కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమినుంచి బయటకు వచ్చి.. గతంలో తాము విడచిపెట్టిన కాంగ్రెస్, ఆర్జేడీలతో మళ్లీ జట్టు కట్టడం వెనుక ఎవ్వరు ఊహించుకునే కారణాలు వారికి ఉన్నాయి. మెజారిటీ జనం సబబుగా ఉన్నవని ఆమోదించడాన్ని బట్టి.. మహారాష్ట్ర తరహాలో బీహార్ లో కూడా జెడియూ పార్టీని చీల్చి.. బీజేపీ సారథ్యంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కమలదళం ప్రయత్నిస్తున్నదనేది ప్రధానమైనది. మిగిలినవి దీనికి అనుబంధ ఊహలు.
నితీశ్ మాత్రం తమ పార్టీకి నాలుగు కేంద్రమంత్రి పదవులు అడిగితే ఇవ్వలేదని ఒక కొత్త కారణం చెబుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు కాగా.. లాలూప్రసాద్ యాదవ్ కొడుకు, ప్రస్తుతం ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మాట్లాడుతున్న మాటలు ఇంకో రకంగా ఉన్నాయి.
తేజస్వి పూర్తిగా కులాల కొలబద్ధల మీదనే మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ, ప్రాంతీయ పార్టీలను తొక్కేస్తుందని, ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని సమూలంగా తుడిచేయడం ద్వారా.. దేశంలో ప్రజాస్వామ్యానికి చెప్పలేనంత హాని చేస్తుందని అందరూ అంటూ ఉంటారు. తేజస్వి కూడా అదే అంటున్నారు. అలా ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసే ఆలోచన గల పార్టీ గనుకనే.. పొత్తునుంచి ముందుగా జాగ్రత్తపడి నితీశ్ బయటకు వచ్చినట్లు చెబుతున్నారు.
కాకపోతే.. ప్రాంతీయ పార్టీలకు తేజస్వి కులాల నిర్వచనం ఇస్తున్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ బీసీలు, దళిత కులాల పార్టీలట. నితీశ్ కూడా వెనుకబడిన వాడేనట. కాబట్టి దెబ్బ కొట్టడానికి కేంద్రం కుట్ర చేసిందట. అయినా తేజస్వి ఆరోపణల ప్రకారం.. దెబ్బ కొట్టడానికి చూసిన మోడీ కూడా వెనుకబడిన వాడే కద. మరి ఈ లాజిక్ ఆయనకు ఎలా స్ఫురిస్తుందో తెలియదు. రాంవిలాస్ పాశ్వాన్ పార్టీని కూడా ఈ కులాల కుట్రతోనే బిజెపి రెండుగా చీల్చిందని ఇవాళ తేజస్వి ఆరోపిస్తున్నారు.
శత్రువును రూపుమాపడానికి బిజెపి అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందనేది అందరికీ తెలిసిన సంగతి. అయితే.. శత్రువు బిసి అయితే దెబ్బకొట్టాలని, ఓసీ అయితే ఉపేక్షిస్తుందని అనుకోవడం మాత్రం భ్రమ. తేజస్వి యాదవ్ కు చేతనైతే.. భారతీయజనతా పార్టీ అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక పోకడల్ని ఎత్తిచూపించి.. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి గానీ.. ఇలా తమ కొత్తపొత్తులకు పవిత్రతను పులుముకోవడానికి కులం రంగులు పులుముకోవడం చాలా హేయంగా ఉంది.
ఇది ఒక్క తేజస్వీతో వచ్చిన సమస్య కాదు కదా.. ఆయన తండ్రి లాలూప్రసాద్ హయాం నుంచి కూడా వారంతే.. కులం రంగు పులుముకోకుండా బతకలేరని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.