ఒక దశలో ఆగిపోయిందనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటకొచ్చాయి. త్వరలోనే సినిమా సెట్స్ పైకి కూడా రాబోతోంది
హృతిక్ రోషన్, దీపిక పదుకోన్ హీరో హీరోయిన్లుగా నటించనున్న ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ అడ్వెంచరస్ గా రాబోతోంది. మరీ ముఖ్యంగా ఇందులో యాక్షన్ సన్నివేశాలు ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉండబోతున్నాయి.
ఈ విషయాన్ని దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ బయటపెట్టాడు. తమ సినిమాలో యుద్ధ విమానాలు, గాల్లో యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని ప్రకటించాడు. ఈ తరహా సినిమా ఇండియాలో ఇదే ఫస్ట్ టైమ్ అంటున్నాడు.
గ్లోబల్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని తయారుచేసిన ఈ సినిమాలో హృతిక్ రోషన్ కంప్లీట్ యాక్షన్ లుక్ లో కనిపించబోతున్నాడట. ఇంతకుముందు చేసిన యాక్షన్ సినిమాలకు భిన్నంగా, హాలీవుడ్ స్థాయిలో హృతిక్ యాక్షన్ ఉంటుందంటున్నారు. హృతిక్ ఫిజిక్ కు, అతడి యాక్షన్ ఇమేజ్ కు ఇదే సరైన మూవీ అంటున్నారు అతడి ఫ్యాన్స్.