ఇండియా టుడే వారి తాజా సర్వే దేశంలో అందరికంటె ప్రజాదరణ గల ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ను పేర్కొంది. కర్ణాటక బిజెపి వారు వారి రాష్ట్రంలో యోగి పాలన తెస్తామంటున్నారు. మోదీ ఉండగా యోగి జపం చేయడం వింతగా ఉంది. అంటే మోదీ మార్కు హిందూత్వ డోసు వారికి చాలదని కర్ణాటక బిజెపి వారి భావం కాబోలు. వాజపేయి-ఆడ్వాణీ శకంలో వాజపేయిని మితవాదిగా, ఆడ్వాణీని అతివాదిగా భావించేవారు. అతని కంటె ఘనుడు ఆచంట మల్లన మోదీ వచ్చాక ఆడ్వాణీ మితవాదిగా ముద్రపడ్డారు. ఇప్పుడు యోగి వచ్చాక మోదీకి ఉదారవాదిగా ముద్ర పడుతుందేమో చూడాలి. మోదీ యిప్పుడు ప్రధాని ఐనా, ఒకప్పుడు ముఖ్యమంత్రే కదా. ఆయన పాలనలో గుజరాత్ అభివృద్ధిలో అద్భుతంగా ముందుకు దూసుకుపోయిందన్న ప్రచారమూ జరిగింది కదా! అలాటప్పుడు రాష్ట్రస్థాయిలో మోదీని ఆదర్శంగా తీసుకోకుండా యోగిని తీసుకోవడమేమిటి? వింతగా లేదూ!
అభివృద్ధిని ఎన్నికల అంశంగా చూపించదలచుకుంటే మోదీని ముందుకు తీసుకురావాలి, హిందూత్వను ఎన్నికల అంశం చేద్దామనుకుంటే యోగిని ముందు పెట్టాలి అని బిజెపి వాళ్లు అనుకుంటున్నారేమో! ఎందుకంటే కర్ణాటకలో ఎవరు అధికారంలో ఉన్నా అభివృద్ధి సాగుతూనే ఉంది. ఇప్పుడు హిందూత్వను ప్రజ్వరిల్లింప చేయడం ద్వారా బిజెపి బలపడదామని చూస్తోంది. అందుకే కాబోలు యోగిజపం. తెలంగాణలో బిజెపికి దొరికిన అస్త్రం కెసియార్ కుటుంబపాలన. కేంద్రం నిధులివ్వకుండా ఏడిపిస్తోందన్న తెరాస బలమైన వాదనకు ప్రతిగా బిజెపి చెప్తున్న అంకెలు గందరగోళంగా ఉన్నాయి. తెరాస పట్ల ప్రజలకు అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే కానీ, ఓడించేటంత ఆగ్రహం లేదు. ఇటు బిజెపిలో కెసియార్‌కు దీటైన పాలనాదక్షుడైన నాయకుడు లేడు. శిందే తరహాలో ఏ హరీశ్ రావునో ఉపయోగించుకుంటే తప్ప, బిజెపికి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు.
అందువలన వాళ్ల రాజకీయం భాగ్యలక్ష్మి ఆలయం చుట్టూ తిరుగుతోంది. ఆ గుడి నా చిన్నప్పటి నుంచి ఉండేది, చిన్న స్థాయిలో! ఇప్పుడు దాని పరిమాణమే కాదు, స్థాయిని కూడా పెంచారు. కేంద్రం నుంచి ఏ బిజెపి నాయకుడు వచ్చినా వచ్చి సందర్శిస్తున్నారు. పాత బస్తీలో బిజెపి చురుగ్గా ఉంటూ చాలా ఏళ్లగా మజ్లిస్‌ను ఎదిరిస్తూ వచ్చింది. అప్పుడు ఆ గుడి గురించి పట్టించుకున్నది లేదు. నిన్నమొన్నటిదాకా జాతీయ నాయకులు అటు పోయినదీ లేదు. హఠాత్తుగా యుపిలో రామజన్మభూమి దొరికినట్లు, తెలంగాణలో భాగ్యలక్ష్మి దొరికిందన్నంత బిల్డప్ యిస్తున్నారు. ఇవన్నీ చూస్తే తెలంగాణలో దూసుకుపోవడానికి బిజెపి హిందూత్వ కార్డునే ఉపయోగిస్తుందని కచ్చితంగా అనుకోవచ్చు. త్వరలోనే బండి సంజయ్ యోగిజపం మొదలుపెట్టవచ్చు. నయా నిజాం కెసియార్ పాలన కావాలా? యోగి పాలన కావాలా? అనే ప్రశ్న తెలంగాణ ప్రజలకు సంధించవచ్చు.
ఇంతకీ యోగి పాలనలో అంత గొప్ప అంశాలున్నాయా? యుపి ఎన్నికల విశ్లేషణ వ్యాసాల్లో అతని పాలనలో మంచిచెడుల గురించి చాలా చర్చించాను. మళ్లీ వాటి జోలికి పోను కానీ, యోగి చేసిన ఒక పని మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఆ విషయంలో మాత్రం యోగి ముఖ్యమంత్రు లందరికీ ఆదర్శంగా నిలవాలనే కోరికతో యీ వ్యాసం రాస్తున్నాను. ఇటీవల రంజాన్ మాసంలో మసీదు లౌడుస్పీకర్లలో ప్రకటనలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ హిందూత్వ శక్తులు దేశంలో చాలా చోట్ల ఆందోళన చేశాయని అందరికీ తెలుసు. నమాజుకై పిలుపులకు ప్రతిగా హనుమాన్ చాలీసా చదువుతామని మహారాష్ట్రలో కొందరు ఉద్యమించడం చూశాం. యోగి చేసిన చక్కటి పని ఏమిటంటే అదే అదనుగా అన్ని మతాల ప్రార్థనాలయాల నుంచి లౌడుస్పీకర్లను పీకేయడం! ఏదైనా ప్రకటనలు చేయాలంటే సౌండు వాల్యూమ్ తగ్గించాలని కూడా ఆదేశాలు జారీ చేశాడు. మైకులు వాడవచ్చు కానీ శబ్దం ఆలయ లేదా మసీదు ప్రాంగణం బయటకి రాకూడదు.
ఏదైనా మార్పు రావాలంటే తనతోనే ప్రారంభం కావాలని చెప్పడానికై తను పీఠాధిపతిగా ఉన్న గోరఖ్‌నాథ్ గుడినుంచే మార్పులు మొదలుపెట్టాడు. మే నెలాఖరుకే 54 వేలకు పైగా గుళ్ల నుంచి, మసీదుల నుంచి లౌడు స్పీకర్లు పీకేశారు. ఎందుకంటే 2000 నాటి చట్టం ప్రకారం లౌడుస్పీకర్లు పెట్టుకోవడానికి అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు వీటిలో వేటికీ అనుమతులు లేవు. ఇన్నాళ్లూ ప్రభుత్వం కళ్లు మూసుకుంది కాబట్టి పెట్టుకున్నారు. ఇప్పుడు పీకేస్తే ఊరుకున్నారు. 60 వేలకు పైగా ప్రార్థనాలయాల శబ్దపరిమితిని తగ్గించివేశాడు. దీనికి 2018లోనే చేసిన చట్టాన్ని ఉపయోగించు కున్నారు. ఇన్నాళ్లూ దాన్ని అమలు చేయలేదు. ఇప్పుడు చేశారు. పైగా వారం వారం అధికారులు వెళ్లి శబ్దపరిమితి దాటారా లేదా అని చెక్ చేస్తామని చెప్పారు కూడా. ఈ చర్యలకు ఏ గుడి నుంచి, ఏ మసీదు నుంచి అభ్యంతరం రాలేదు. అందరూ హర్షించారు. ఎందుకంటే అందరి పట్ల సమన్యాయం వర్తింప చేశాడు కాబట్టి!
దీనితో పాటు చేసిన మరో మంచి పని ఏమిటంటే ఏ మతపరమైన ఊరేగింపు చేయాలన్నా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని ఆదేశాలివ్వడం. రంజాన్ మాసంలోనే యుపిలో హిందూ సంఘాలు రామనవమి, హనుమాన్ జయంతి శోభాయాత్రల పేర్లతో ఊరేగింపులు నిర్వహించడం, ఏదోలా ఘర్షణలు జరగడం ఆనవాయితీగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దిల్లీలోని జహంగీర్‌పురిలో హనుమాన్ జయంతి సందర్భంగా అల్లర్లు జరిగాయి. ఇలాటివి నివారించడానికై యుపి ప్రభుత్వం ఈ ఏడాది ఎవరైనా ఊరేగింపు నిర్వాహకులు అనుమతి కోసం అప్లికేషన్ పెట్టగానే శాంతిభద్రతలకు హామీ యిస్తూ అఫిడవిట్ యివ్వాలనే షరతు పెట్టింది. ఈ ఏడాది 800 రామనవమి ఉత్సవాలు జరిగాయి కానీ ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు.
అయోధ్యలో ఏప్రిల్ 28న మసీదు ఎదుట అభ్యంతరకరమైన వస్తువేదో పెట్టబడింది. ఇలాటి సందర్భాల్లో ఆ కారణం చూపి కొందరు ముస్లిములు రెచ్చిపోవడం, అదే అదనుగా హిందూత్వశక్తులు తిరగబడడం, యిద్దరూ ఘర్షణలకు దిగి, మతకలహాలకు దారి తీయడం జరుగుతూంటాయి. ఐతే యిక్కడ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్‌లలో చురుగ్గా ఉండే మహేశ్ మిశ్రా, అతని అనుచరులే యీ సంఘటనకు కారణం అని తేలింది. పోలీసులు వెంటనే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (ఇంతదానికి ఆ చట్టం అవసరమా?) కింద కేసు పెట్టారు.
మేరఠ్‌లోని హషీంపురాలో కొందరు బిజెపి నాయకులు రంజాన్ జరుగుతున్న మే2నే దేవీ జాగరణ్ నిర్వహిస్తామని పట్టుబట్టారు. గొడవలకు దారి తీయవచ్చు కాబట్టి వద్దని అక్కడి పోలీసు అధికారి అభ్యంతర పెట్టాడు. స్థానిక బిజెపి నాయకుడు అతనితో గొడవ పడి, దమ్ముంటే మా ఫంక్షన్ ఆపు చూదాం అన్న విషయం వాట్సాప్ వీడియో ద్వారా అందరికీ తెలిసిపోయింది. వెంటనే పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి, అవేళ్టికి జాగరణ్ను కాన్సిల్ చేయించారు. ముఖ్యమంత్రి తమకు మద్దతివ్వడన్న భయం ఉంటే వారు అందుకు సాహసించేవారు కారు.
పాలకుడు పక్షపాతరహితంగా వ్యవహరిస్తే ప్రజలందరూ హర్షిస్తారు. ఓట్ల కోసమో, భయం చేతనో, బుజ్జగించాలనో ఒక వర్గం వారు ఏం చేసినా ఊరుకుంటూ ఉంటే అవతలివాళ్లకు ఆగ్రహం కలుగుతుంది. శబ్దకాలుష్యం నివారించడానికి యోగి యుపిలో చేసిన పని తక్కిన ముఖ్యమంత్రులు ఎందుకు చేయకూడదు? అనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. మన దగ్గర గుళ్లు, మసీదులు, చర్చిలు అన్నీ లౌడుస్పీకర్లు పెట్టి హోరెత్తించేస్తూ ఉంటాయి. పండగ సమయాల్లో పిచ్చెక్కిచేస్తూ ఉంటారు. అధికారులు చూసీచూడనట్లు ఊరుకుంటారు. పౌరుల్లో ఎవరైనా ఫిర్యాదు చేస్తే నిర్వాహకులు చావగొడతారు. ‘‘రోబో’’ సినిమాలో దీనిపై ఒక సీను పెట్టారు కూడా. ప్రభుత్వం తలచుకుంటే యీ కాలుష్యాన్ని నివారించ గలదు.
2020 మే 15నాటి తీర్పులో ఇలాహాబాద్ హై కోర్టు నమాజుకై పిలిచే అజాన్ ఎలా ఉండాలో నిర్వచించింది. ఇస్లామిక్ పూజారి ముయెజ్జిన్ అజాన్‌ను మసీదు గోపురం నుంచి వల్లించవచ్చు కానీ లౌడుస్పీకరు కానీ, మైకు కానీ వినియోగించరాదు. ఇక లౌడుస్పీకర్ల వినియోగం గురించి సుప్రీం కోర్టు తన 2005 నాటి తీర్పులో ఏం చెప్పిందంటే, పండగ రోజుల్లో అర్ధరాత్రి వరకు వాటిని వాడవచ్చు. అలాటి పండగలు ఏడాదిలో 15 రోజులకు మించకూడదు. ఇండస్ట్రియల్ ఏరియాలలో పగటి పూట 75 డిసిబెల్స్కు మించి శబ్దం ఉండరాదు. రాత్రి అది 70. కమ్మర్షియల్ ఏరియాలలో పగలు 65, రాత్రి 55. రెసిడెన్షియల్ ఏరియాలలో పగలు 55, రాత్రి 45. ఆసుపత్రులు, విద్యాలయాలు, కోర్టులు, ప్రార్థనలయాలు వంటి వాటికి 100 మీటర్ల వ్యాసంలో ఉన్న ప్రాంతాన్ని సైలెన్స్ జోన్ అంటారు. వాటిలో పగలు 50, రాత్రి 40. అన్ని రకాల శబ్దాలు కలిపి యీ పరిమితులన్నమాట. లౌడుస్పీకర్లయితే వాటి శబ్దం 10 డెసిబెల్స్‌కు మించి ఉండకూడదు. వ్రాతపూర్వకమైన అనుమతి లేకుండా పెట్టకూడదు. సాధారణంగా రాత్రి 10 గంటల తర్వాత వాటిని వాడకూడదు.
చట్టాలిన్ని ఉన్నా అమలు చేసే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు లేదు. మతపరమైన విషయం అనగానే చర్య తీసుకోవడానికి జంకుతున్నారు. నిజానికి మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా రోడ్లు విశాలం చేయడానికి ఎన్నో గుళ్లు తీయించేశాడు. ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్ ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. మన తెలుగు రాష్ట్రాలలో రహదారులపైనే కాదు, హైవేల మీద కూడా గుళ్లు, దర్గాలు కొత్తగా వెలుస్తున్నాయి. పాతవాటిని విస్తరిస్తున్నారు. హైదరాబాదులో అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ ఎత్తేసి యు టర్న్‌లు లెక్కకు మిక్కిలిగా పెట్టారు. ఈ తిరుగుడులో పెట్రోలు విపరీతంగా ఖర్చవుతోంది. దానికి తోడు రోడ్ల మీద గుళ్ల కారణంగా రోడ్డు చిక్కిపోయి ట్రాఫిక్ నత్తనడక నడుస్తోంది. గుడి మాత్రమే రాదు, దాని చుట్టూ ప్రాకారం, బలిపీఠం, పూల దుకాణం, కొబ్బరికాయల కొట్టు, చెప్పులు, ఇనుపచువ్వల కంచె.. యిన్ని వచ్చి చేరుతున్నాయి. నిజంగా భక్తి ఉన్నవాళ్లయితే ఎక్కడో విశాలమైన ప్రాంగణంలో గుడి కట్టేవారు. ఇది భక్తి ప్రదర్శన కాదు, ఆధిపత్య ప్రదర్శన. మేం విగ్రహాన్ని పెడతాం, ఎవడొచ్చి తీస్తాడో చూస్తాం అనే దాష్టీకం. చట్టాన్ని చూపించి తీసేద్దామంటే, ఆ వర్గం వాళ్ల ఓట్లు పోతాయేమోనన్న భయం. అలాటి భయాలు లేకుండా కొన్ని విషయాలలో నైనా తెగువ చూపినందుకు యోగిని అభినందించాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2022)