ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కామన్. బహుశా సెంటిమెంట్స్ లేని హీరోలు, దర్శకులు పరిశ్రమలో ఉండరేమో అనిపిస్తుంది. డైరక్టర్ శ్రీనువైట్ల కూడా అలాంటి ఓ సెంటిమెంట్ ను బయటపెట్టాడు. తనకు కెరీర్ లో గ్యాప్ వచ్చింది కాబట్టి, ఈసారి హిట్ గ్యారెంటీ అంటున్నాడు వైట్ల.
“గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది. డీ అండ్ డీ స్టార్ట్ అవ్వాల్సింది. కరోనా వల్ల ఏడాది మొత్తం పోయింది. ఈ గ్యాప్ ను అడ్వాంటేజ్ గా తీసుకొని 3 స్క్రిప్టులు రెడీ చేసుకున్నాం. ఇకపై ఆ 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వస్తాయి. గతంలో ఓసారి ఇలానే చిన్న గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఢీ, దుబాయ్ శీను, రెడీ వరుసగా వచ్చి హిట్టయ్యాయి. ఈసారి కూడా డీ అండ్ డీతో పాటు 3 సినిమాలు కూడా వరుసగా వస్తాయి.”
సో.. ఈసారి కూడా తన సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు శ్రీనువైట్ల. ఓవైపు గ్యాప్ వచ్చినా తన పంథా మాత్రం మార్చలేదు ఈ దర్శకుడు. తన నుంచి ఆడియన్స్ పూర్తిస్థాయి వినోదం ఆశిస్తారు కాబట్టి, తన అప్ కమింగ్ సినిమాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందంటున్నాడు.
మంచు విష్ణుతో చేయబోయే డీ అండ్ డీ (డబుల్ డోస్) యాక్షన్ కామెడీ సబ్జెక్ట్ తో వస్తోందట. ఈ మూవీ తర్వాత చేయబోయే సినిమాలో యాక్షన్ కామెడీతో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటాయట. ఇక మూడో ప్రాజెక్టు మాత్రం పూర్తిస్థాయిలో క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతోందని చెప్పుకొచ్చాడు వైట్ల. తను ఏ జానర్ టచ్ చేసినా అందులో కామెడీ మాత్రం ఉంటుందని, నవ్వించడమే లక్ష్యంగా కథలు రాసుకున్నానని ఫైనల్ గా ముక్తాయింపు ఇచ్చాడు ఈ దర్శకుడు.