మిడ్ రేంజ్ హీరోలూ..తస్మాత్ జాగ్రత్త

సినిమా రంగంలో ఎప్పటికప్పుడు కొత్త నీరు రావాల్సిందే. లేదూ అంటే పాత నీరు జోరు తట్టుకోలేము. రెండు హిట్ లు కొట్టగానే రెమ్యూనిరేషన్ అమాంతం పెరిగిపోతుంది. గొంతెమ్మ కోరికలు పెరిగిపోతాయి. రెండు ఫ్లాపులు పడితే…

సినిమా రంగంలో ఎప్పటికప్పుడు కొత్త నీరు రావాల్సిందే. లేదూ అంటే పాత నీరు జోరు తట్టుకోలేము. రెండు హిట్ లు కొట్టగానే రెమ్యూనిరేషన్ అమాంతం పెరిగిపోతుంది. గొంతెమ్మ కోరికలు పెరిగిపోతాయి. రెండు ఫ్లాపులు పడితే చాలు కాళ్లు నేలకు ఆనేస్తాయి. తెలుగు సినిమా రంగంలో మిడ్ రేంజ్ హీరోల వ్యవహారం ఇది. ఈ వైఖరి నిర్మాతలను, దర్శకులను తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. కొత్త కొత్త హీరోలు రావాలి. పరిచయం చేయాలి. అని చూస్తున్నారు ఇప్పుడు. 

ఓ హీరో వరుస ఫ్లాపుల్లో వుండగా, ఓ డైరక్టర్ సినిమా చేసి హిట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ డైరక్టర్ కు డేట్ లు ఇవ్వడానికి ఆ హీరో ఎటో చూస్తున్నాడు. ఆ హీరో అనే కాదు, ప్లాపుల్లో వున్న హీరోలకు హిట్ లు దొరకిన తరువాత మరి కొత్త వాళ్ల కేసి చూస్తున్నారు. ఎందుకంటే పాత బ్యానర్లయితే కొత్త రెమ్యూనిరేషన్ అడగడానికి మొహమాటం అడ్డం పడుతుంది. 

ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోలు దాదాపుగా అయిదు నుంచి పది కోట్ల కు  మధ్యలో వున్నారు. అందుకే నిర్మాతలు కాస్త ఆశాజనకంగా వున్నకొత్త హీరోల కేసి చూస్తున్నారు. విష్వక్ సేన్, నవీన్ పోలిశెట్టి, సత్యదేవ్, తేజు సజ్జా, సంతోష్ శోభన్ లాంటివాళ్లు మంచి ఆప్షన్లుగా కనిపిస్తున్నారు. కోటి నుంచి రెండు కోట్లతో వీళ్ల డేట్ లు దొరుకుతున్నాయి. పది కోట్లు మిడ్ రేంజ్ హీరోకి ఇచ్చే బదులు, ఆ పది కోట్లతో సినిమా మొత్తం కానిచ్చేయవచ్చు. కొడితే జాతిరత్నాలు లాంటిది కొట్టినా కొట్టేయచ్చు. 

ఏక్ మినీ కథ సినిమాతో నిర్మాతలకు మంచి డబ్బులు వచ్చాయి. అందుకే మళ్లీ అదే హీరోతో మరో రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది దాటేసరికి దాదాపు ఇద్దరు ముగ్గురు మిడ్ రేంజ్ హీరోలు దిగి వస్తారని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాబోయే మిడ్ రేంజ్ హీరోల సినిమాల్లో ఏవి ప్రామిసింగ్ గా వున్నాయి. ఏవి లేవు. అన్నది లెక్కలు కడుతున్నారు. 

తేడా వస్తే ఈ మిడ్ రేంజ్ హీరోలంతా మళ్లీ పాత రెమ్యూనిరేషన్ అయిన మూడు కోట్లు, అయిదు కోట్లకు దిగుతారని అంచనా వేస్తున్నారు. ఈ మిడ్ రేంజ్ హీరోలు కూడా వాస్తవం గమనించడం లేదు. ఓటిటి వచ్చిన తరువాత పెద్ద సినిమాలకు మరీ చిన్న సినిమాలకు సమస్య లేదు. ముఫై, నలభై కోట్ల సినిమాలకే సమస్య. ఈ విషయాన్ని మిడ్ రేంజ్ హీరోలు గుర్తించడంలేదు. శర్వానంద్ రణరంగం సినిమాకు పది కోట్లు ఎగిరిపోయాయి. నితిన్ చెక్ సినిమా సంగతి తెలిసిందే.

రెమ్యూనిరేషన్లకే ఇరవై కోట్లు అవుతోంది మిడ్ రేంజ్ హీరోలకు. నలభై కోట్ల వస్తే తప్ప కిట్టుబాటు కాదు. థియేటర్లకు పెద్ద సినిమాలకు వచ్చినట్లు మిడ్ రేంజ్ సినిమాలకు రావడం జనాలు తగ్గించేసారు. మరీ అద్భుతమైన టాక్ వస్తే తప్ప రారు. లేదూ అంటే ఓటిటి విడుదల కోసం చూస్తున్నారు. 

మిడ్ రేంజ్ హీరోలు రాబోతున్న ప్రమాదాన్ని, పెరుగుతున్న కొత్త నీటి ప్రవాహాన్ని గమనించుకోవాల్సి వుంది. లేదూ అంటే వెనక్కు వుండిపోయేవారికి అడుగు బొడుగు కథలు దక్కుతాయి. దాంతో ఫ్లాపుల మీద ఫ్లాపులు పెరిగి, కొత్త నీటికి చోటు ఇచ్చి పక్కకు తప్పుకోవాల్సి వస్తుంది.