రెడ్డి కమ్మ భాయ్ భాయ్

రెడ్డి, క‌మ్మ సామాజిక వ‌ర్గాల మ‌ధ్య పచ్చగ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా రాజ‌కీయ వైరం ఉంద‌ని అంద‌రూ న‌మ్ముతారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు చూస్తే ఎవ‌రికైనా ఇదే అభిప్రాయం క‌లుగుతుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కుల రాజ‌కీయాలు రాజ్య‌మేలుతున్నాయి. క‌మ్మ…

రెడ్డి, క‌మ్మ సామాజిక వ‌ర్గాల మ‌ధ్య పచ్చగ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా రాజ‌కీయ వైరం ఉంద‌ని అంద‌రూ న‌మ్ముతారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు చూస్తే ఎవ‌రికైనా ఇదే అభిప్రాయం క‌లుగుతుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కుల రాజ‌కీయాలు రాజ్య‌మేలుతున్నాయి. క‌మ్మ సామాజిక వ‌ర్గంపై కోపంతోనే రాజ‌ధాని అమ‌రావ‌తిని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మార్చార‌నే అభిప్రాయాలు, ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే క‌మ్మ వ‌ర్సెస్ రెడ్డి అనేది ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌కే ప‌రిమితం. నాణేనికి రెండో వైపు చూస్తే …చాలా ఆశ్చ‌ర్యం క‌లుగు తుంది. తెలంగాణ‌లో ఇందుకు పూర్తి భిన్న‌మైన వాతావ‌ర‌ణంలో రాజ‌కీయాలు స్టార్ట్ అయ్యాయి. మున్ముందుకు తెలంగాణ‌లో క‌మ్మ‌, రెడ్డి బాయ్ బాయ్ అనే రీతిలో రాజ‌కీయాలు న‌డ‌వ‌నున్నాయి. 

టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఎనుముల రేవంత్‌రెడ్డి నియామ‌కం జ‌రిగిన త‌ర్వాత రెడ్ల కంటే టీడీపీని భుజాన మోసే క‌మ్మ సామాజిక వ‌ర్గ‌మే ఎక్కువ ఆనంద‌ప‌డుతోంది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం రేవంత్‌రెడ్డి ప‌క్కా చంద్ర‌బాబు మ‌నిషి కావ‌డం, అలాగే దివంగ‌త వైఎస్సార్‌తో పాటు ఆయ‌న కుటుంబ‌మంటే అస‌లు గిట్ట‌క‌పోవ‌డం. ఇవి చాల‌దా రేవంత్‌రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయితే టీడీపీ నేత‌లు సంతోషించ‌డానికి.

రేవంత్‌రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ కావ‌డంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే రేవంత్‌రెడ్డి అర్హ‌త‌ల‌కు ఏం త‌క్కువ‌ని టీడీపీ సోష‌ల్ మీడియా దీటుగా కౌంట‌ర్లు ఇవ్వ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. అలాగే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కీల‌క ప‌ద‌వి ద‌క్క‌గానే టీడీపీ అనుకూల మీడియా ఆనందానికి ప‌ట్ట‌ప‌గ్గాల్లేకుండా పోయాయి. ఇక తెలంగాణ‌లో ఆట మొద‌లైందంటూ మైండ్ గేమ్ స్టార్ట్ చేయ‌డాన్ని గ‌మ‌నించొచ్చు.

పైగా పీసీసీ అధ్య‌క్షుడు కాగానే టీడీపీ అనుకూల మీడియా సంస్థ‌ల య‌జ‌మానులు రామోజీరావు, వేమూరి రాధాకృష్ణ‌, నాయుడు త‌దిత‌రుల‌ను క‌లిసి ఆశీస్సుల‌తో పాటు మ‌ద్ద‌తు కోర‌డం గ‌మ‌నార్హం. ఇంత వ‌ర‌కూ కాంగ్రెస్ బ‌ద్ద వ్య‌తిరేకిగా ముద్ర‌ప‌డిన ఎల్లో మీడియా అనూహ్యంగా రేవంత్‌రెడ్డికి బాస‌ట‌గా నిల‌బ‌డ‌డం వెనుక ఏ వ్యూహం లేదంటే న‌మ్మేదెవ‌రు? చంద్ర‌బాబు సిఫార్సు మేర‌కే రేవంత్‌రెడ్డికి టీపీసీసీ ఛీప్ ప‌ద‌వి ద‌క్కింద‌నే అభిప్రాయాలు బ‌లంగా ఉన్నాయి.

మురోవైపు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ అధ్య‌క్షుడైతే, టీడీపీ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటుండంతో కాంగ్రెస్ శ్రేణుల‌కు దిక్కుతోచ‌ని ప‌రిస్థితి. రేవంత్‌రెడ్డి మ‌నిషి మాత్ర‌మే కాంగ్రెస్‌, మ‌న‌సంతా టీడీపీనే అని …తెలుగుదేశం శ్రేణులు, ఆ పార్టీ అనుకూల మీడియా న‌మ్ముతోంది. రేవంత్‌రెడ్డిలో చంద్ర‌బాబును చూసుకోవ‌డం వ‌ల్లే భేష‌ర‌తుగా ఆయ‌న‌కు ఎల్లో మీడియా, టీడీపీ శ్రేణులు అండ‌గా నిలుస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఏపీలో రాజ‌కీయంగా క‌మ్మ‌, రెడ్ల సామాజిక వ‌ర్గాల మ‌ధ్య పోరు న‌డుస్తున్నా… తెలంగాణ‌లో మాత్రం రెడ్డి నాయ‌కుడిని మెజార్టీ క‌మ్మ సామాజిక వ‌ర్గం భుజానెత్తుకుని మోస్తోంద‌న్న‌ది వాస్త‌వం. ఈ నేప‌థ్యంలో సొంత సామాజిక వ‌ర్గం నుంచి రేవంత్‌రెడ్డికి ఏ మాత్రం మ‌ద్ద‌తు ల‌భిస్తుందో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.