రాజకీయాల్లో ప్రతీ విషయం కొత్తగా ఉంటుంది. చిత్రవిచిత్రంగా ఉంటుంది. నిజమేదో, అబద్ధమేదో ఓ పట్టాన తేలదు. మీడియాలో జరిగే ప్రచారం ఒక విధంగా ఉంటే, సర్వేల్లో వెల్లడయ్యే విషయాలు మరో విధంగా ఉంటాయి. ప్రాంతీయ మీడియా చేసే ప్రచారం ఒక విధంగా ఉంటే, జాతీయ మీడియా సంస్థలు చేసే సర్వేలు మరో విధంగా ఉంటాయి. ఈ రెండింటికీ అసలు పొంతన ఉండదు.
ఏపీలో జగన్ ప్రభుత్వ పాలన గురించి ఎల్లో మీడియా రాసే వార్తా కథనాల గురించి అందరికీ తెలిసిందే. ఆ మీడియాకు అడిక్ట్ అయినవారికి ఆ కథనాలే నిజమనిపిస్తాయి. పాఠకులను లేదా వీక్షకులను (టెలివిజన్) నమ్మించేలా కథనాలను వండి వారుస్తారు. కానీ జగన్ ప్రభుత్వ పాలన గురించి జాతీయ మీడియా సంస్థలు చేస్తున్న సర్వేలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటున్నాయి.
ప్రాంతీయ మీడియాకు కనబడుతున్న లొసుగులు, వైఫల్యాలు జాతీయ మీడియాకు ఎందుకు కనబడవో అర్థం కాదు. జాతీయ మీడియా విషయానికొస్తే ఇండియా టుడేకు ఎంతటి పేరుందో అందరికీ తెలుసు. ఆ సంస్థకు ప్రింట్, విజువల్ మీడియా కూడా ఉన్నాయి. ఈ సంస్థ ప్రతి ఏడాది జాతీయ (కేంద్ర) ప్రభుత్వం గురించి, దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాల గురించి సర్వేలు చేస్తుంది. అలాగే ప్రధాని, ముఖ్యమంత్రుల పనితీరు, వారి ప్రజాదరణ గురించి సర్వేలు చేస్తుంది. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో చాలా ఏళ్లుగా ఈ సర్వేలు కొనసాగుతున్నాయి. ఇండియా టుడే – సీ ఓటర్ సంయుక్త 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వేలో ఆసక్తి కర అంశాలు వెల్లడయ్యాయి. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో..ఏపీకి సంబంధించి ఆసక్తి కర సమీకరణాలను బయట పెట్టింది.
ఏపీలో మూడేళ్లకు పైగా సాగుతున్న జగన్ పాలన పైన ప్రజాభిప్రాయం పసిగట్టే ప్రయత్నం చేసింది. ఈ సర్వేలో తేలిన ప్రధాన విషయమేమిటంటే … జగన్ కు గతంలో కంటే ప్రజాదరణ పెరిగింది. 2019 ఎన్నికల్లో 50 శాతం ప్రజలు ఏపీలో జగన్ కు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఈ సర్వేలో జగన్ ను సీఎంగా కోరుకుంటున్న వారి సంఖ్య 57 శాతంగా తేల్చారు. అంటే ప్రజాదరణ పెరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉండొచ్చు. ప్రధానంగా సంక్షేమ పథకాలు కారణమై కావొచ్చు. ఎందుకంటే ఏపీలో అభివృద్ధి లేదనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఇందులో కొంత వాస్తవం కూడా ఉంది. కానీ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఏపీలో సంక్షేమాభివృద్ధి పథకాలు, సామాజిక న్యాయాన్ని ప్రజలు ఆదరిస్తున్నట్లుగా సర్వేలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అయితే, ఏపీలో రాజకీయంగా బలం పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ నామమాత్రంగానే ఉన్నట్లుగా పేర్కొన్నారు. జనసేన బలం గురించి ప్రస్తావన లేదు. ఈ సర్వేలో ఏపీలో వైసీపీ ఆధిపత్యం కొనసాగుతోందని తేలింది. ముఖ్యమంత్రి జగన్ ప్రజాదరణ విషయంలో నూ క్లారిటీ ఇచ్చింది. ఏపీలో ఎన్నికలు జరిగితే వైసీపీకి 18 లోక్ సభ స్థానాలు దక్కుతాయని సర్వేలో అంచనాకు వచ్చారు. టీడీపీ 7 సీట్లకు పరిమితం కానుంది. ఇక, ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో దేశ వ్యాప్తంగా అయిదో స్థానంలో సీఎం జగన్ నిలిచారు. దేశ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో వరుసగా యోగి ఆదిత్యనాథ్ (ఉత్తరప్రదేశ్), అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్), ఎంకే స్టాలిన్(తమిళనాడు), తరువాతి స్థానంలో జనగ్ ఉన్నారు.
అదే విధంగా.. ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగాలని 57 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లు సర్వే స్పష్టం చేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందు ఈ సర్వే జరిగింది కాబట్టి ఇదే ఫైనల్ అని చెప్పలేం. కొద్ది రోజుల క్రితం ఇండియా టీవీ నిర్వహించిన సర్వేలో వైసీపీకి 19 లోక్ సభ సీట్లు వస్తాయని పేర్కొనగా.. ఇప్పుడు ఈ సర్వేలో 18 సీట్లు వస్తాయని అంచనాలు వ్యక్తం అయ్యాయి.
టీడీపీ కొంత మేర గతం కంటే పుంజుకున్నా వైసీపీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో.. ఇప్పుడు ఈ సర్వే ఫలితాలు రాజకీయంగా ఏపీలో ఆసక్తి కర చర్చకు కారణమయ్యాయి. ఎన్నికల ముందు సర్వే చేస్తేగానీ అసలు విషయాలు తెలుస్తాయి.