ఒక వైపు భార్యాభర్తలుగా విడిపోతున్నామంటూనే, మరోవైపు విడాకులపై కొత్త భాష్యం చెబుతున్నారా దంపతులు. 15 ఏళ్ల వివాహ బంధానికి తాము స్వస్తి చెబుతున్నట్టు బాలీవుడ్ స్టార్ కపుల్ ఆమిర్‌ఖాన్-కిరణ్‌రావు స్పష్టం చేశారు. ఈ మేరకు వాళ్లిద్దరు ఓ ప్రకటన చేశారు. ఇకపై దంపతులుగా విడిపోతున్నామని చెబుతూనే, తమ ఎడబాటును అలా చూడండి, ఇలా చూడండి అంటూ చెప్పుకురావడం గమనార్హం. కుమారుడి బాధ్యతల్ని మాత్రం ఇద్దరూ కలిసి చూడనున్నట్టు వెల్లడించారు.
ఆమిర్‌ఖాన్‌కు వివాహ బంధం కలిసి రానట్టుంది. మొదట ఆయన రీనా దత్తా నుంచి విడాకులు తీసుకున్నారు. బ్లాక్‌బస్టర్ సినిమా ‘లగాన్’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించిన కిరణ్‌రావును ఆ సినిమా హీరో ఆమిర్‌ఖాన్ ప్రేమించారు. 2005, డిసెంబర్ 28న పెళ్లి చేసుకున్నారు. 2011లో సరోగసి విధానంలో ఆజాద్ అనే అబ్బాయికి జన్మనిచ్చారు. అనంతరం ఏర్పడిన మనస్పర్థలు విడాకులకు దారి తీశాయి. విడిపోతున్న నేపథ్యంలో ఇద్దరూ కలిసి చేసిన ప్రకటన వైరల్ అవుతోంది. ఆ ప్రకటనలో ఏమున్నదంటే…
‘ 15 సంవత్సరాల వైవాహిక బంధం జీవిత కాలానికి సరిపడా ఎన్నో చిరునవ్వులు, ఆనందాలు, సంతోషాలను అందించింది. ప్రేమ, నమ్మకం, గౌరవంతో మా బంధం మరింత బలపడింది. ఇప్పుడు మా జీవితాల్లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. ఇకపై భార్యాభర్తలుగా కాకుండా తల్లిదండ్రులు, కుటుంబసభ్యులుగా ఉండాలనుకుంటున్నాం. ఎంతోకాలం నుంచి మేము విడిపోవాలని అనుకుంటున్నాం.
విడాకులు తీసుకోవడానికి, కొత్త ప్రయాణాన్ని ఆరంభించడానికి ఇదే సరైన సమయంగా మేము భావిస్తున్నాం. మా కుమారుడు ఆజాద్‌కి తల్లిదండ్రులుగా ఉంటూ అతని బరువు, బాధ్యతలు ఉమ్మడిగా చూసుకుంటాం. అలాగే, పానీ ఫౌండేషన్, ఇతర వృత్తిపరమైన విషయాల్లో మేమిద్దరం కలిసే పనిచేస్తాం. ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన కుటుంబసభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు. మా వైవాహిక బంధానికి ముగిం పులా మీరు ఈ విడాకులను చూడకండి. ఇది కేవలం కొత్త ప్రయాణానికి నాంది మాత్రమే అనుకోండి’ అని ఆమిర్, కిరణ్‌రావు ప్రకటించారు.
ఒకవైపు ఎన్నో చిరునవ్వులు, ఆనందాలు, సంతోషాలను అందించిందంటూనే విడిపోవడం చర్చకు దారి తీస్తోంది. ప్రేమ, నమ్మకం, గౌరవంతో తమ బంధం బలపడిందని చెబుతున్న నేపథ్యంలో ….మరి ఎందుకు విడిపోతున్నారనే ప్రశ్నలకు తావిస్తోంది. వైవాహిక బంధానికి ముగింపులా కాకుండా విడాకులను మరోలా ఎలా చూడాలో అనే అనుమానాలు నెటిజన్లు వ్యక్తం చేస్తుండడం విశేషం. ఏది ఏమైనా బాలీవుడ్ స్టార్ కపుల్ విడిపోతుండటం సర్వత్రా చర్చకు దారి తీసింది.