కర్నూలు జిల్లాలో ఎంతో పేరున్న భూమా ఫ్యామిలీ రాజకీయంగా రోజురోజుకూ మసకబారుతోంది. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి, శోభమ్మ దంపతుల వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన అఖిలప్రియ భవిష్యత్ అంధకారమవుతోందనే అభిప్రాయాలు బలపడుతున్నాయి.
అఖిలప్రియ రాజకీయ భవిష్యత్ సర్వనాశనం కావడానికి శత్రువులెవరూ అవసరం లేదని, తనకు తానుగా ఆ పని చేసుకోగలరనే చర్చ కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇందుకు ఆమె భర్త భార్గవ్‌రామ్ ఒక్కరుంటే చాలని భూమా కుటుంబాన్ని అభిమానించే గ్రామనేతలు వ్యంగ్యంగా అంటున్నారు.
ముఖ్యంగా ఆమె జీవితంలోకి భార్గవ్‌రామ్ ప్రవేశించిన తర్వాత , చాలా మంది సన్నిహితులంతా దూరమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తనకంటూ తల్లిదండ్రుల వైపు నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా దగ్గరగా లేకపోవడాన్ని ఆళ్లగడ్డ ప్రజానీకం గుర్తు చేస్తోంది. తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి తప్ప, మరే రక్త సంబంధీకులు వెన్నంటి లేకపోవడం వెనుక అఖిలప్రియ స్వయంకృతాపరాధం ఉందని భూమా సన్నిహితులు చెబుతున్నారు.
తాజాగా కోవిడ్ నకిలీ సర్టిఫికెట్లను సమర్పించి కేసులో భర్త భార్గవ్‌రామ్, తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి ఇరుక్కోవడాన్ని భూమా అభిమానులు తప్పు పడుతున్నారు. చిన్నవో పెద్దవో తప్పుల మీద తప్పులు చేస్తూ కేసుల ఊబిలో ఇరుక్కుంటూ, తమకు తాముగా రాజకీయ పతనాన్ని కోరి తెచ్చుకుంటున్నారని భూమా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలం క్రితం హైదరాబాద్‌లో ఓ భూమి విషయమై కిడ్నాప్‌ను పాల్పడడం, అందులో అఖిలప్రియ అరెస్ట్ కావడంతో ఎంతో నష్టం కలిగిందంటున్నారు.
భూమా అఖిలప్రియ వెంట ఉంటే ఏదో ఒక రోజు ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందనే ఆందోళన గ్రామస్థాయి టీడీపీ నేతల్లో నెలకుంది. దీంతో ఆమె పేరు చెబితే భయపడే పరిస్థితి ఉందంటున్నారు. ఇదంతా భర్త భార్గవ్‌రామ్ ఛీప్‌ట్రిక్స్ అనే అభిప్రాయాలున్నాయి. అఖిలప్రియతో పాటు జగత్ పొలిటికల్ కెరీర్ కూడా నాశనమవుతోందనే ఆవేదన భూమా అభిమానుల్లో నెలకుంది.
కోవిడ్ నకిలీ సర్టిఫికెట్ కేసులో ప్రస్తుతం అఖిలప్రియ భర్త, తమ్ముడు పరారీలో ఉన్న విషయాన్ని భూమా అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఓ పెద్ద రాజకీయ కుటుంబ సభ్యులు చేయాల్సిన పనులేనా ఇవి? అని ప్రశ్నిస్తున్నారు. దీంతో అఖిలప్రియ ప్రజల్లో చులకన అవుతున్నారని చెబుతున్నారు.
మరోవైపు ఆళ్లగడ్డలో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్, తమ్ముడు జగత్ వ్యవహారాలపై టీడీపీ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి నియోజకవర్గంలోని గ్రామస్థాయి నాయకులకు ఫోన్లు చేస్తూ …నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తున్నారని సమాచారం. ఈ సందర్భంగా అఖిలప్రియ నాయకత్వం, ఆమె భర్త భార్గవ్‌రామ్ చేష్టలపై టీడీపీ గ్రామ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.
ఆళ్లగడ్డలో ఇదే నాయకత్వం కొనసాగితే మాత్రం 2024లో కూడా గత ఫలితమే పునరావృతం అవుతుందని గ్రామనేతలు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన నాయకత్వాన్ని నిలుపుకునేందుకు అఖిలప్రియ తన లోపాలను సరిదిద్దు కుంటారా? లేక పతి చెప్పినట్టే సతి అని నడుచుకుంటూ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటారో… అంతా ఆమె చేతుల్లోనే ఉందని కర్నూలు జిల్లాకు చెందిన ఓ సీనియర్ టీడీపీ నేత చెప్పడం గమనార్హం.