కరోనా పాజిటివ్ ఉద్యోగులకు 20 రోజుల సెలవులు మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైనా ఉద్యోగులకు ఇది తీపి కబురుగా చెప్పొచ్చు. కరోనా పాజిటివ్ ఉద్యోగులకు 15 రోజులు ప్రత్యేక సాధారణ సెలవులు, 5 రోజులు కమ్యూటెడ్ సెలవులు కలిపి మొత్తం 20 రోజుల సెలవులు మంజూరు చేస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేయడానికి సీఎం వైఎస్ జగన్ అంగీకరించారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు లేదా వారి కుటుంబ సభ్యులకు కానీ కరోనా పాజిటివ్ వస్తే 28 రోజులు స్పెషల్ క్యాజువల్ సెలవులు మంజూరు చేయాలనే తమ విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నట్టు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.
ఈ మేరకు ఫైల్‌పై సీఎం సంతకం కూడా చేశారని ఆయన తెలిపారు. రెగ్యులర్, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికి కరోనా వచ్చినా 20 రోజుల సెలవులు మజూరు చేస్తారని ఆయన చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు యధాతథంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్య మంత్రి కార్యాలయ అధికారులు తెలపడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సౌకర్యాన్ని దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.